హాయ్ మేడమ్.. నా పేరు స్పందన. నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాను. మాది మధ్యతరగతి కుటుంబం. మా నాన్న గారికి కోపం ఎక్కువ. అమ్మని అసలు లెక్క చేయరు. ఎప్పుడూ ఏదో ఒకటి అని బాధపెడుతుంటారు. కొన్నిసార్లు ఆ బాధను తట్టుకోలేక చనిపోవాలనుకుంది. కానీ ఎప్పటికప్పుడు అమ్మకి ఓదార్పునిస్తూ, బాధల్ని దిగమింగుతూ బతుకుతున్నాం. నాకు ఒక చెల్లి కూడా ఉంది. నేను బీటెక్ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు మా నాన్న స్నేహితుని కొడుకు మా అమ్మతో నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దానికి అమ్మ ముందు బాగా చదువుకోమని, తర్వాత ఎలాగైనా మీ పెళ్లి చేస్తానని చెప్పింది. చిన్నప్పట్నుంచి నాన్న ప్రవర్తన చూసిన నేను పెళ్లి అనగానే మొదట ఒప్పుకోలేదు. కానీ చివరికి అమ్మ నన్ను ఒప్పించింది. ఆ సమయంలో అతను నేను అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. చివరికి అతను లెక్చరర్ అయ్యాడు. ఆ సమయంలో నేను బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాను. ఇంకో రెండు సంవత్సరాల్లో జాబ్ తెచ్చుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఒక్కసారి ఆ బాధని తట్టుకోలేకపోయాను. ఇక మగాళ్లను నమ్మకూడదని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. ఆ తర్వాత బీటెక్ చివరి సంవత్సరంలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం సంపాదించుకున్నాను.

నాతో పాటు ఉద్యోగం చేస్తున్న మరో అబ్బాయితో పరిచయం ఏర్పడింది. తను నన్ను ఇష్టపడుతున్నాడనే విషయం నాకు అర్థమయ్యింది. నేను తనకి దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నా తను మాత్రం నన్ను వదలలేదు. తర్వాత అతను వేరే కంపెనీలో ఉద్యోగం చూసుకున్నాడు. తను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని నాతో చెప్పాడు. ఆ అమ్మాయిని నేనే అని నాకర్థమైంది. కానీ ఎప్పుడూ తన దగ్గర నాకు అర్థమైనట్లుగా ప్రవర్తించలేదు. తను ఎప్పుడూ నన్ను ఇబ్బంది పెట్టలేదు. వాళ్ల అక్కాబావలతో కూడా ఈ విషయం చెప్పాడు. వాళ్లు కూడా ఓకే అన్నారు. నాతో వాళ్లు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. అయితే అతని తల్లిదండ్రులకు కుల పిచ్చి. ఇంకా కట్నం కూడా ఎక్కువ తీసుకోవాలనే ఆశ ఉంది. కానీ ఆ అబ్బాయి ఇలాంటి వాటికి దూరంగా ఉండే మనిషి. డబ్బు, కులాన్ని పట్టించుకోడు. తనలోని ఇలాంటి భావాలను చూసే నేను అతనిని ఇష్టపడ్డాను. కానీ తనకు చెప్పలేదు. తనను మిస్సవ్వకూడదని అప్పుడప్పుడు తాను ప్రేమిస్తున్న అమ్మాయిని మీ వాళ్లు ఒప్పుకుంటారా అని అడుగుతుండేదాన్ని. తన ప్రవర్తన బాగా నచ్చింది. ప్రతి విషయాన్ని నాతో పంచుకుంటాడు. నేను కూడా గతంలో పెళ్లి చేసుకోవాలనుకున్న అబ్బాయి గురించి అతనికి చెప్పాను. మా ఇద్దరిదీ వేరే కులం. పెద్దవాళ్లను ఎలా ఒప్పించాలో తెలియడం లేదు. ఇలా ఒకరికొకరం మా ప్రేమను చెప్పుకోకుండా ముందు తల్లిదండ్రులను ఒప్పించాలనే ఆశతో ఉన్నాం. కానీ ఎలా ఒప్పించాలో తెలియడం లేదు. అసలు మేము ఆలోచించేది సరైందో? కాదో? తెలియడం లేదు. ఏం చేయమంటారు?
జ. మీ సుదీర్ఘమైన ఉత్తరంలో మీ నాన్న గారి ప్రవర్తన, మీ అమ్మ బాధపడడం, మీ అమ్మను ఓదారుస్తూ మీ నాన్న విషయంలో బాధపడుతూ పెరిగి పెద్దవాళ్లవడం ఇదంతా వివరంగా రాశారు. అయితే మీ నాన్న గారి ప్రవర్తనని మార్చడానికి పిల్లలుగా మీరేమైనా ప్రయత్నం చేశారా? అనేది ఎక్కడా ప్రస్తావించలేదు. అలాగే మీ అమ్మ తరఫు వాళ్లు గానీ, మీ నాన్న తరఫు వాళ్లు గానీ ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్లేమైనా ప్రయత్నం చేశారా? అనేది కూడా మీరు ప్రస్తావించలేదు.
అది ఆలోచించారా?
మీ అమ్మగారు మీ గురించి ఆందోళనతో మీ చదువు ఇంకా పూర్తి కాకుండానే ఎవరో ఒక వ్యక్తినిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. అయితే ఎప్పుడూ మీ అమ్మగారికి అండగా నిలవని మీ నాన్నగారు దీనికి ఒప్పుకున్నారో లేదో మీరు చెప్పలేదు. కేవలం మీవైపు నుంచి మీరు ఆలోచించడం, మీ అమ్మగారు నచ్చజెప్పడం, కొంతకాలానికి మీరు ఒప్పుకోవడం.. ఇలాంటి మాటలే తప్పితే నిజంగా ఇది జరిగే విషయమా? కాదా? అనేది ఆలోచించలేదు. అలాగే అందులో మీ నాన్న గారి పాత్ర ఏమిటి? ఇద్దరి తల్లిదండ్రుల పాత్ర ఏమిటి? మీ తండ్రికి, అతని తల్లిదండ్రులకు అతను మిమ్మల్ని ఇష్టపడుతున్నాడనే విషయం తెలుసా? ఇవేవీ తెలియకుండానే అతడు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాడని నమ్మారు. అలాగే కారణాలేవైనా అతను మీకు దూరంగా వెళ్లడంతో తిరిగి మీ నాన్నగారి మీద, పురుషుల మీద మీకున్న వ్యతిరేక భావన మరింత రెట్టింపైంది.

అది నిజంగా ప్రేమేనా?
ఇక ప్రస్తుత విషయానికొస్తే మీరు ఇష్టపడుతున్నారన్న అబ్బాయి విషయంలో అతడు మిమ్మల్నే ఇష్టపడుతున్నాడనే విషయం అతను స్వయంగా మీకు ఏ రోజూ చెప్పలేదు. అలాగే అతని అక్కాబావలు మీలాగా మిగతావారితో కూడా మాట్లాడుతున్నారా? లేదా? అనే విషయం తెలియదు. వాళ్ల అక్కాబావలు మాట్లాడినంత మాత్రాన అతను ఇష్టపడుతున్న వ్యక్తి మీరేనని అంత కచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? మీరు ఎలా నమ్ముతున్నారు? అనే విషయాన్ని లోతుగా ఆలోచించండి. అతను మిమ్మల్ని ప్రేమించేవాడైతే... అతని అక్కాబావలకు చెప్పినవాడు.. వారి ద్వారా అతని తల్లిదండ్రులకు ఎందుకు చెప్పలేదు? అనే విషయాన్ని ఆలోచించండి. మీ ప్రేమ గురించి మీ ఇద్దరే ఒకరికొకరు ఇప్పటివరకు స్పష్టంగా చెప్పుకోలేదు. అసలు అతను నిజంగా మిమ్మల్నే ప్రేమిస్తున్నాడో లేదో కూడా తెలియదు. అలాంటప్పుడు ఇంక మీ ఇరువురి తల్లిదండ్రులను ఒప్పించాలన్న ప్రశ్న ఎక్కడొస్తుంది? మీ ఇద్దరి మధ్య స్పష్టత లేనప్పుడు 'మా వాళ్లకు కుల పిచ్చి.. వాళ్లకు కుల పిచ్చి, కట్నం అడుగుతారు' అనుకోవడం ఎంతవరకు సహేతుకం.
అప్పుడు పెద్దవాళ్లను ఒప్పించండి...
మీ ఇరువురి కులాలు, సంస్కృతి, కుటుంబ వాతావరణం వేరని చెబుతున్నారు. ఒకవేళ మీ ప్రేమ గురించి మీ ఇద్దరి మధ్య స్పష్టత వస్తే దీర్ఘకాల భవిష్యత్తులో ఒకరికొకరు సర్దుకొనిపోగలరా? అనే విషయాన్ని కూడా ఆలోచించుకోండి. మీ మధ్యే ఒక స్పష్టత లేనప్పుడు పెద్దవాళ్లను ఇప్పట్నుంచే ఒప్పించాలనే ఆలోచన చేయడం వల్ల ప్రయోజనమేంటి? అందుకే ముందు ముఖ్యంగా మీ ఇద్దరూ స్పష్టత తెచ్చుకోండి. అటు తర్వాత పెద్దవాళ్లను ఒప్పించే ప్రయత్నం చేయండి. వీలైతే వాళ్ల అక్కాబావల సహాయం తీసుకునే ప్రయత్నం చేయండి. మీ భవిష్యత్తుని గురించి ఆలోచించుకొని పరిణతితో నిర్ణయం తీసుకోండి.