ఎప్పుడూ సంతోషంగా ఉంటామని తెలుసుకున్నాం.. ఇద్దరం ఒక్కటయ్యాం!
అతనేమో టీమిండియా అల్లరి కుర్రాడు. ఆన్‌ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్ ఎక్కడైనా అందరినీ నవ్విస్తూ ఉంటాడు. ఆమేమో అందం, ప్రతిభ కలగలిపిన డ్యాన్సర్ అండ్ కొరియాగ్రాఫర్. మిస్టరీ స్పిన్నర్ మణికట్టు మాయజాలం, సెన్సాఫ్ హ్యూమర్‌కు ఆమె ముగ్ధురాలైతే, ఆ యూట్యూబ్ స్టార్ అందం, డ్యాన్స్‌కు ఆ క్రికెటర్ క్లీన్ బౌల్డయ్యాడు. అలా మొదట ఇద్దరి కళ్లూ-కళ్లూ కలిశాయి. ఆ తర్వాత మనసూ-మనసూ మాట్లాడుకున్నాయి. తమ ప్రేమ బంధాన్ని శాశ్వతం చేసుకోవాలని పట్టుబట్టాయి. పెద్దలు కూడా వారి ప్రేమను ఆశీర్వదించడంతో పెళ్లి పీటలెక్కారు. వారే టీం ఇండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్, డ్యాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ. కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ లవ్‌బర్డ్స్ తాజాగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలో తమ వివాహానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారీ లవ్లీ కపుల్. దీంతో క్రికెట్, సినిమా రంగాలకు చెందిన సెలబ్రిటీలతో పాటు అభిమానులు, నెటిజన్లు నూతన వధూవరులకు అభినందనలు చెబుతున్నారు.