ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించే నటీమణుల జాబితాలో ముందు వరుసలో ఉంటుంది స్మైలింగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. వ్యాయామాలు, యోగాసనాలు, ఆరోగ్యకరమైన రెసిపీలు.. తదితర విషయాల్లో రకుల్‌కు మంచి అవగాహన కూడా ఉంది. అందుకే ఈ విషయాలకు సంబంధించి తనకు తెలిసిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకొంటుంటుందీ అమ్మడు. అయితే లాక్డౌన్ కారణంగా గత కొన్ని రోజులుగా రకుల్ ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తన ఫిట్‌నెస్‌పై మరింత శ్రద్ధ పెట్టడం, కుటుంబ సభ్యులతో గడపడంతో పాటు.. పలు ఆరోగ్యకరమైన రెసిపీలను కూడా తయారుచేస్తూ సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకుంటోంది. ఈ క్రమంలో రకుల్ ఇటీవలే షేర్ చేసిన రెసిపీ ఏంటో మీరే చూడండి.
బనానా చాక్లెట్ ఓట్ మీల్ కుకీస్..!
‘ఈరోజు నాకు కుకీస్ తినాలనిపించింది. కానీ, వాటిని బయట నుంచి ఆర్డర్ చేసుకోలేం కాబట్టి.. ఇంట్లోనే వాటిని తయారు చేయాలని నిర్ణయించుకున్నాను. మరి ఇంట్లో ఉండే పదార్థాలతో ఈ కుకీస్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..!
కావాల్సిన పదార్థాలు
బాగా పండిన అరటి పండ్లు - 2
ఓట్స్ - 50 గ్రాములు
కొకోవా పౌడర్ - 2 టేబుల్ స్పూన్లు
తురిమిన చాక్లెట్ - 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
ముందుగా ఒవెన్‌ను 180 డిగ్రీల వద్ద ప్రి-హీట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో బాగా పండిన అరటి పండ్లను వేసి మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇందులో ఓట్‌మీల్‌ను వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో కొకోవా పౌడర్, తురిమిన చాక్లెట్ వేసి అన్నీ కలిసేలా మరోసారి కలుపుకోవాలి. కావాలంటే రుచి కోసం ఇందులో నట్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే తీపి ఎక్కువగా ఇష్టపడే వాళ్లు ఇందులో తేనె లేదా మేపుల్ సిరప్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బేకింగ్ ట్రే తీసుకొని దానిపై నూనె రాయాలి. ఇందాక కలుపుకొన్న బనానా-ఓట్స్ మిశ్రమాన్ని కుకీస్ ఆకారంలో తయారు చేసి వరుస క్రమంలో బేకింగ్ ట్రేలో పేర్చుకోవాలి. దీన్ని 10 - 12 నిమిషాల పాటు ఒవెన్‌లో బేక్ చేసుకోవాలి. అంతే.. రుచికరమైన బనానా చాక్లెట్ కుకీస్ రడీ..!
రైస్ మంచిదే..!
సాధారణంగా డైటింగ్‌లో భాగంగా చాలామంది రైస్ తక్కువగా తీసుకొంటుంటారు. కానీ, వరి అన్నం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయని చెబుతోంది రకుల్. ఈ క్రమంలో తను ఇటీవలే ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెడుతూ.. ‘మనలో చాలామంది వరి అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారని అనుకుంటారు. కానీ, అది నిజం కాదు. వాస్తవానికి రైస్ తినడం వల్ల మన శరీరానికి కార్బోహైడ్రేట్స్ అందుతాయి. ఇవి మన జీర్ణశక్తి మెరుగుపడడానికి దోహదం చేస్తాయి. ఈ లాక్డౌన్ సమయంలో సులభంగా జీర్ణమయ్యే, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తినండి.. మీ రోగనిరోధక శక్తిని పెంపొందించుకోండి. అన్నట్టు నేను ఇప్పుడు తింటున్నది.. వెజ్ ఫ్రైడ్ రైస్..!’ అంటూ చెప్పుకొచ్చిందీ పంజాబీ అందం.
|
గతంలో కూడా వరి అన్నం తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెప్పుకొచ్చింది రకుల్. ‘నా లంచ్‌లో భాగంగా నేను కొంచెం వైట్ రైస్ తింటాను. ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని తినడం వల్ల మన శరీరంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి..’ అంటూ తన ఆరోగ్య రహస్యం గురించి చెప్పుకొచ్చిందీ బ్యూటీ.