చాలామంది ఎంతో ఇష్టంగా తినే వంటకం చికెన్. దాన్ని ఎప్పుడూ ఒకేలా వండితే ఏం బావుంటుంది చెప్పండి ? ఎలా వండినా చికెన్ చికెనే అంటారా ? అయితే ఈసారి ఈ ఆఫ్రికన్ స్త్టెల్లో వండి చూడండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చికెన్ ప్రేమికులను అమితంగా ఇష్టపడేలా చేస్తున్న ఈ వంటకం పేరు 'చికెన్ టొమాటో స్ట్యూ'. ఒక్కసారి మీ ఇంట్లో వారికి దీని రుచి చూపించారంటే ప్రతిసారీ చికెన్ ఇలాగే కావాలనడం ఖాయం. మరి ఈ వంటకాన్ని ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దామా ?
కావలసినవి
* చికెన్ లెగ్స్ - 4
* ఆలివ్ ఆయిల్ - 4 టేబుల్ స్పూన్స్
* ఉప్పు - తగినంత
* సన్నగా తరిగిన ఉల్లిపాయ - 1 (పెద్దది)
* సన్నగా తరిగిన వెల్లుల్లి పాయలు - 6
* తేనె - 2 టేబుల్ స్పూన్లు
* టొమాటో పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
* పసుపు - ముప్పావు టేబుల్ స్పూన్
* దాల్చిన చెక్క పొడి - అర టీ స్పూన్
* టొమాటోలు - 4 (పెద్దవి)
* చికెన్ బ్రోత్ - 3 కప్పులు
* నిమ్మపండు - 1
* చక్కెర - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
* పుదీనా తరుగు - అర కప్పు

ముందుగా సిద్ధం చేసుకోవాల్సినవి !
ఈ రెసిపీకి మంచి రుచిని చేకూర్చేది టొమాటో స్ట్యూ, క్యారమలైజ్డ్ లెమన్. వాటిని ఎలా చేయాలో ఒకసారి చూద్దాం !
టొమాటో స్ట్యూ తయారీ :
ముందుగా టొమాటో స్ట్యూ కోసం నాలుగు పెద్ద టొమాటోలను ఒక గిన్నెలలో తీసుకొని బాగా మరిగించిన నీటిని వాటిపై పోయాలి. కొంత సేపటి తర్వాత వాటిని వేడి నీటిలో నుంచి గరిటెతో బయటికి తీసి పైతొక్కను తొలగించాలి. తొక్క తీసిన టొమాటోలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మూకుడులో కొద్దిగా నీరు పోసి అందులో టొమాటో ముక్కల్ని వేసి ఉడికించాలి. ఈ సమయంలో కొంచెం మిరియాల పొడి, ఉప్పు కలుపుకుని రసం చిక్కగా అయ్యే వరకు స్టౌ మీద ఉంచుకోవాలి. ఒకవేళ రసం మరీ పులుపు ఎక్కువగా ఉందనిపిస్తే కాస్త చక్కెర కలుపుకోవచ్చు. ఇలా ఉడికించిన రసాన్నే టొమాటో స్ట్యూ అంటారు. ఇంత శ్రమ దేనికనుకుంటే బయట మార్కెట్లో మంచి నాణ్యమైన టొమాటో స్ట్యూని ఎంచుకోవచ్చు. ఇక తదుపరి క్యారమలైజ్డ్ లెమన్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం !
క్యారమలైజ్డ్ లెమన్ తయారీ :
క్యారమలైజ్డ్ లెమన్ అంటే ఏం లేదు... నిమ్మకాయ ముక్కలను కొంచెం చక్కెరతో కలిపి వేయించి పులుపుదనాన్ని తగ్గించడం. ఇదెలా చేయాలంటే... పెద్ద నిమ్మపండుని (చిన్నవి అయితే రెండు) తీసుకుని పైన కింద కట్ చేసి నిలువుగా నాలుగు ముక్కలు చేసుకోవాలి. తర్వాత గింజలతో పాటు వాటి మధ్యలో ఉండే తెల్లటి పొరని తొలగించాలి. లేదంటే చేదుగా ఉంటుంది. ఇక ఈ ముక్కలను కొన్ని నీళ్లు పోసిన ఒక గిన్నెలో 3 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ గిన్నెలో నీటిని అలానే ఉంచేసి గరిటెతో నిమ్మముక్కలను మాత్రం తీసి ఒక పేపర్ టవల్ ఉన్న బౌల్లో వేయాలి. వాటిని కొద్దిసేపు ఆరనిచ్చి మరొక గిన్నెలో వేసుకుని తగినంత చక్కెర కలుపుకోవాలి. తర్వాత గిన్నెలోని నిమ్మరసాన్ని తీసేసి రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. నూనె వేడైన తర్వాత చక్కెర కలిపిన నిమ్మ ముక్కలను అందులో వేసి మూడు నిమిషాల పాటు గోధుమరంగులోకి వచ్చే దాకా వేయించాలి. చివరగా ఈ ముక్కలను బౌల్లోకి తీసుకొని కొంచెం ఉప్పు చల్లుకుంటే క్యారమలైజ్డ్ లెమన్ సిద్ధం.

చికెన్ టొమాటో స్ట్యూ తయారీ !
చికెన్‌ను కడిగిన తరువాత తడి ఆరనివ్వాలి. తర్వాత ప్రతి లెగ్ పీస్‌పై తగినంత ఉప్పును చల్లుకుని కనీసం పావుగంట నుండి గంట వరకు అలానే ఉంచాలి.
స్టౌ సాధారణ మంటలో ఉంచుకొని దానిపై కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి వేడిచేసుకోవాలి. తర్వాత ఈ నూనెలో చికెన్ పీసెస్‌ను రెండు వైపులా తిప్పుతూ పది నిమిషాల పాటు కాల్చుకోవాలి. ఈ సమయంలో లెగ్ పీసెస్ మాడిపోకుండా గోధుమ రంగులోకి వచ్చేంత వరకు మంటను అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇక చికెన్ ఉడికిన తర్వాత అదే కడాయిలో నూనెను అలానే ఉంచుకుని ముక్కలను వేరే ప్లేట్లోకి తీసిపెట్టుకోవాలి.
ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలను కడాయిలో వేసి 6-7 నిమిషాలు వేయించాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరిగిన వెల్లుల్లిని అందులో వేసి 2-3 నిమిషాల వరకు దోరగా వేయించాలి. ఇందులో తేనె, టొమాటో పేస్ట్, పసుపు, దాల్చిన చెక్క అన్నీ వేసుకొని రెండు నిమిషాలు ఉడికించాలి.
ఇక ఈ మిశ్రమానికి టొమాటో స్ట్యూని కలిపి రెండు నిమిషాల తరువాత చికెన్‌ని కలపాలి. ఇందులోనే చికెన్ బ్రోత్ వేసుకోవాలి (మరీ ముక్కలు మునిగిపోయేలా పోయకూడదు). చివరగా మంటను బాగా తగ్గించి ఒక గంట పాటు ఉడకనివ్వాలి. తర్వాత ఒక పెద్ద గిన్నెలోకి చికెన్ స్ట్యూని తీసుకుని దానిపై క్యారమలైజ్డ్ లెమన్‌ను, కొన్ని తెల్ల నువ్వులతో పాటు సువాసన కోసం కాస్త పుదీనా చల్లుకుంటే చికెన్ టొమాటో స్ట్యూ రడీ !
దీనిని రుమాల్ రోటీతో కానీ, పుల్కాలతో కానీ తింటే భలే రుచిగా ఉంటుంది. కుదిరితే వెంటనే ప్రయత్నించండి !