సుమతి కొడుకు సుఖేశ్ ఆన్లైన్ క్లాసుల పేరుతో రోజులో ఎక్కువ సమయం మొబైల్‌తోనే గడుపుతుంటాడు. కానీ తను చేసేది మాత్రం సినిమాలు చూడడం, గేమ్స్ ఆడుకోవడం. ఇది తెలియక తన కొడుకు ఇంట్లో ఉన్నా కూడా తెగ చదివేస్తున్నాడనుకుంటోంది సుమతి.
భావన కూతురు శ్రీనిజకు ముందు నుంచీ కాస్త బద్ధకం ఎక్కువ. ఆన్లైన్ క్లాసులకు టైమవుతోందని తెలిసినా టీవీ ముందు నుంచి అస్సలు కదలదు. ఈ క్రమంలో- తన కూతురికి ఆన్లైన్ క్లాసులపై ఎలా ఆసక్తి కలిగించాలో ఆమెకు అర్థం కాక తల పట్టుకుంటోంది.
ప్రస్తుతం ఇంటి నుంచే తరగతులు జరుగుతోన్నా.. దానివల్ల పిల్లలకేమో గానీ పెద్దలకు మాత్రం రోజూ బ్యాటింగే అని చెప్పాలి. ఎందుకంటే స్కూల్‌కి వెళ్లే పిల్లలు ఓ క్రమపద్ధతికి అలవాటు పడతారు. అదే ఇంట్లో ఉంటే బద్ధకిస్తారు.. టీవీ, మొబైల్.. వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు అలవాటు పడిపోతుంటారు. తద్వారా వారి క్రమశిక్షణ, బంగారు భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.. అందుకే ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యే పిల్లల తల్లిదండ్రులు తమ చిన్నారుల విషయంలో పలు అంశాలు దృష్టిలో ఉంచుకొని వారితో పాటింపజేస్తే ఇంట్లో ఉన్నా కూడా పిల్లలు చదువుపై ఏకాగ్రత నిలిపే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. మరి, ఇంతకీ ఏంటా చిట్కాలు? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!
కరోనాకు విరుగుడు వచ్చేంత వరకు పిల్లలకు ఆన్లైన్ క్లాసులు తప్పేలా లేవు. దీంతో తమ పిల్లలు చదువుపై దృష్టి పెట్టేలా చేయడానికి తల్లిదండ్రులు నానా తంటాలూ పడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి బయటపడి చిన్నారులు ఇంట్లో నుంచే చక్కగా పాఠాలు నేర్చుకోవాలంటే తల్లిదండ్రులు ఇవి గుర్తుపెట్టుకోవాలి.

ఆ షెడ్యూల్ ముందే తెలుసుకోండి!
స్కూల్లో అయితే ఏ రోజు ఏ పాఠాలు చెబుతారు? ఏం హోమ్‌వర్క్ ఇస్తారు? పిల్లలతో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయిస్తారు? అన్న విషయాల్లో కొన్ని పాఠశాలల్లో ముందుగానే ఓ షెడ్యూల్ తయారుచేసుకుంటారు టీచర్లు. దాని ప్రకారం ఫాలో అవుతూ.. వారికిచ్చిన హోమ్‌వర్క్, వారితో చేయించిన క్లాస్ వర్క్.. అంతా ఏ రోజుకారోజు పిల్లల డైరీల్లో పొందుపరుస్తుంటారు. ఇక ప్రస్తుతం ఆన్లైన్ క్లాసులు నిర్వహించాల్సి రావడంతో అంతా తారుమారైపోయింది. కమ్యూనికేషన్ లోపాలు, సాంకేతిక లోపాల కారణంగా చాలామంది పిల్లలు క్లాసులకు హాజరు కాలేకపోతున్నారు. కొంతమంది హాజరైనా ఏదో విన్నాంలే అన్నట్లుగా ఉంది వారి వాలకం. అయితే ఎలాగో సరైన సదుపాయాలు లేవు కదా అని పిల్లల్ని అలా వదిలేస్తే వారిలో ఏకాగ్రత లోపించి చదువుపై శ్రద్ధ పెట్టలేరు. అలాంటప్పుడు తల్లిదండ్రులు మరింత చొరవ చూపాలి. ఈ క్రమంలో మీ పిల్లలు చదివే పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి.. ఏ రోజు ఏ పాఠాలు చెబుతారన్న షెడ్యూల్ ఏమైనా తయారుచేశారేమో తెలుసుకోండి.. ఒకవేళ అలాంటిది ఉంటే ఆన్లైన్లోనే మెయిల్ పంపించమనండి. దాని ప్రకారం మీ పిల్లలు రోజువారీ క్లాసులకు ఎగ్గొట్టకుండా హాజరయ్యేలా చేయచ్చు. ఒకవేళ షెడ్యూల్ లేకపోయినా ఆ రోజు ఏ సబ్జెక్ట్‌లో ఏ పాఠం చెప్పారో దాన్ని మీరే దగ్గరుండి పిల్లలతో చదివించచ్చు. ఇలా చేయడం వల్ల వారు క్రమశిక్షణ కోల్పోకుండా, చదువుపై వారికి ఏకాగ్రత లోపించకుండా జాగ్రత్తపడచ్చు.

క్లాసులు వింటున్నారా? గేమ్స్ ఆడుతున్నారా?
ఇప్పటి పిల్లలకు ఫోన్ దొరికిందంటే చాలు.. గేమ్స్ ఆడడమో, సినిమాలు చూడడమో చేస్తుంటారు. ఇక కొంతమందైతే ఆన్లైన్ క్లాసుల పేరుతో గంటలు గంటలు ఫోన్‌తోనే గడుపుతుంటారు. మరి, అసలు నిజంగా వాళ్లు ఇన్ని గంటలు ఫోన్లో ఏం చేస్తున్నారు? తెలుసుకోవాలంటే వారిని డైరెక్ట్‌గా కాకుండా ఇన్‌డైరెక్ట్‌గా ఫాలో అవ్వాలి. అంటే.. ముందుగా వారిపై ఓ కన్నేసి ఉంచండి.. ఇక ఎప్పుడో ఒకప్పుడు మొబైల్ పక్కన పెట్టేసి తినడమో, ఆడుకోవడమో చేస్తుంటారు కదా! అప్పుడు ఆ ఫోన్ హిస్టరీ ఒక్కసారి పరిశీలిస్తే అసలు విషయం మీకే తెలుస్తుంది. తద్వారా వారి యాక్షన్‌కి మీరు రియాక్ట్ అవ్వచ్చు. ఒకవేళ నిజంగానే అన్ని గంటలు క్లాసులే విన్నారనుకోండి.. మధ్యమధ్యలో కాసేపు విరామం తీసుకోమని చెప్పడంలో తప్పులేదు. అలాకాకుండా ఆటలు, పాటలు, సినిమాలు చూడ్డానికే ఫోన్ వాడితే మాత్రం సహించకపోవడమే మంచిది. ఈ క్రమంలో వారిపై విరుచుకుపడడం కాకుండా.. నెమ్మదిగా చెప్పండి.. ఆ రోజు విన్న పాఠాలు వారితో చదివించే ప్రయత్నం చేయండి.. ఆ తర్వాత దాంట్లో నుంచి ప్రశ్నలు అడుగుతూ, హోంవర్క్ ఇస్తూ నెమ్మదిగా వారి దృష్టిని ఆటలపై నుంచి చదువు వైపు మళ్లించచ్చు.

ఖాళీ సమయాలు ఇలా ఉపయోగించుకునేలా..!
తరగతి గదిలో మాదిరిగా రోజంతా ఆన్లైన్ క్లాసులు ఉండకపోవచ్చు. దాంతో క్లాస్ చెప్పినంత సేపు దాన్ని విని.. ఆ తర్వాత సమయమంతా ఆడుకోవడం, టీవీ చూడడం.. వంటివి చేసే చిన్నారులూ లేకపోలేదు. అలాంటి వారి విషయంలో తల్లిదండ్రులే ప్రత్యేక శ్రద్ధ చూపాలి. అలాగని వారిపై అరిచి చెప్పడం కూడా సరి కాదు. ఒకవేళ అలా చెబితే పిల్లలు మరింత మొండిగా తయారయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఖాళీ సమయాల్లో సమయం వృథా చేయకుండా వారి వారి ఆసక్తులను ప్రోత్సహించేలా పేరెంట్స్ చొరవ చూపాలి. అంటే.. కొంతమంది పిల్లలకు పెయింటింగ్ అంటే ఇష్టముంటుంది.. మరికొంతమంది పాటలు పాడడం-డ్యాన్స్ చేయడంపై మక్కువ చూపుతుంటారు. అలాంటి వారిని నిరుత్సాహ పరచకుండా ప్రోత్సహించాలి. తద్వారా వారి మనసూ రిలాక్సవుతుంది.. పేరెంట్స్ మా ఇష్టాలను గౌరవించి ప్రోత్సహిస్తున్నారన్న నమ్మకం కూడా వారిలో పెరుగుతుంది. ఫలితంగా పిల్లలకు-పేరెంట్స్‌కి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది.. మీ పిల్లలు మీరు చెప్పినట్లు వినడానికి ఇదీ ఓ చిట్కానే!

వారి నుంచి ఫీడ్‌బ్యాక్ ముఖ్యం!
అసలు మీ పిల్లలు ఇంటి నుంచే క్లాసులకు హాజరవుతున్నా కూడా టీచర్స్‌తో మీరు ఎప్పటిలాగే టచ్‌లో ఉండడం కొనసాగించాలి. తద్వారా మీ పిల్లలు సందేహాలుంటే అడుగుతున్నారా? లేదంటే వాటిని తేలిగ్గా తీసుకుంటున్నారా? అసలు వాళ్ల పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? స్కూల్లో ఉన్నప్పటిలాగే శ్రద్ధ పెడుతున్నారా? లేదా? అన్న విషయాలన్నీ తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ చిన్నారులు ఆన్లైన్లో సందేహాలు అడగడానికి భయపడడం, అలసత్వం ప్రదర్శించడం వంటివి చేస్తే పేరెంట్స్‌గా మీరే ఆ ఫీలింగ్‌ని పోగొట్టాలి. ఈ క్రమంలో వీలైతే వారి సందేహాలను మీరే నివృత్తి చేయచ్చు. అయితే అది కూడా వారిని తిడుతూ, కొడుతూ కాకుండా నెమ్మదిగా చెప్పే ప్రయత్నం చేయండి.. అలాగే వారికి ఇంట్లో ఉన్నా కూడా చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ అలవర్చగలిగితే ఆన్లైన్ క్లాసులైనా, ఆఫ్‌లైన్ క్లాసులైనా చక్కగా వింటూ నిర్భయంగా తమ సందేహాలను నివృత్తి చేసుకోగలుగుతారు. తద్వారా ఏ విషయంలోనైనా ముందుకెళ్లడానికి భయం అనేది ఆటంకంగా మారకుండా ఉంటుంది.
ఇవి కూడా!
* ఆన్లైన్ క్లాసులే కదా అని ఎక్కడ పడితే అక్కడ కూర్చొని వినడం కాకుండా పిల్లలకంటూ ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేస్తే వారికి ఎలాంటి అంతరాయం లేకుండా ఉంటుంది. అలాగే ఈ క్రమంలో వారిపై ఓ కన్నేసి ఉంచడం మర్చిపోవద్దు.
* ఇంటి నుంచే క్లాసులు వింటున్నాం కదా అని కొంతమంది పిల్లలు ఆలస్యంగా నిద్ర లేవడం, అలాగే క్లాసులకు హాజరవడం వంటివి చేస్తుంటారు. తద్వారా వారు చెప్పే విషయంపై అంత శ్రద్ధ పెట్టలేకపోవచ్చు. అలా జరగకూడదంటే స్కూల్‌కెళ్లేటప్పుడు ఎంత నీట్‌గా తయారయ్యే వారో ఆన్లైన్ క్లాసులు వింటున్నప్పుడూ అలాగే రడీ అవడం వల్ల వారిలో ఆ అలర్ట్‌నెస్ పెరుగుతుంది.
* సాధారణంగా స్కూల్లో లంచ్, స్నాక్స్ సమయాల్లో తోటి పిల్లలతో మాట్లాడడానికి చిన్నారులు ఆసక్తి చూపుతుంటారు. ఇంట్లోనూ ఇదే పద్ధతిని కొనసాగించండి. మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు, సాయంత్రం స్నాక్స్ సమయంలో మీరే వారికి స్కూల్ ఫ్రెండ్స్‌లా మారిపోండి.. ఈ క్రమంలో ఆ రోజు చెప్పిన పాఠాల గురించి మాట్లాడుకోండి.. పిల్లలు ఆన్లైన్ క్లాసులు సరిగ్గా వింటున్నారో లేదో తెలుసుకోవడానికి ఇదీ ఓ మార్గమే!
సో.. ఇవండీ! పిల్లలు ఆన్లైన్ క్లాసులపై శ్రద్ధ పెట్టాలంటే తల్లిదండ్రులు పాటించాల్సిన కొన్ని నియమాలు! మరి, మీ పిల్లల విషయంలో మీరు ఎలాంటి టిప్స్ పాటిస్తున్నారు? ‘వసుంధర.నెట్’ వేదికగా పంచుకోండి.