ప్రేమ, అనురాగం, ఆప్యాయత, త్యాగం.. ఇలా ఎన్నో సద్గుణాల కలబోత అమ్మ. అలాంటి అమ్మ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేమన్నది అక్షర సత్యం. అయితే ఏటా మే రెండో ఆదివారాన్ని ‘మాతృ దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. బోలెడన్ని కానుకలిస్తూ, ప్రేమ పంచుతూ అమ్మకు మనసారా కృతజ్ఞత చెప్పుకుంటున్నాం. అలాంటి సందర్భం ఈ ఏడాది కూడా రానే వచ్చింది. ఈ క్రమంలో ఈ ప్రత్యేకమైన రోజున కమ్మని వంటకాలతో అమ్మ నోరు తీపి చేయడం పరిపాటే. అయితే కరోనా కాచుక్కూర్చున్న ఈ ప్రతికూల పరిస్థితుల్లో బయటికెళ్లలేం. మరి, అమ్మతో కేక్ కట్ చేయించడమెలా అని ఆలోచిస్తున్నారా? ఇంట్లో దొరికే వస్తువులతోనే ఎంతో ఈజీగా కేక్ తయారుచేస్తే సరి.. అలాంటి కొన్ని రెసిపీలు ఈ ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా మీకోసం..
బిస్కట్ కేక్

కావాల్సినవి
* బిస్కట్స్ - 200 గ్రాములు (అమ్మకు నచ్చినవి ఎంచుకోండి)
* బటర్ - అరకప్పు
* కొకోవా పౌడర్ - అరకప్పు
తయారీ
బిస్కట్స్‌ని ముక్కలుగా కట్ చేసి బేకింగ్ ట్రేలో వేయాలి. ఇప్పుడు స్టౌ పై ఓ గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి మరిగించాలి. ఇలా మరుగుతున్న గిన్నెపై మరో గిన్నె పెట్టి అందులో బటర్, కొకోవా పౌడర్ వేసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బిస్కట్స్పై పోసి వాటికి బాగా పట్టేలా కలపాలి. చివరగా ఓ గిన్నెలో ఈ బిస్కట్ మిశ్రమాన్ని సమాంతరంగా పరచాలి. ఇప్పుడు దీన్ని ఫ్రిజ్‌లో 3-4 గంటలపాటు పెట్టి.. గట్టిపడే దాకా ఉంచితే సరి. యమ్మీ ‘బిస్కట్ కేక్’ రడీ..
చాక్లెట్ మౌసీ కేక్..

కావాల్సినవి
* వెన్న తొలగించని పాలు - 500 మిల్లీ లీటర్లు
* క్రీమ్ - 50 మిల్లీ లీటర్లు
* కొకోవా పౌడర్ - 2 టేబుల్‌స్పూన్స్
* మొక్కజొన్న పిండి - 2 టేబుల్‌స్పూన్స్
* పంచదార - అరకప్పు
* డార్క్ చాక్లెట్ - కప్పు
తయారీ..
ఒక పెద్ద బౌల్ తీసుకుని పాలు, క్రీమ్, కొకోవా పౌడర్, మొక్కజొన్న పిండి, పంచదార అన్నింటినీ వేసి కలపాలి. ఇప్పుడు ఈ బౌల్‌ను స్టౌపై పెట్టి 2-3 నిమిషాలు పాటు ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. చివరగా డార్క్ చాక్లెట్‌ని వేసి కరిగేంత వరకూ బాగా కలపాలి. ఇప్పుడు స్టౌ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని కేక్ మౌల్డ్‌లో పోసి చల్లారనివ్వాలి. ఆపై ఫ్రిజ్‌లో పెట్టి కేక్ గట్టిపడేంత వరకూ ఉంచాలి. చివరగా దాన్ని బయటకు తీసి కేక్‌పై కొకోవా పౌడర్ చల్లితే సరి.
చాక్లెట్ లావా కప్ కేక్..

కావాల్సినవి
*బిస్కట్స్ పొడి - 1 కప్పు
*చాక్లెట్ సాస్ - 1 కప్పు
తయారీ
బిస్కట్స్ పొడికి చాక్లెట్ సాస్ కలిపి చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు టీ కప్ తీసుకుని దాని లోపలి భాగంలో బేకింగ్ షీట్ పరవాలి. మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని టీ కప్ లోపలి అడుగు భాగంలో మధ్యలో ఖాళీ ఉండేలా అద్దుకోవాలి. ఇప్పుడు ఆ ఖాళీలో చాక్లెట్ సాస్ పోయాలి. చివరగా పై భాగాన్ని ముందుగా తయారుచేసి పెట్టుకున్న బిస్కట్స్ పిండితో మూసేయాలి. ఇప్పుడు ఈ మౌల్డ్‌ను జాగ్రత్తగా కప్ నుండి వేరు చేయాలి. ఇలా పిండి మొత్తాన్ని చేసుకుని.. ఫ్రిజ్‌లో 2 గంటల పాటు ఉంచాలి. అంతే.. నోరూరించే చాక్లెట్ లావా కేక్ సిద్ధం.
ఓట్స్- చాక్లెట్ కుకీస్

కావాల్సినవి
* పాలు - అరకప్పు
* బటర్ - అరకప్పు
* కొకోవా పౌడర్ - పావుకప్పు
* ఓట్స్ - మూడు కప్పులు
* పీనట్ బటర్ - 1 కప్పు
* వెనీలా ఎసెన్స్ - 1 టేబుల్‌స్పూన్
* పంచదార - 2 కప్పులు
తయారీ..
స్టౌపై ఓ గిన్నె పెట్టి అందులో పంచదార, బటర్, పాలు, కొకోవా పౌడర్ వేసి ఒక నిమిషం పాటు వేడిచేసుకోవాలి. ఈ మిశ్రమం వేడిగా ఉండగానే అందులో ఓట్స్, పీనట్ బటర్, వెనీలా ఎసెన్స్ కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు బేకింగ్ ట్రేను తీసుకుని దానిపై బేకింగ్ షీట్‌ని పరవాలి. ఇప్పుడు ఈ ఓట్స్ మిశ్రమాన్ని బిస్కట్స్లా చేసుకొని బేకింగ్ షీట్‌పై పెట్టుకోవాలి. ఇవి గట్టిపడేంత వరకు ఫ్రిజ్‌లో ఉంచితే సరి. ఓట్స్-చాక్లెట్ కుకీస్‌తో మీ అమ్మను సర్ప్రైజ్ చేయచ్చు.
చూశారుగా.. ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకునే కేక్స్, కుకీస్. మరి ఆలస్యమెందుకు.. మీ స్వహస్తాలతో వీటిని తయారుచేసి మీ అమ్మగారికి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చేయండి..
హ్యాపీ మదర్స్ డే!
గమనిక: మాతృ దినోత్సవాన్ని మీరెలా జరుపుకొన్నారో ఫొటోలు తీసి contactus@vasundhara.net మెయిల్ ఐడీకి పంపండి. అందులో బాగున్న ఫొటోలని వసుంధర.నెట్లో ప్రచురిస్తాం.