దీపావళి పండగ అనగానే దీపాలు, టపాసుల తర్వాత అందరికీ గుర్తొచ్చేది నోరూరించే మిఠాయిలే.. పండగనగానే నోరు తీపి చేసుకోవడం మనందరికీ అలవాటే. అలాగని స్వీట్స్ బయటనుంచి కొని తెచ్చుకోవడం కంటే ఎంచక్కా హెల్దీగా ఇంట్లోనే తయారుచేసుకుంటే? బానే ఉంటుంది అంటారా? అయితే ఆలస్యమెందుకు మరి.. ఈసారి స్వయంగా మీరే ఇంట్లో ఈ వంటకాలు సిద్ధం చేసి.. నోరూరించే విందు చేయండి.. ఆరోగ్యకరమైన రుచులతో దీపావళి వెలుగులు పంచండి..
దిల్లీ స్పెషల్ ‘పెతా’

కావాల్సినవి
* గుమ్మడికాయ - 1
* తాంబూలంలో ఉపయోగించే సున్నం - 1 టేబుల్ స్పూన్
* చక్కెర - ముప్పావు కిలో
* నీళ్లు - సరిపడా
తయారీ
ముందుగా గుమ్మడికాయని నచ్చిన ఆకారాల్లో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఓ బౌల్లో నీళ్లు తీసుకుని అందులో సున్నాన్ని కలపాలి. ఇప్పుడు కట్ చేసిన గుమ్మడికాయ ముక్కల్ని ఆ సున్నం నీళ్లలో 5-6 గంటల పాటు నాననివ్వాలి. అలా నానిన ముక్కల్ని మంచి నీళ్లతో 2-3 సార్లు బాగా కడగాలి. వాటిని సన్నని మంటపై ఉడికించాలి. తర్వాత ముక్కలపై చక్కెర చల్లి ఓ గంట పాటు ఉంచాలి. ఆ తర్వాత సన్నని మంటపై చక్కెర చిక్కపడేంత వరకు ఉడికించాలి. ఆపై వాటిని రాత్రంతా చక్కెర పాకంలో అలాగే ఉంచాలి. అంతే! దిల్లీ స్పెషల్ స్వీట్ 'పెతా' సిద్ధం.
జామ పండు హల్వా

కావాల్సినవి
* జామ పండ్లు - 1 కిలో
* నిమ్మ రసం - 2 టేబుల్ స్పూన్స్
* చక్కెర - ముప్పావు కిలో
తయారీ
పండిన జామ పండ్లను ముక్కలుగా కట్ చేసుకొని సన్నని మంటపై బాగా మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించుకోవాలి. ఇప్పుడు వీటిని మ్యాషర్ సహాయంతో పేస్ట్‌లా చేసుకోవాలి. ఆపై ఓ పలుచటి వస్త్రాన్ని తీసుకుని ఆ పేస్ట్‌ని వడకట్టాలి. ఇప్పుడు వడకట్టిన జామ ముక్కల పేస్ట్‌ని ఓ ప్యాన్‌లో సన్నని మంటపై ఉడికించుకోవాలి. దానికి చక్కెర, నిమ్మరసం కలిపి ఆ మిశ్రమం చిక్కబడేంత వరకూ కలుపుతూ ఉండాలి. అలా చిక్కబడిన జామ ముక్కల మిశ్రమాన్ని ఓ నెయ్యి రాసిన ప్లేట్లో వేసి, సమానంగా పరచి ఆరిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుంటే హల్వా రడీ. దీన్ని కరిగించి ఛీజ్ లాగా బ్రెడ్‌పై రాసుకుని కూడా తినచ్చు.
సుఖ్డీ

కావాల్సినవి
నెయ్యి - ముప్పావు కప్పు
గోధుమ పిండి - అర కప్పు
బెల్లం - పావు కప్పు
డైఫ్రూట్స్ – కొన్ని
తయారీ
ముందుగా ఒక ప్లేట్ లోపలి భాగంలో నెయ్యి రుద్ది పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నెయ్యిని ఒక ప్యాన్‌లో తీసుకొని అది వేడెక్కిన తర్వాత కొద్దికొద్దిగా గోధుమపిండి వేస్తూ వేయించుకోవాలి. ఇది పేస్ట్‌లా తయారవుతుంది. ఆపై దీన్ని నాలుగైదు నిమిషాల పాటు వేయించి బంగారు రంగు వచ్చిన తర్వాత మెత్తగా చేసుకున్న బెల్లం తురుమును అందులో వేసి కలపాలి. బెల్లం కరిగేవరకూ అలాగే ఉంచి ఇందాక తయారుచేసుకున్న ప్లేట్లో ఈ మిశ్రమాన్ని పోసేయాలి. స్పూన్‌తో సమానంగా చేసి కాస్త ఆరనివ్వాలి. దానిపై వేయించిన డ్రైఫ్రూట్స్ వేసుకోవాలి. ఆపై దీన్ని నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి. అంతే సుఖ్డీ సిద్ధం.
అమృత్సరీ పిన్నీ..

కావాల్సినవి
మినప్పప్పు - ముప్పావు కప్పు
రవ్వ - పావు కప్పు
చక్కెర - ఒకటిన్నర కప్పు
కోవా - ముప్పావు కప్పు
నెయ్యి - కప్పు
యాలకుల పొడి - రెండు టీస్పూన్లు
కిస్మిస్ - రెండు టేబుల్ స్పూన్లు
జీడిపప్పు - 20-25
బాదం పప్పు - 30-35
తయారీ
ముందుగా మినప్పప్పుని శుభ్రం చేసుకొని రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. ఆపై జీడిపప్పు, బాదం పప్పును సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మినప్పప్పును మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ప్యాన్‌లో నెయ్యి వేసి వేడిచేయాలి. ఇందులో డ్రైఫ్రూట్స్, కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత రవ్వ, మినప్పిండి ఇందులో వేసి వేయించుకోవాలి. బాగా కలుపుతూ బంగారు రంగు వచ్చేవరకూ ఉంచుకోవాలి. ఆ తర్వాత దీన్ని దింపి చల్లార్చుకోవాలి. ఇప్పుడు కోవాను కూడా అలాగే వేడి చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత చక్కెరలో నీళ్లు పోసి తీగ పాకం వచ్చేవరకూ వేడిచేయాలి. ఆపై అందులో ఇందాక వేయించుకున్న మినప్పప్పు మిశ్రమం వేసి కలుపుకోవాలి. అనంతరం డ్రైఫ్రూట్స్, కిస్మిస్ కూడా వేసి కలుపుకోవాలి. ఆపై దీన్ని దింపుకొని కోవా, యాలకుల పొడి వేసి కలిపి చల్లారనివ్వాలి. తర్వాత వీటిని లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే అమృత్సరీ పిన్నీ సిద్ధం.
కార్న్ ఫ్లోర్ హల్వా

కావాల్సినవి
* మొక్కజొన్న పిండి - అర కప్పు
* చక్కెర - ఒకటింపావు కప్పు
* నెయ్యి - 3 టేబుల్ స్పూన్స్
* ఫుడ్ కలర్ - మీకు నచ్చితే వేసుకోవచ్చు
* నిమ్మరసం - 1 టీస్పూన్
* చిన్నగా కట్ చేసిన డ్రైఫ్రూట్స్ (బాదం, పిస్తాలు, గుమ్మడికాయ గింజలు) - 3 టేబుల్ స్పూన్స్
తయారీ
ముందుగా బాండీలో చక్కెరకి కప్పు నీళ్లు, నిమ్మరసాన్ని కలిపి కరిగించుకోవాలి. ఈలోపు వేరొక బౌల్లో మొక్కజొన్న పిండిని ఉండలు కట్టకుండా నీళ్లు పోసి కలుపుకోవాలి. అలా కలిపిన మిశ్రమాన్ని చక్కెర పాకంలో కొద్దికొద్దిగా పోస్తూ, గరిటతో కలుపుతుండాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో ఫుడ్ కలర్ (అవసరమైతే), యాలకుల పొడి, కట్ చేసి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్.. అన్నీ వేసి బాగా కలియబెట్టాలి. చివరగా నెయ్యిని కొద్దికొద్దిగా జత చేస్తూ మిశ్రమం చిక్కబడేంత వరకూ కలుపుతుండాలి. ఇలా తయారైన హల్వాను ఓ నెయ్యి రాసిన ప్లేట్లో ఆరనిచ్చి ముక్కలుగా కట్ చేసుకోవాలి.