ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారితో పోరాడే క్రమంలో ప్రజలు సామాజిక దూరం, స్వీయ నిర్బంధం పాటిస్తూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ సమయంలో జరుపుకోవాల్సిన వివాహాలు, పెళ్లిరోజులు, శుభకార్యాలు, పుట్టినరోజు వేడుకలు, ప్రత్యేక సందర్భాలు.. మొదలైన కార్యక్రమాలను అయితే తూతూ మంత్రంగా జరుపుకోవడం లేదా వాయిదా వేయడం చేస్తున్నారు. సామాన్యులకు మాత్రమే కాదు ప్రముఖులకూ ఈ ఇబ్బందులు తప్పట్లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్-2 తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకోవడం గమనార్హం. ఈ క్రమంలో రాణీ వారికి సంబంధించిన అధికారిక వ్యవహారాలు చూసుకునే ‘ది రాయల్ ఫ్యామిలీ’ బృందం ఆమె కోసం ఓ రుచికరమైన రెసిపీని తయారు చేసింది. అంతేకాదు, ఈ స్పెషల్ రాయల్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో రాయల్ ఫ్యామిలీ బృందం సోషల్ మీడియా ద్వారా వివరంగా పంచుకుంది.

కరోనా ధాటికి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఈ మహమ్మారితో పోరాడుతూ రోజుకు ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో రాణి ఎలిజబెత్ ఏప్రిల్ 21న జరగాల్సిన తన 94వ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. ప్రపంచమంతా బాధపడుతోన్న ఈ సమయంలో సంబరాలు చేసుకోవడం సరి కాదని ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో రాణి పుట్టినరోజున ‘రాయల్ ఫ్యామిలీ’ బృందంలోని రాయల్ పేస్ట్రీ చెఫ్‌లు ఆమె కోసం చాక్లెట్ కప్ కేక్‌ను రూపొందించారు. ఈ కేక్‌కు సంబంధించిన ఫొటోలను వీళ్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దాని తయారీ విధానాన్ని కూడా పంచుకోవడం విశేషం.
‘రాణి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు..! ఆమె పుట్టినరోజు సందర్భంగా ది రాయల్ పేస్ట్రీ చెఫ్స్ రూపొందించిన ఈ చాక్లెట్ కప్ కేక్‌ను మీతో పంచుకుంటున్నాం..!
స్పాంజ్ కప్ కేక్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు (15 మందికి సరిపోయేలా)
వెనిగర్ - 15 గ్రాములు
పాలు - 300 ml
వెజిటబుల్ ఆయిల్ - 50 ml
బటర్ (కరిగించి చల్లార్చాలి) - 60 గ్రాములు
గుడ్లు - 2
వెనీలా ఎసెన్స్ - 5ml
సెల్ఫ్ రైజింగ్ పౌడర్ (ఉప్పు, మైదా, బేకింగ్ పౌడర్‌తో తయారు చేసిన పిండి మిశ్రమం) - 250 గ్రాములు
కొకోవా పౌడర్ - 75 గ్రాములు
చక్కెర పొడి - 300 గ్రాములు
బేకింగ్ సోడా - 10 గ్రాములు
వైట్ చాక్లెట్ చిప్స్ - 100 గ్రాములు
కప్ కేక్ మౌల్డ్స్ - 15
బటర్ క్రీమ్ టాపింగ్ తయారీకి కావాల్సిన పదార్థాలు
డార్క్ చాక్లెట్ - 90 గ్రాములు
బటర్ - 100 గ్రాములు
ఐసింగ్ షుగర్ - 125 గ్రాములు
రంగు కోసం ఫుడ్ కలర్స్ వాడచ్చు..
స్పాంజ్ కేక్ తయారీ విధానం
ముందుగా ఒవెన్‌ను 150 డిగ్రీల వద్ద ప్రి-హీట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో సెల్ఫ్ రైజింగ్ పౌడర్, చక్కెర, బేకింగ్ సోడా, కొకోవా పౌడర్లను వేసి బాగా కలపాలి. మరో గిన్నెలో గుడ్లు, వెనీలా ఎసెన్స్, బటర్, ఆయిల్, పాలు, వెనిగర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసిన పొడి మిశ్రమంలో ఈ తడి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతుండాలి. ఆ తర్వాత ఇందులో చాక్లెట్ చిప్స్ వేయాలి. ఇవి ఇష్టం లేని వాళ్లు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని కప్ కేక్ మౌల్డ్స్‌లో పోసుకోవాలి. వీటిని బేకింగ్ ట్రేలో ఉంచి 15-18 నిమిషాల పాటు ఒవెన్‌లో ఉంచి బయటికి తీయాలి. ఈ క్రమంలో కేక్ బంగారు వర్ణంలోకి మారి.. ముట్టుకుంటే స్పాంజ్‌ను తలపిస్తుంది. ఇప్పుడు ఈ కప్ కేక్స్‌ను చల్లార్చాలి.
బటర్ క్రీమ్ తయారీ విధానం
ఒక గిన్నెలో ఐసింగ్ షుగర్, బటర్ వేసి క్రీమ్‌లా మారేంతవరకు బాగా కలుపుకోవాలి. ఇందులో కరిగించిన డార్క్ చాక్లెట్‌ను గోరు వెచ్చగా ఉండగానే వేయాలి. ఇప్పుడు ఈ క్రీమ్‌తో కప్ కేక్స్‌పై అందంగా డెకరేట్ చేస్తే యమ్మీ స్పాంజ్ కప్ కేక్స్ తయార్!
ఈ ఐసోలేషన్ సమయంలో మీకు/మీ ఇంటి సభ్యులకు సంబంధించి ఏదైనా ప్రత్యేక సందర్భం ఉండి ఉంటే.. ఈ రాయల్ కేక్‌ను తయారు చేసేందుకు మీరూ ప్రయత్నించండి. మీ కేక్ ఫొటోలను #RoyalBakes హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియా ద్వారా మాతో పంచుకోవడం మాత్రం మర్చిపోకండి’ అని రాసుకొచ్చింది రాయల్ ఫ్యామిలీ బృందం.
మరి ఇంకెందుకు ఆలస్యం రాణి ఎలిజబెత్ కోసం తయారు చేసిన ఈ రాయల్ రెసిపీని మనం కూడా తయారుచేసి ఆ ఫొటోలను రాయల్ ఫ్యామిలీతో షేర్ చేసుకుందామా?!
Photos: Instagram