'నేటి బాలలే రేపటి పౌరులు' అన్నారు నెహ్రూ. మరి, ఆ బాలలంటే కేవలం అబ్బాయిలే కాదు.. అమ్మాయిలూ అందులో భాగమే. ఆ విషయం తెలిసినా నేటి సమాజంలో ఇప్పటికీ అమ్మాయిల్ని చిన్న చూపు చూడడం, వారికి సమాన అవకాశాలు దక్కకపోవడం, ప్రతి విషయంలోనూ వారిని గుప్పిట్లో బంధించడం.. వంటివి జరుగుతున్నాయి. ఇక అలాంటప్పుడు రేపటి పౌరులుగా తమను తాము నిరూపించుకోవడానికి తగిన స్వేచ్ఛ వారికి ఎక్కడ దక్కుతుంది? దీనికి తోడు ఓవైపు సమాజం అభివృద్ధి పథం వైపు పరుగెడుతోన్నా ఇంకా అమ్మాయిల్ని గుండెలపై కుంపటిలా భావించే వారు, పురిట్లోనే ప్రాణాలు తీసేసే వారూ మన చుట్టూ ఎందరో ఉన్నారు. అలాంటి వారందరికీ తగిన గుణపాఠం చెప్పాలంటే.. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో 'భేటీ బచావో.. భేటీ పఢావో' కార్యక్రమాన్ని అమలు పరచాలి. అలాగని కేవలం వారికి మంచి చదువు అందించడం, సమాజంలో ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దడంతోనే సరిపోదు.. సకల సద్గుణాల కలబోతగా వారిని మలచాలి. అందుకు మనం చేయాల్సిందల్లా.. శక్తికి ప్రతిరూపమైన ఆ దుర్గమ్మలోని గుణాల్ని వారికి వివరిస్తూ, చిన్నతనం నుంచే వారు ఆ అమ్మలోని గుణాల్ని పుణికిపుచ్చుకునేలా చేయాలి. తల్లిదండ్రులుగా అది మనకు మాత్రమే సాధ్యం. మరి, మన అమ్మాయిల్ని ఆదిపరాశక్తిలా తీర్చిదిద్దాలంటే ఆ అమ్మవారిలోని ఏయే లక్షణాలను మన ఆడపిల్లలకు చిన్నతనం నుంచే నేర్పించాలో ఈ 'దసరా శరన్నవరాత్రుల' సందర్భంగా తెలుసుకోవడం సందర్భోచితం.

మనలోనూ ఎన్నో అవతారాలు!
ఆ అమ్మ వారు ఒక్కరే అయినా.. ఎన్నో రూపాల్లో భక్తులకు దర్శనమిస్తుంటుంది.. తమను చేరి కొలిచిన వారి కోర్కెలు తీర్చడానికి విభిన్న రూపాల్లో సాక్షాత్కరిస్తుంది. అందుకే దసరా అంటే ఒక రోజుకే పరిమితమైన పండగ కాదు.. పది రోజుల పాటు ఆ అమ్మను విభిన్న రూపాల్లో కొలిచి సేవించే అతి పెద్ద పండగ. తమ భక్తుల కడుపు నింపే అన్నపూర్ణాదేవిగా ఒక రోజు, సిరులు ప్రసాదించే మహాలక్ష్మీ దేవిగా మరో రోజు, విద్యాబుద్ధులు నేర్పే సరస్వతీ దేవిగా ఇంకో రోజు.. ఇలా పాడ్యమి మొదలుకొని దశమి వరకు పది అవతారాల్లో అమ్మ మనకు దర్శనమిస్తుంటుంది. ఇలా తన అవతారాల్లాగే ప్రతి ఆడపిల్లలోనూ ఎన్నో రూపాలుంటాయని ఆ అమ్మ మనకు తెలియజేస్తుంది. అంటే.. ఓ కూతురిగా ప్రారంభమైన మన జీవితం.. ఉద్యోగినిగా, భార్యగా, కోడలిగా, అమ్మగా.. ఇలా మనం మన జీవన గమనంలో ఎన్నో అవతారాలెత్తాల్సి వస్తుంది. ఇదే విషయాన్ని మనం మన పిల్లలకు వివరించాలి. అయితే ఆ దశలన్నింటిలోనూ విజయవంతంగా ముందుకు దూసుకుపోవాలంటే చిన్నతనం నుంచే వారికి మంచి విద్యను అందించడంతో పాటు అణకువ, గౌరవ మర్యాదలు, మంచి నడవడిక.. వంటివన్నీ నేర్పించాలి. అది కూడా వారికి కేవలం మనం చెబితే అర్థం కాదు.. చిన్నతనం నుంచీ వారు మనల్ని గమనిస్తూ ఎదుగుతారు.. కాబట్టి మన ప్రవర్తన వారిపై ప్రభావం చూపుతుంది. అందుకే ఇవన్నీ మనం పాటిస్తూ చెబితే వారు తప్పకుండా అర్థం చేసుకుంటారు. ఆయా దశల్ని విజయవంతంగా దాటుకుంటూ సంపూర్ణ మహిళగా పేరుతెచ్చుకుంటారు.

నిర్భయంగా ఎదిగేలా..!
దుర్గమ్మ అంటేనే శక్తికి మారు రూపం. తన బాహు శక్తితో ఎందరో రాక్షసుల్ని దునుమాడి ఈ లోకాన్ని సురక్షితంగా కాపాడుతుందా చల్లని తల్లి. అందుకే ఆ అమ్మలోని శక్తియుక్తుల్ని పుణికిపుచ్చుకునేలా మన అమ్మాయిల్ని ప్రేరేపించాలి. ఈ రోజుల్లో అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలు, అత్యాచారాలకు అంతూ-పొంతూ లేకుండా పోతోంది. మరి, వీటికి అడ్డుకట్ట వేయాలంటే చట్టంపై ఆధారపడడం కాకుండా ఆడపిల్లలంతా ఎవరికి వారే తమ శక్తియుక్తుల్ని పెంచుకోవాలి. ఇందుకోసం ప్రస్తుతం బోలెడన్ని మార్గాలున్నాయి. ఆడపిల్లలు కదా.. చదువుకుంటూ ఇంటి పట్టునే ఉండాలి.. అని వారికి నూరిపోయడం కాకుండా వారికి నచ్చిన అంశాల్లో ముందుకెళ్లేలా తల్లిదండ్రులుగా మన ప్రోత్సాహం తప్పకుండా ఉండాలి. అలాగే వారు శారీరకంగా దృఢంగా తయారు కావడానికి కరాఠే, ఆత్మరక్షణ విద్యలు నేర్చుకునేలా వారిని ప్రేరేపించాలి. తద్వారా ఎప్పుడైనా ఏదైనా సమస్య ఎదురైతే స్వయంగా పరిష్కరించుకునే శక్తి, బలం వారి సొంతమవుతాయి. కేవలం తామే కాదు.. తమ చుట్టూ ఉన్న వారిని రక్షించేంత ధైర్యవంతులవుతారు కూడా! తల్లిదండ్రులుగా మన ఆడపిల్లల్ని ఇలా ధైర్యవంతులుగా తీర్చిదిద్దడం వల్ల అది వారికి ప్లస్ అవడంతో పాటు వారి పేరెంట్స్‌గా మనకూ మంచి పేరొస్తుంది.. అలాగే ఆడపిల్లలంతా ఎవరి సమస్యను వారు పరిష్కరించుకోగలిగితే.. ఎలాంటి అరాచకాలూ వారిని ఏమీ చేయలేవు.

అన్నిట్లోనూ ఆరితేరేలా...
రూపం ఒక్కటే అయినా.. ఎనిమిది చేతులతో ఈ లోకాన్ని రక్షిస్తుందా చల్లని తల్లి. ఓ చేత్తో చల్లగా ఉండమని దీవిస్తూ, మరో చేత్తో దుష్టులను శిక్షిస్తుంటుంది.. ఇలా ఏకకాలంలో ఎన్నో విధులు నిర్వర్తిస్తూ.. మహిళలూ మల్టీటాస్కింగ్ చేయగల సమర్థులు అని నిరూపిస్తోందీ అమ్మల గన్న అమ్మ. ఇదే విషయాన్ని మనం మన పిల్లలకు బోధించాలి. చిన్నతనంలో ఒకరిపై ఆధారపడినా.. పెరిగి పెద్దయ్యే కొద్దీ ఆడపిల్లలపై పని ఒత్తిడి క్రమంగా పెరుగుతుంది. ఇక పెళ్త్లెన తర్వాత తమ పనులకు తోడు అదనంగా బరువు-బాధ్యతలు వచ్చి చేరతాయి. ఓవైపు ఇంటి పనులు, మరోవైపు ఉద్యోగ బాధ్యతలు, ఇంకోవైపు పిల్లల్ని చూసుకోవడం.. ముందు నుంచి అలవాటు లేకపోవడంతో ఇవన్నీ ఒకేసారి నెత్తిన పడడం వల్ల చాలామంది ఆడవారు ఒత్తిడి, ఆందోళనలకు గురవుతున్నారు. కాబట్టి ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే చిన్నతనం నుంచే అమ్మాయిలకు వివిధ పనులను నేర్పించాలి. అంటే.. అమ్మలందరూ తమతో పాటు వారి కూతుళ్లనూ వంట పనులు, ఇంటి పనుల్లో భాగం చేయడం.. ఇక నాన్నలు కూడా తమ కూతుళ్లను వారితో కలిసి బయటికి తీసుకెళ్లి సరుకులు, కాయగూరలు.. వంటివి కొని తీసుకొచ్చేలా నేర్పించడం.. వంటివన్నీ అలవాటు చేయించడం వల్ల పెద్దయ్యాక వారు ఇబ్బంది పడకుండా ఉండడంతో పాటు వారు ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించగలుగుతారు. ఇలా ఆడపిల్లలు తమ కాళ్లపై తాము నిలబడితే వారిని కన్న తల్లిదండ్రులుగా మీరు ఓ మెట్టు ఎక్కినట్లే కదా మరి!

దూరదృష్టితో సక్సెస్ సాధ్యం!
అమ్మవారి కళ్లను పద్మాలతో పోల్చుతుంటారు. అంటే.. కమలం విశాలమైన నేత్రాలు కలిగిన తల్లి అన్నమాట. అందుకే ఈ దసరా సందర్భంగా ఏర్పాటుచేసే దుర్గా మండపాల్లో కొలువుదీరిన అమ్మవారిని పరిశీలిస్తే.. ఆమె నేత్రాలు ఎంతో విశాలంగా ఉండడం మనం గమనించచ్చు. అలా పెద్ద పెద్ద కళ్లతో ఈ ప్రపంచంలో జరుగుతోన్న మంచి, చెడుల్ని పరిశీలిస్తూ.. తన ఆయుధాలతో చెడుని నశింపజేస్తోందా అమ్మల గన్న అమ్మ. అంతేకాదు.. ప్రతి అమ్మాయీ దూరదృష్టిని కలిగి ఉండాలని తన విశాలమైన నేత్రాలతో చెప్పకనే చెబుతుందా చల్లని తల్లి. ఇదే విషయాన్ని మనం కూడా మన పిల్లలకు చిన్నతనం నుంచే నేర్పించాలి. జీవితంలో ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు సాగాలంటే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని, దాన్ని చేరుకోవడానికి ప్రయత్నించడం ముఖ్యం. అందుకే తమ పిల్లలు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారో తెలుసుకొని వారు ఆ గోల్‌ని నిర్దేశించుకునేలా, దాన్ని సక్సెస్‌ఫుల్‌గా చేరుకునేలా చేసే బాధ్యత తల్లిదండ్రులదే! ఈ క్రమంలో వారి అవసరాలను తీర్చుతూ, వారిని ప్రశాంతమైన వాతావరణంలో పెరగనిస్తూ, మీ వంతు ప్రోత్సాహాన్ని వారికి అందిస్తూ ఆ గోల్ చేరుకునేందుకు సహకరించాలి. అప్పుడే మన పిల్లలు తమ జీవితంలో విజేతలవుతారు. వారిని ఆ దిశగా నడిపించిన మనమూ తల్లిదండ్రులుగా సక్సెసవుతాం.
సో.. ఇవండీ.. అమ్మవారి నుంచి మనం మన ఆడపిల్లలకు నేర్పించాల్సిన కొన్ని అంశాలు! 'ఆడపిల్లే కదా.. కాస్త చదువు చెప్పించి.. పెళ్లి బాధ్యత తీరిపోతుంది..' అనుకోకుండా.. వారినీ అబ్బాయిలతో సమానంగా పెంచుతూ, ఆ ఆదిపరాశక్తిలా తీర్చిదిద్దితే.. ఈ లోకంలో వారిపై జరిగే ఎన్నో అరాచకాలకు అడ్డుకట్ట పడుతుంది.. వారిని ఈ సంఘంలో ఓ పరిపూర్ణ మహిళగా మలిచిన ఘనతా తల్లిదండ్రులుగా మనకు దక్కుతుంది. పేరెంట్స్‌గా అంతకంటే మనకు కావాల్సింది ఇంకేముంటుంది చెప్పండి!