వేసవి అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది మామిడి పండ్లు. మరి ఈ పండ్లతో ఎన్నో రుచికరమైన పదార్థాల్ని చేసుకొని ఆస్వాదిస్తాం. అలాగే పచ్చి మామిడి కాయలతోనూ మామిడికాయ పులిహోర, మామిడికాయ పప్పు.. వంటి నోరూరించే వంటకాల్ని తయారుచేసుకుంటాం. అయితే ఇదే పచ్చి మామిడితో ఎంతో రుచికరమైన మామిడి లడ్డుని కూడా తయారుచేసుకోవచ్చు.. తెలుసా! అదెలాగో తెలుసుకోవాలంటే ఇదోసారి ప్రయత్నించి చూడండి.
కావాల్సినవి
పచ్చి మామిడి తురుము - కప్పు, బరకగా చేసిన జీడిపప్పు పొడి - అరకప్పు, పచ్చికొబ్బరి తురుము - అరకప్పు, దాల్చినచెక్క పొడి - పావుచెంచా, యాలకుల పొడి - చెంచా, చక్కెర - కప్పు, నెయ్యి - టేబుల్‌స్పూను, చెర్రీలు - కొన్ని.
తయారీ
బాణలిలో రెండు చెంచాల నెయ్యి కరిగించి మామిడి తురుము, చక్కెర వేసేయాలి. చక్కెర కరిగి, కాసేపటికి ఈ మిశ్రమం దగ్గరపడి హల్వాలా తయారవుతుంది. అప్పుడు అందులో జీడిపప్పు పొడి, పచ్చికొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. రెండుమూడు నిమిషాలకు పదార్థాలన్నీ ఉడికి ముద్దలా అవుతుంది. ఇందులో దాల్చినచెక్క పొడి, యాలకుల పొడి వేసి కలిపి దింపేసి వెడల్పాటి పళ్లెంలోకి తీసుకోవాలి. వేడి కొద్దిగా చల్లారాక చేతికి మిగిలిన నెయ్యి రాసుకుంటూ ఉండల్లా చుట్టుకొని, పైన చెర్రీలు అలంకరించుకుంటే చాలు. నోరూరించే మామిడి లడ్డు సిద్ధం. అయితే, మరీ పులుపుగా ఉంటుందనిపిస్తే మామిడి తురుము మోతాదు తగ్గించుకోవచ్చు.
- ఎన్. అన్నపూర్ణ, తిరుపతి