ఫిట్నెస్, ఆరోగ్యం వంటి విషయాలపై శ్రద్ధ వహించే నటీమణుల జాబితాలో ముందు వరుసలో ఉంటుంది శిల్పాశెట్టి. వీటితో పాటు ఆరోగ్యకరమైన రెసిపీలను తయారుచేస్తూ తన యూట్యూబ్ ఛానల్లో, సోషల్ మీడియా పేజీల్లో అందరితో షేర్ చేస్తుంటుంది. అంతేకాదు వాటిలోని పోషక విలువల్ని సైతం వీడియోలో వివరిస్తూ తన ఫ్యాన్స్‌లో ఆరోగ్యం పట్ల అవగాహనను మరింతగా పెంచుతుంటుందీ యమ్మీ మమ్మీ. ఇప్పటికే రాగి దోశ, ఓట్స్ ఇడ్లీ, ఓట్స్ ఉప్మా, బేసన్ కోకొనట్ స్వీట్స్ వంటి రుచికరమైన వంటకాలను మనకు పరిచయం చేసిన శిల్ప తాజాగా బనానా బ్రెడ్‌తో మన ముందుకు వచ్చింది. పిల్లలకు ఎంతో ఇష్టమైన ఈ రెసిపీ తయారీకి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పంచుకుంటూ ఓ సుదీర్ఘ పోస్ట్ రాసుకొచ్చిందీ బాలీవుడ్ బ్యూటీ
బనానా బ్రెడ్
కావాల్సిన పదార్థాలు!
*బాగా పండిన అరటి పండ్లు- చిన్నవి- 6 లేదా పెద్దవి - 3
*గిలక్కొట్టిన గుడ్లు- 2
*బాదం పాలు - 3 టేబుల్ స్పూన్లు
* వెనీలా ఎసెన్స్- టేబుల్ స్పూన్
*మేపుల్ సిరప్- ఒకటిన్నర టేబుల్ స్పూన్
*బాదం పిండి- 120 గ్రాములు
*ఉప్పు - అర టీస్పూన్
*బేకింగ్ పౌడర్ - టేబుల్ స్పూన్
*దాల్చిన చెక్క పొడి- అర టీస్పూన్
*అవిసె గింజల పొడి - 3 టేబుల్ స్పూన్లు
*వాల్నట్స్ - 8 నుంచి 10
తయారీ!
ముందుగా ఒవెన్‌ను 180 డిగ్రీల ఫారన్‌హీట్ వరకు వేడి చేసుకోవాలి. ఒక గిన్నెలో అరటి పండ్లను వేసి మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇందులో గిలక్కొట్టిన గుడ్లు, వెనీలా ఎసెన్స్‌ను వేసి గరిటె సహాయంతో బాగా కలపాలి. తీపి ఎక్కువగా వచ్చేందుకు మేపుల్ సిరప్‌ను వేసుకోవచ్చు. ఈ మిశ్రమంలో బాదం పిండి, ఉప్పు, బేకింగ్ పౌడర్, దాల్చిన చెక్క పొడి వేసి అన్నీ కలిసేలా మరోసారి కలుపుకోవాలి. ఆ తర్వాత అవిసె గింజల పొడి, వాల్‌నట్స్‌ను వేసి మిశ్రమంలా తయారుచేసుకోవాలి. రడీ అయిన బ్యాటర్‌ను బ్రెడ్ మౌల్డ్ లేదా కేక్ మౌల్డ్ లోకి తీసుకోవాలి. రుచి బాగా వచ్చేందుకు ఈ బ్యాటర్‌పై చాకొలెట్ చిప్స్ లేదా వాల్ నట్స్ టాపింగ్‌గా వేసుకోవచ్చు. అనంతరం దీన్ని 25-30 నిమిషాల పాటు ఒవెన్‌లో ఉంచాలి. తర్వాత 20 నిమిషాల పాటు చల్లబరిస్తే...రుచికరమైన బనానా బ్రెడ్ రడీ!
పిల్లలు ఇష్టపడి అడిగితే ఎలా కాదనగలం?
ఇలా తాను తయారుచేసిన బనానా బ్రెడ్ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసిన శిల్ప ‘మమ్మీ...ఈ రోజు నాకు బనానా బ్రెడ్ చేసిపెట్టవా?’ అని అడిగినప్పుడు ఎలా కాదని చెప్పగలం? ముఖ్యంగా దీనిని ఎంతో ఇష్టంగా తినే మన పిల్లలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ కాదని చెప్పలేం. మా అబ్బాయి వియాన్ కి వాల్‌నట్స్‌తో చేసిన బనానా బ్రెడ్ అంటే చాలా ఇష్టం. దీని తయారీకి ఎలాంటి షుగర్, పిండి అవసరం లేదు. ఇక నాలాగే మీరు కూడా పూర్తిగా వెజిటేరియన్ అయితే గుడ్డుకు బదులు టేబుల్ స్పూన్ అవిసె గింజల పొడిని 3 టేబుల్ స్పూన్ల నీటితో కలిపి వాడచ్చు. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది పిల్లలకి బలవర్ధకమైన ఆహారం అని చెప్పొచ్చు. పైగా దీన్ని ఎంతో సులభంగా, వేగంగా తయారుచేసుకోవచ్చు. మరి మీరు కూడా మీ పిల్లల కోసం ఈ గ్లూటెన్ ఫ్రీ రెసిపీని రడీ చేయండి. కచ్చితంగా ఇష్టంగా తింటారు.