అప్పట్లో పెద్దవాళ్లు రాత్రిపూట ఒక కుండలోనో, గిన్నెలోనో అన్నం మెత్తగా కలిపి, అందులో పాలుపోసి, కాసింత పెరుగువేసి మూతపెట్టేవారు. ఇలా తోడుపెట్టిన అన్నాన్ని 'తరవాణీ' అంటారు కొన్ని ప్రాంతాల్లో. పొలం పనులకి వెళ్లేవారు, ఆఫీసులకు వెళ్లేవారు, చదువుకోడానికి వెళ్లే పిల్లలూ ఎంచక్కా పొద్దున్నే పచ్చిమిరప కాయలో, ఉల్లిపాయలో, ఏ పచ్చడో వేసుకుని అది తిని వెళ్లేవారు..! తర్వాత బోలెడన్ని టిఫిన్లు వచ్చేశాయ్. అయితే 'ఓల్డ్ ఈజ్ గోల్డ్' అన్నట్లు ఇప్పుడు అన్నిట్లోనూ రెట్రో ఫ్యాషన్లు, పద్ధతులు ప్రాచుర్యం పొందుతున్నట్లు బ్రేక్‌ఫాస్ట్ విషయంలో కూడా పాతపద్ధతులు వచ్చేస్తున్నాయ్. 'ఓవర్ నైట్ ఓట్స్' కాన్సెప్ట్ కూడా సరిగ్గా ఇలాంటిదే.!ఒక రకంగా మన చద్దన్నానికి ఇది వెస్ట్రనైజ్డ్ వెర్షన్ అనమాట.! చద్దన్నం బలాన్నిస్తే, ఓవర్‌నైట్ ఓట్స్ పోషకాలను అందిస్తూ అధిక బరువు తగ్గడానికి సహాయపడతాయి.
కావలసిన పదార్థాలు...
* ఓట్స్ : 3/4 కప్పు(ముప్పావు కప్పు)
* చియా సీడ్స్ : 1 టేబుల్ స్పూను
* వెన్న తీసిన పాలు/ లో ఫ్యాట్పాలు : 1/2 కప్పు (అర కప్పు)
* పెరుగు/గ్రీక్ యోగర్ట్ : 2 టేబుల్ స్పూన్లు
* తేనె : 1 టేబుల్ స్పూను
* తురిమిన క్యారట్ : 1/2 కప్పు (అర కప్పు)
* దాల్చిన చెక్క పొడి : 1/4 కప్పు (పావు కప్పు)
* ఎండు ద్రాక్ష : 1 టేబుల్ స్పూను
* వాల్నట్స్ : 1 టేబుల్ స్పూను
తయారీ విధానం
ఒక గ్లాస్ జార్లో ఓట్స్, చియా సీడ్స్ వేయాలి. అందులో పాలు, పెరుగు, తేనె, దాల్చిన చెక్క పొడి వేసి, తురిమిన క్యారట్ వేయాలి. చివరగా ఎండు ద్రాక్ష, వాల్నట్స్ తో గార్నిష్ చేయాలి. ఈ గ్లాస్ జార్‌ను రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచితే ఉదయాన్నే హెల్దీ మరియు టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ రెడీ..!
*ఇందులోని దాల్చిన చెక్క బదులు చాకో చిప్స్‌నీ, ఎండు ద్రాక్ష, వాల్ నట్స్ బదులు బాదం, పిస్తాలనీ, క్యారట్‌కి బదులుగా అరటి పండునీ చేరిస్తే మరో ఓవర్ నైట్ ఓట్స్ రెసిపీ సిద్ధం..!
ఓవర్ నైట్ ఓట్స్ ప్రత్యేకత ఏంటి?
* ఎన్నో పోషక విలువలతో పాటు ఓట్స్ ఫైబర్ లను అధికంగా కలిగి ఉంటుంది. వీటిలోని ప్రొటీన్లు శక్తికీ, ఫైబర్లు మెటబాలిజం మెరుగు పరచడానికీ సహాయ పడతాయి.
* చియా సీడ్స్ లోని ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు అధిక బరువును తగ్గిస్తాయి.
* పాలు ఎముకలను దృఢంగా ఉంచుతాయి.
* పెరుగు శరీరానికి కావలసిన ప్రొటీన్లు, కాల్షియం అందించడంతో పాటు, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
* తేనె, ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఆవశ్యక ఖనిజాలనూ కలిగి ఉంటుంది.
బ్రేక్‌ఫాస్ట్‌లో మంచి పోషకాలను తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా సీజనల్‌గా దొరికే పండ్లను, డ్రైఫ్రూట్స్‌ను ఇందులో చేర్చడం వల్ల అద్భుతమైన లాభాలు పొందవచ్చు.