బాలీవుడ్‌కు సంబంధించి ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించే నటీమణుల జాబితాలో ముందు వరుసలో ఉంటుంది శిల్పాశెట్టి. వ్యాయామాలు, యోగాసనాలు, ఆరోగ్యకరమైన రెసిపీలు... తదితర విషయాల్లో ఆమెకు మంచి అవగాహన కూడా ఉంది. అందుకే ఈ విషయాలకు సంబంధించి తనకు తెలిసిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంటుందీ అమ్మడు. ఈక్రమంలో ఇటీవలే మాంసాహారానికి స్వస్తి చెప్పి పూర్తి వెజిటేరియన్‌గా మారిపోయిన శిల్ప సోషల్ మీడియా వేదికగా ఓ టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌ను అందరికీ పరిచయం చేసింది. ఇంతకీ ఏంటా బ్రేక్‌ఫాస్ట్?దాన్నెలా తయారుచేయాలో తెలుసుకుందాం రండి...!
ఓట్స్ అండ్ సత్తు ఉప్మా!
కావాల్సిన పదార్థాలు!
* నీళ్లు - రెండున్నర కప్పులు
* నెయ్యి - టేబుల్ స్పూన్
* జీడిపప్పులు - 5 నుంచి 6
* ఆవాలు - టీ స్పూన్
* కరివేపాకు - 7 నుంచి 8 రెబ్బలు
* పచ్చిమిర్చి - 1 (సన్నగా తరుక్కోవాలి)
* అల్లం - కొద్దిగా (సన్నగా తరుక్కోవాలి)
* ఇంగువ - పావు టీస్పూన్
* ఉల్లిపాయ - 1 (సన్నగా తరుక్కోవాలి)
* సత్తు పిండి (వేయించిన సెనగ పిండి) - టేబుల్ స్పూన్
* క్యారట్ - అరకప్పు (తరిగి ఉడికించినవి)
* బీన్స్ - అరకప్పు (తరిగి ఉడికించినవి)
* మొక్కజొన్న - అరకప్పు (ఉడికించినవి)
* ఉప్పు - తగినంత (రుచికి సరిపడా)
* రోస్టెడ్ ఓట్స్
* కొత్తిమీర
తయారీ విధానం!
ముందుగా ఒక ప్యాన్ లో నీరు పోసి మరిగించాలి. ఇప్పుడు మరొక ప్యాన్ లో నెయ్యి వేసి వేడయ్యాక అందులో జీడిపప్పు వేయించాలి. కొద్ది సేపయ్యాక ఆవాలు, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, ఇంగువ వేసి బాగా కలపాలి. అనంతరం ఉల్లిపాయలను వేసి గోధుమ వర్ణంలోకి వచ్చేదాకా వేయించాలి. ఆపై రోస్టెడ్ ఓట్స్, సత్తు పిండి, ఉడికించిన క్యారట్స్, బీన్స్, స్వీట్‌కార్న్ కలపాలి. అలాగే కొంచెం ఉప్పును జోడిస్తే మరింత రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు వీటికి ముందుగా మరిగించిన నీటిని కలిపి మూత పెట్టండి. సుమారు 10 నుంచి 12 నిమిషాల పాటు అధిక మంటపై మగ్గనిచ్చి, ఆ తర్వాత మీడియం మంటపై ఉంచి చివరికి కొద్దిగా కొత్తిమీర వేసి దించేస్తే ఓట్స్ అండ్ సత్తు ఉప్మా రడీ!
రుచికరం, ఆరోగ్యకరం!
ఈ రుచికరమైన డిష్‌ను ఎలా చేయాలో వీడియో షేర్ చేసిన శిల్పాశెట్టి ఈ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను కూడా పంచుకుంది. ‘ రోజూ ఉదయాన్నే లేవడం, బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయడం చాలా శ్రమతో కూడుకున్న పని. అయినా ఈ మెనూ ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి. అదే సమయంలో హెల్దీగా కూడా ఉండాలి. అందుకే ఈసారి ఓట్స్ అండ్ సత్తు ఉప్మాతో మీ ముందుకొచ్చాను. ఈ బ్రేక్‌ఫాస్ట్ రుచికరంగా ఉండడమే కాదు శరీరానికి ఎన్నో పోషకాలనిస్తుంది. ముఖ్యంగా ఓట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయు లను తగ్గించి చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తాయి. అదేవిధంగా సత్తు పిండిలో ఉండే ఫైబర్ బాడీ డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరచి శరీరానికి మరింత శక్తినిస్తుంది’ అని చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.
ఓట్స్, సత్తు పిండి ద్వారా శరీరానికి అందే పోషక విలువలివే..!
* ఇతర చిరు ధాన్యాలతో పోల్చుకుంటే ఓట్స్‌లో ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, పీచు పదార్థాలు, శరీరానికి అవసరమైన కొవ్వులు సమృద్ధిగా లభ్యమవుతాయి.
* ఓట్స్‌లో మాంగనీస్, ఫాస్పరస్, కాపర్, ఐరన్, సెలీనియం, మెగ్నీషియం, జింక్ లాంటి మినరల్స్‌తో పాటు బి-విటమిన్ కూడా అధికంగా ఉంటాయి.
* ఇక సత్తు పిండిలో ఉండే ప్రొటీన్లు, బి-విటమిన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం లాంటి మినరల్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
మరి, మీరూ ఈ టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌ను ఓసారి ట్రై చేస్తారా?