‘ఆడపిల్ల ఇంటికి దీపం లాంటిది. ఆడపిల్ల లేని ఇల్లు... చందమామ లేని ఆకాశం ఒక్కటే’ అని పెద్దలంటుంటారు. అందుకే ఎంతమంది మగ పిల్లలు పుట్టినా, ఆనందాలు కురిపించే ఒక ఆడపిల్లైనా ఇంట్లో ఉండాలని భార్యాభర్తలు కోరుకుంటారు. ఈ మేరకు ‘మాకు అమ్మాయి పుట్టింది. ఈ విషయం మీతో పంచుకోవడానికి ఎంతో థ్రిల్‌గా, సంతోషంగా ఫీలవుతున్నాం’ అంటూ అమ్మాయి పుట్టగానే సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని షేర్ చేసుకున్నారు అనుష్కా శర్మ-విరాట్‌కోహ్లీ. అంతకు ముందు ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ దంపతులు కూడా ‘ఆడపిల్ల పుట్టింది’ అంటూ సరిగ్గా కొత్త సంవత్సరం రోజున తమ కుమార్తెకు స్వాగతం పలికారు.
వీరిద్దరే కాదు... గత కొన్నేళ్ల నుంచి తండ్రులైన భారత క్రికెటర్లలో ఎక్కువ మందికి ఆడపిల్లలే పుట్టడం విశేషం.. ఈ క్రమంలో వీళ్లందరూ కలిసి భవిష్యత్‌లో భారత మహిళల క్రికెట్ జట్టును తయారుచేస్తున్నారంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో సరదాగా పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు. మరి నెట్ ప్రియులు మాట్లాడుకుంటున్న క్రికెటర్లు-వారి ముద్దుల మహాలక్ష్ములెవరో చూద్దాం రండి.
విరాట్ కోహ్లీ-అనుష్కా శర్మ
‘త్వరలోనే మేం ముగ్గురం కాబోతున్నాం’ అంటూ గతేడాది ఆగస్టులో తమ అభిమానులకు తీపి కబురు అందించారు విరాట్-అనుష్క దంపతులు. ఈ క్రమంలో తొమ్మిది నెలల పాటు తమ చిన్నారి కోసం ఎంతో ఆతృతగా చూసిన విరుష్క జంటకు ఆ ఆనంద క్షణం రానే వచ్చింది. జనవరి 11న మధ్యాహ్నం పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది అనుష్క. దీంతో తండ్రిగా ప్రమోషన్ పొందిన విరాట్ ‘మాకు అమ్మాయి పుట్టిందన్న శుభవార్తను మీ అందరితో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. బుజ్జాయి రాకతో మా జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలైంది’ అంటూ ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని షేర్ చేసుకున్నాడు.
ఉమేశ్ యాదవ్-తాన్యా వాద్వా
భారత క్రికెట్ జట్టుకు ఫాస్ట్ బౌలర్‌గా సేవలందిస్తున్న ఉమేశ్ యాదవ్ ఇటీవలే తండ్రయ్యాడు. అతని భార్య తాన్యా వాద్వా సరిగ్గా కొత్త ఏడాది రోజున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఏడేళ్ల క్రితం పెళ్లిపీటలెక్కిన ఈ లవ్లీ కపుల్‌కు ఇదే మొదటి సంతానం. ఈ సందర్భంగా తమ చిన్నారి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఉమేశ్- ‘ఆడపిల్ల పుట్టింది. మా చిన్నారి రాకుమారికి ఈ ప్రపంచంలోకి స్వాగతం పలుకుతున్నందుకు ఎంతో థ్రిల్లింగ్‌గా, సంతోషంగా ఉంది’ అని సంతోషంతో పొంగిపోయాడు.
అజింక్యా రహానే-రాధిక
కెప్టెన్ కోహ్లీ స్థానంలో ప్రస్తుతం ఆస్ర్టేలియా పర్యటనలో భారత జట్టును ముందుండి నడిస్తున్నాడు అజింక్యా రహానే. వైస్ కెప్టెన్‌గా, ఆటగాడిగా అందరి ప్రశంసలు అందుకుంటున్న ఈ స్టార్ క్రికెటర్ 2014లో చిన్ననాటి స్నేహితురాలు రాధికతో కలిసి పెళ్లిపీటలెక్కాడు. ఈ క్రమంలో గతేడాది అక్టోబర్‌లో ‘ఆర్య’ అనే కూతురుకు జన్మనిచ్చింది రాధిక. ఇక ఆర్య అంటే రహానేకు పిచ్చి ప్రేమ. తన ముద్దుల తనయకి దగ్గరుండి పాలు పట్టిస్తాడు. లాలి పాటలు పాడతాడు. కూతురిని ఆడిస్తాడు. రహానే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తన కూతురుతో దిగిన ఫొటోలే అధికంగా దర్శనమిస్తాయి.
అంబటి రాయుడు- విద్య
వీవీఎస్ లక్ష్మణ్ తర్వాత భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన మరో తెలుగు ఆటగాడు అంబటి రాయుడు. కొన్ని వ్యక్తిగత కారణాలతో గతేడాది ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన అతడు ఐపీఎల్లో మాత్రం అంచనాలకు మించి రాణించాడు. అంతేకాదు.. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని మళ్లీ భారత క్రికెట్ జట్టులో చోటు కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇక రాయుడు వ్యక్తిగత జీవితానికి వస్తే... 2009లో విద్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో గతేడాది జులైలో వీరిద్దరికీ పండంటి ఆడబిడ్డ జన్మించింది.
పుజారా-పూజ
టెస్ట్ క్రికెట్లో సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడుతూ భారత క్రికెట్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు ఛేతేశ్వర్ పుజారా. క్రికెట్లో ద్రవిడ్ వారసుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ క్రికెటర్ 2013లో పూజ అనే అమ్మాయితో ఏడడుగులు నడిచాడు. ఈ క్రమంలో 2018 ఫిబ్రవరిలో ‘అదితి’ అనే అమ్మాయి వీరి జీవితంలోకి అడుగుపెట్టింది. ఇక భార్యతో తన కుమార్తె చేసే అల్లరి ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుని మురిసిపోతుంటాడు పుజారా.
రోహిత్-రితిక
ఓపెనర్‌గా భారత క్రికెట్ జట్టుకు వెన్నెముకలా నిలుస్తున్నాడు రోహిత్ శర్మ. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ హిట్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన ఈ స్టార్ క్రికెటర్ 2015 డిసెంబర్లో రితికా సజ్దాను వివాహం చేసుకున్నాడు. 2018 డిసెంబర్లో వీరిద్దరికీ ‘సమైరా’ అనే కూతురు పుట్టింది. క్రికెట్ షెడ్యూల్స్‌తో నిత్యం బిజీగా ఉండే రోహిత్ ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా సమైరాతో గడపడానికే ప్రాధాన్యమిస్తుంటాడు. ఇక విదేశీ పర్యటనల్లో ఉన్నప్పుడు తన కూతురును చాలా మిస్సవుతున్నానంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌లు పెడుతుంటాడీ స్టార్ క్రికెటర్.
అశ్విన్- ప్రీతి
బంతితో మ్యాజిక్ చేయడమే కాదు... అవసరమైతే బ్యాట్‌తోనూ జట్టుకు అండగా నిలుస్తానంటూ ఆస్ట్రేలియాపై అసాధారణ ఇన్నింగ్స్‌తో నిరూపించాడు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. చెన్నైకి చెందిన ఈ మణికట్టు మాంత్రికుడు 2011లో ప్రీతి నారాయణన్‌తో కలిసి పెళ్లిపీటలెక్కాడు. తమ అన్యోన్య దాంపత్య బంధానికి గుర్తుగా ఆద్య, అకీరా అనే ఇద్దరు కూతుళ్లకు జన్మనిచ్చారీ లవ్లీ కపుల్. ముద్దు ముద్దు మాటలతో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారీ అక్కాచెల్లెళ్లు. ఈ క్రమంలో కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని అశ్విన్‌కు వీళ్లు చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలైన సంగతి తెలిసిందే.
రవీంద్ర జడేజా-రీవా సోలంకి
అశ్విన్‌లాగే తన ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతాలు సృష్టిస్తున్నాడు రవీంద్ర జడేజా. ఐదేళ్ల క్రితం రీవా సోలంకితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన అతనికి 2017 జూన్‌లో ‘నిద్యానా’ అనే కూతురు పుట్టింది. తను పుట్టినప్పుడు ‘మా ఇంటికి చిన్నారి రాకుమారి వచ్చింది’ అని సంతోషంగా చెప్పుకున్న ఈ ఆల్‌రౌండర్ కూతురు పుట్టిన తర్వాతే ఆటలో బాగా రాణిస్తున్నానంటూ పలుమార్లు చెప్పుకొచ్చాడు. ఆమె తన లక్కీ స్టార్ అని పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడీ స్టార్ క్రికెటర్.
సురేశ్ రైనా-ప్రియాంకా చౌదరి
గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సురేశ్ రైనాదీ ఇదే కథ. 2015లో ప్రియాంకా చౌదరితో కలిసి పెళ్లిపీటలెక్కిన రైనాకు గ్రేసియా అనే ముద్దుల కూతురుంది. తనంటే రైనాకు ఎంత ప్రేమంటే... తన కూతురు పేరును ఏకంగా చేతిపై పచ్చబొట్టు పొడిపించుకోవడం గమనార్హం. అలాగే గ్రేసియా పేరుతో పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడీ మాజీ స్టార్ బ్యాట్స్‌మన్.
హర్భజన్ సింగ్-గీతా బస్రా
బంతిని గింగిరాలు తిప్పుతూ బ్యాట్స్‌మన్‌ను బోల్తా కొట్టించడంలో స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ది ప్రత్యేకమైన శైలి. ఈ క్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటి గీతా బస్రాతో కలిసి 2015లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడీ పంజాబీ క్రికెటర్. 2017 జులైలో హినాయా హీర్ సింగ్ అనే పండంటి ఆడబిడ్డ వీరి జీవితంలోకి అడుగుపెట్టింది. హినాయా అంటే ‘మెరుపు’ అని అర్థం.
మహేంద్ర సింగ్ ధోనీ-సాక్షి
ఇక భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ-సాక్షిల గారాల పట్టి జీవా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐదేళ్ల వయసులోనే ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ స్టార్ కిడ్కి ఇటీవల ఓ ఎండార్స్మెంట్ కూడా వచ్చేసింది. ఇక తమ కూతురు పేరుతో ప్రత్యేకంగా ఓ ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను హ్యాండిల్ చేస్తున్న ధోనీ దంపతులు అందులో జీవా ఫొటోలను అందరితో షేర్ చేసుకుంటూ మురిసిపోతున్నారు.
గంభీర్-నటాషా
2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే ప్రపంచకప్‌లను భారత్ గెల్చుకోవడంలో కీలక పాత్ర పోషించాడు గౌతం గంభీర్. దిల్లీకి చెందిన ఈ లెఫ్ట్ హ్యాండర్ రెండేళ్ల క్రితం ఆటకు వీడ్కోలు చెప్పి రాజకీయాల్లో చేరిన సంగతి తెలిసిందే. ఇక 2011లో నటాషా జైన్‌ను పెళ్లాడిన గంభీర్‌కు ప్రస్తుతం అజీన్, అనైజా అనే ఇద్దరు కుమార్తెలున్నారు. ఓ వైపు పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలకు సేవలందిస్తూనే...తన ఇద్దరు కూతుళ్ల ఆలనాపాలనా చూసుకుంటున్నాడీ మాజీ క్రికెటర్.
* భారత జట్టు దిగ్గజ క్రికెటర్లలో ఒకరైన సచిన్ తెందూల్కర్- అంజలి దంపతులకు సారా తెందూల్కర్ అనే కూతురుంది. 23 ఏళ్ల సారా ప్రస్తుతం లండన్‌లోని యూనివర్సిటీ కాలేజ్‌లో మెడిసిన్ చదువుతోంది.
* ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ-డోనా దంపతులకు 1997లో సనా గంగూలీ అనే కూతురు జన్మించింది. తల్లి లాగే క్లాసికల్ డ్యాన్సర్ కావాలనుకుంటున్న 23 ఏళ్ల సనా ఇటీవల ఒడిస్సీ నృత్యంలో శిక్షణ పూర్తి చేసుకుంది.
1983 వరల్డ్ కప్‌ను భారత్ గెల్చుకోవడంలో కీలక పాత్ర పోషించిన కపిల్ దేవ్- రోమీ భాటియా దంపతులకు 24 ఏళ్ల అమియా దేవ్ అనే కూతురుంది. విదేశాల్లో చదువుకున్న ఆమె తన తండ్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘83’ సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్ గా మారింది.