దీపికా-రణ్వీర్, సోనమ్-ఆనంద్, అనుష్క-విరాట్, బిపాసా-కరణ్, కరీనా-సైఫ్.. ఇలా చెప్పుకుంటూ పోతే బాలీవుడ్ ప్రేమ పక్షుల జాబితా చాలా పెద్దదే అవుతుంది. ప్రేమతో మొదలైన వీరి బంధం పెళ్లితో ఏకమై ఎంతో అన్యోన్యంగా కొనసాగుతోంది. ఇలాంటి ప్రణయబంధంలోకి బాలీవుడ్‌కు చెందిన మరో ప్రేమ జంట అడుగిడనుందా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. బాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో ఒకరిగా పేరుగాంచిన రిచా చద్దా, అలీ ఫజల్ త్వరలోనే పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారట. కొన్నేళ్ల నుంచి డేటింగ్లో ఉన్న ఈ మేడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్ తాజాగా మాల్దీవుల వెకేషన్లో సందడి చేస్తోంది. ఈ క్రమంలో త్వరలోనే పెళ్లి పీటలెక్కేందుకు నిర్ణయించుకున్నారని వార్తలు వస్తున్నాయి. మరి, ఇంతకీ ఈ అందాల జంట పెళ్లి ఎప్పుడు? ఎక్కడ జరగనుంది?అసలు వీరి ప్రేమ కథ ఎప్పుడు, ఎలా మొదలైంది? తెలియాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే..!

అలా మొదలైంది..
సినిమాను వృత్తిగా ఎంచుకున్న ఈ జంటను ఓ సినిమానే కలపడం విశేషం. అటు రిచా, ఇటు అలీ ఫజల్ వరుస సినిమాలతో దూసుకెళుతోన్న సమయంలో ఒకే చిత్రంలో కలిసి నటించిందీ జంట. 2012లో షూటింగ్ మొదలై 2013లో విడుదలైన ‘ఫక్రీ’ అనే సినిమాలో కలిసి నటించారు రిచా-అలీ. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహ బంధం పెనవేసుకుంది. మూడేళ్ల పాటు మంచి స్నేహితులుగా ఉన్న వీరిద్దరికి.. ఒకరి అభిప్రాయాలు, ఇష్టాలు.. మరొకరికి నచ్చడంతో ప్రేమికులుగా మారారు. 2015 నుంచి డేటింగ్లో ఉన్న ఈ జంట.. గుట్టు చప్పుడు కాకుండా, మీడియా కంటపడకుండా ప్రేమలో మునిగితేలారు. ఇక రెండేళ్ల తర్వాత.. అంటే 2017లో తాము ప్రేమలో ఉన్నామని ప్రపంచానికి చాటి చెప్పారు. అప్పటి నుంచి అడపాదడపా ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం ప్రారంభించారీ లవ్లీ కపుల్. ఈక్రమంలో ఈ జంట రేపోమాపో పెళ్లి చేసుకోనుందని గతంలో చాలాసార్లు పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఆ వార్తలను వీరిద్దరూ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. అయితే తాము ఇప్పటికిప్పుడు వివాహం చేసుకోలేకపోవడానికి ‘సినిమాలు, షూటింగ్‌లతో ఇద్దరం బిజీగా ఉండడమే’ కారణమని చెబుతూ ఆ విషయాన్ని సున్నితంగా దాటేసే ప్రయత్నం చేసిందీ ముద్దుల జంట.

ఎట్టకేలకు పెళ్లిపీటలెక్కబోతున్నారట!
అయితే ఐదేళ్ల నుంచి ప్రేమలో మునిగితేలుతున్న ఈజంట ఈ ఏడాది కచ్చితంగా పెళ్లి భోజనం పెట్టనున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ఖండించిన రిచా-అలీ.. ఈసారి మాత్రం ఈ ప్రశ్నకు ‘ఊ’ అని, ‘ఊహూ’ అని అనలేదట. ప్రస్తుతం మాల్దీవుల్లో హాలిడేని ఎంజాయ్ చేస్తోన్న ఈ స్వీట్ కపుల్ అక్కడే పెళ్లి నిర్ణయం తీసుకున్నారట. ఈ క్రమంలో అలీ.. తన ప్రేయసి రిచాతో ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అడిగేసరికి అతని ప్రేమకు కరిగిపోయి వెంటనే ఓకే చెప్పేసిందట. మరి, వీరిద్దరి పెళ్లి ముహూర్తం ఎప్పుడో తెలుసా..? ఏప్రిల్ 15న జరగనుందట. అది కూడా వారి వివాహ వేడుకలు అత్యంత సమీప బంధువుల మధ్య దిల్లీలో జరగనున్నాయని, అనంతరం ముంబయిలో బాలీవుడ్‌కు చెందిన ప్రముఖుల కోసం గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.

అభిరుచులు కలిశాయి!
ఇక తమ పెళ్లి విషయమై ఓ ఇంటర్వ్యూలో భాగంగా రిచా మాట్లాడుతూ.. ‘అలీ ఎప్పుడూ నాకు పూర్తి అండగా ఉంటాడు. మా ఇద్దరినీ పక్కపక్కన చూసిన వారెవరూ ఈ జోడీ చూడ్డానికి బాలేదనలేరు. మనలాగే ఆలోచించే వ్యక్తి దొరకడం చాలా అరుదు. సంగీతం, కవిత్వం, సాహిత్యం, సినిమాలు అంటే మా ఇద్దరికీ చాలా ఇష్టం. మనం పనిచేసే రంగంలో ఒకే అభిరుచులున్న వ్యక్తి మనకు తారసపడడం నిజంగా చాలా అరుదు. ఇలా మేమిద్దరం కలుసుకుంటామని ఎప్పుడూ అనుకోలేదు.. అది అలా జరిగిపోయిందంతే!’ అంటూ మురిసిపోయిందీ బ్యూటీ. ఇక ఈ విషయం గురించి అలీ మాట్లాడుతూ.. ‘పెళ్లి అనే బంధం ఎంతో అందమైంది. నేను వివాహ వ్యవస్థలోని పవిత్రతను ఎంతో నమ్ముతాన’ని చెప్పుకొచ్చాడు.

కెరీర్లోనూ పోటాపోటీగా..
2008లో వచ్చిన ‘ఓయ్ లక్కీ.. లక్కీ ఓయ్’ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది నటి రిచా చద్దా. అనతి కాలంలోనే మంచి నటిగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ‘మసాన్’, ‘సెక్షన్ 375’ వంటి చిత్రాల్లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ ఏడాది విడుదలైన ‘పంగా’ చిత్రంలో కూడా నటించింది రిచా. ఇక ప్రస్తుతం దక్షిణాదికి చెందిన ప్రముఖ తార ‘షకీలా’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రంలో నటిస్తోందీ బ్యూటీ.

ఇక అలీ ఫజల్ కెరీర్ విషయానికొస్తే.. శ్రియ హీరోయిన్గా నటించిన ఇండో-అమెరికన్ రొమాంటిక్ మూవీ ‘ది అదర్ ఎండ్ ఆఫ్ ది లైన్’ అనే చిత్రంలో అతిథి పాత్ర ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. పలు హాలీవుడ్ చిత్రాల్లోనూ నటించిన అలీ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్‌ల్లో నటిస్తోన్న ఈ రొమాంటిక్ గయ్.. ‘డెత్ ఆన్ నైల్’ అనే థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
ఐదేళ్ల నుంచీ ప్రేమలో మునిగి తేలుతూ.. వివిధ దేశాల్లో పర్యటిస్తూ.. ఇద్దరూ కలిసి ఫొటోలు దిగుతూ.. వాటిని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ మురిసిపోయిందీ జంట.. వాటిపై ఓ లుక్కేద్దామా?