శిల్పాశెట్టి... బాలీవుడ్‌కు సంబంధించి ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించే నటీమణుల జాబితాలో ముందుంటుందీ ముద్దుగుమ్మ. నిత్యం వ్యాయామాలు, యోగాసనాలతో పాటు ఆరోగ్యకరమైన వంటకాల వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ అందరిలో ఆరోగ్య స్పృహ పెంచడం శిల్పకు అలవాటు. ఈ క్రమంలో ఇప్పటికే రాగి దోసె, ఓట్స్ ఇడ్లీ, ఓట్స్ ఉప్మా, బేసన్ కొకోనట్ బర్ఫీ, బనానా బ్రెడ్.. వంటి ఎన్నో రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాలను తన ఫ్యాన్స్‌కు పరిచయం చేసిందీ అందాల తార. ఇక ఇప్పుడు పోహా (అటుకులు)తో లడ్డూ తయారుచేసి మన ముందుకు తెచ్చింది. మరి, ఈ టేస్టీ లడ్డూను శిల్ప ఎలా తయారుచేసిందో ఆమె పోస్ట్ చేసిన వీడియోలో చూసి మనమూ తెలుసుకుందాం రండి..
పోహా లడ్డూ
కావాల్సినవి
*అటుకులు - ఒకటిన్నర కప్పులు
*పచ్చి కొబ్బరి తురుము - అరకప్పు
*నెయ్యి - 5 టేబుల్ స్పూన్లు
*బెల్లం - అరకప్పు
*యాలకుల పొడి - టీస్పూన్
*బాదం పొడి - రెండున్నర టీస్పూన్లు
*అవిసె గింజల పొడి - ఒకటిన్నర టీస్పూన్
*ఎండు ద్రాక్ష - 10 నుంచి 12
*బాదం పప్పులు, పల్లీలు - అరకప్పు (వీటిని దోరగా వేయించుకొని బరకగా పొడి చేసి పెట్టుకోవాలి)
తయారీ
ముందుగా అటుకులను ఒక ప్యాన్‌లోకి తీసుకుని మీడియం సైజు మంటపై దోరగా వేయించుకోవాలి. ఆపై కొబ్బరి తురుమును కూడా అలాగే వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీలో అటుకులు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. అదే మిక్సీలోకి వేయించిన కొబ్బరి తరుము, నెయ్యి, బెల్లం, యాలకుల పొడి వేసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పెద్ద గిన్నెలోకి తీసుకుని బాదం పొడి, అవిసె గింజల పొడి, ఎండు ద్రాక్ష, నెయ్యి జత చేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత చేతికి నెయ్యి రాసుకుంటూ ఈ మిశ్రమాన్ని ఉండల్లా చుట్టుకోవాలి. ఇలా తయారైన లడ్డూలను బాదం, పల్లీల మిశ్రమంలో అద్ది సర్వ్ చేసుకుంటే సరి.. నోరూరించే పోహా లడ్డూలు సిద్ధం..!
త్వరగా.. సులభంగా!
ఇలా తాను ఇష్టపడి తయారుచేసిన పోహా లడ్డూ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసిన శిల్ప ‘ప్రస్తుతం ఉన్న కరోనా ప్రతికూల పరిస్థితుల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే మన రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. పోహా లడ్డూ అందుకు దోహదం చేస్తుంది. అందుకే ఈ వంటకాన్ని అందరితో పంచుకోవడానికి ఇలా మీ ముందుకొచ్చాను. ఐరన్ పుష్కలంగా లభించే ఈ స్వీట్ రెసిపీ కోసం చక్కెర వాడాల్సిన పని లేదు. పైగా అటు రుచికి రుచి, ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ లడ్డూలను చాలా తక్కువ సమయంలో ఎంతో సులభంగా తయారుచేసుకోవచ్చు కూడా!’ అంటూ రాసుకొచ్చిందీ యమ్మీ మమ్మీ.
ఆరోగ్య ప్రయోజనాలివే!
* పోహాలో కార్బోహైడ్రేట్లు, ఐరన్, ఫైబర్ తదితర పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు వీటి నుంచి శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వులు అందుతాయి. * ఈ గ్లూటెన్ ఫ్రీ లడ్డూలను డయాబెటిస్ సమస్య ఉన్న వారు కూడా నిరభ్యంతరంగా తినచ్చు. * శరీరానికి తక్షణ శక్తినిచ్చే ఈ లడ్డూ ఒకటి తింటే శరీరానికి 143 కిలో క్యాలరీల శక్తి అందుతుంది. * అలాగే ఇవి ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉండేలా చేసి.. ఇతర చిరుతిళ్ల మీదికి మనసు మళ్లకుండా చేస్తాయి. తద్వారా బరువూ అదుపులో ఉంచుకోవచ్చు.
|
మరి, ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ టేస్టీ అండ్ హెల్దీ లడ్డూలను మీరూ ఓసారి ట్రై చేయండి. వాటి రుచిని ఆస్వాదిస్తూ ఆరోగ్యంగా మారిపోండి!