మేడమ్... మా పాప వయసు 9 సంవత్సరాలు. ప్రతి చిన్న విషయానికీ ఏడుస్తుంది. అంతేకాదు.. మొండిగా తయారై.. చదువులో కూడా వెనుకబడింది. నాకు 4 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు. వాడు ముద్దుగా ఉంటాడు. కానీ పలు ఆరోగ్య సమస్యలున్నాయి. మేము ఎక్కువ గారాబం చేయడం వల్ల మా అమ్మాయి అలా తయారై ఉండచ్చు. బహుశా ప్రతి విషయంలోనూ పిల్లలిద్దరి మధ్య ఉన్న పోటీతత్వం (తోబుట్టువుల వైరం) వల్లే అలా చేస్తుందేమోనని అనిపిస్తోంది. అందుకే మా పాపతో ఎక్కువ సమయం వెచ్చించి చూశాను. కానీ తనలో ఎలాంటి మార్పు కనిపించటం లేదు. మేము కొంతకాలం వేచి చూడాలా? లేకపోతే వెంటనే సైకాలజిస్టుని కలవమంటారా? మా పాపను మామూలు స్థితికి తీసుకురావడానికి ఇంకా ఏవైనా సలహాలు ఇవ్వగలరు.
జ. మీ అమ్మాయి మొదటి నుంచి ఇలాగే ఉందా? ప్రతి దానికీ ఏడుస్తుందా? తను అనుకున్నది సాధించాలనుకుంటుందా? చదువులో మొదటి నుంచి పెద్దగా ఆసక్తి చూపించడం లేదా? ఇలాంటి విషయాలన్నీ కూడా స్పష్టంగా తెలియాలి. ఒకవేళ మీ అమ్మాయి తమ్ముడు పుట్టిన తర్వాతే ఇలా చేస్తుందంటే తల్లిదండ్రులుగా మీరే ఈ సమస్యను ఏ రకంగా పరిష్కరించాలో ఆలోచించుకోవాలి. మీ బాబు చక్కగా, ముద్దుగా ఉన్నప్పటికీ ఎప్పుడూ అనారోగ్యంతో ఉంటాడని రాశారు. అలాంటి సందర్భంలో మీ సమయం, శ్రద్ధ, ఆలోచనలన్నీ అతనికే కేటాయించాల్సిన అవసరం వచ్చుండచ్చు. అదే సమయంలో మీ నుంచి మీ అమ్మాయికి సరైన శ్రద్ధ అందక.. ఒంటరిగా ఉన్నాననే భావన కలిగి ఉండచ్చు. కొన్నిసార్లు మొండితనం చేయడం వల్ల తన పట్ల మీరు శ్రద్ధ చూపిస్తే.. అది తనకు తెలియకుండానే అలవాటుగా మారుండచ్చు. ఇలా మీ శ్రద్ధను పొందడానికి తను చేసే ప్రయత్నాలతో చదువు మీద శ్రద్ధ తగ్గి ఉండచ్చు.

అలాగే మీరు ఇద్దరు పిల్లల మధ్య పని, సమయాన్ని విభజన చేసుకునే క్రమంలో ఇది వరకు చూపించినంత శ్రద్ధ ఇప్పుడు చూపించగలుగుతున్నారో లేదో చెప్పలేదు. అలాగే తన వయసు పెరిగే కొద్దీ చదువు స్థాయి కూడా క్రమంగా పెరుగుతుంది. అలా తన స్థాయి పెరిగే కొద్దీ దానికి తగిన విధంగా ఆ అమ్మాయి మానసిక స్థితి ఉంటుందా? అనే విషయాన్ని కూడా ఆలోచించాలి. దాంతో పాటు ఆమె తండ్రికి మీ అమ్మాయి పట్ల శ్రద్ధ చూపించడానికి ఎంత వరకు వీలవుతుంది? అనే విషయాన్ని భార్యభర్తలిద్దరూ కలిసి ఆలోచించుకోవాలి.
మీరు మొదట బాబు ఆరోగ్యం విషయంలో వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీ బాబు ఆరోగ్యంగా మారాక అక్క, తమ్ముడు ఇద్దరూ కలిసి చేసే పనుల్లో వారిని ప్రోత్సహించండి. అందులోనూ ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనే భావనను రాకుండా జాగ్రత్తపడండి. ఒకవేళ అక్కగా తమ్ముడిని బాగా చూసుకుంటే.. ఆమెని ప్రశంసించండి. అలా చేయడం వల్ల ఆమెకి ప్రశంసలతో పాటు మీరు ఆమెపై శ్రద్ధ చూపిస్తున్నారనే భావన కూడా కలుగుతుంది. అలాగే తనతో హోంవర్క్ చేయించేటప్పుడు, తనను చదివించేటప్పుడు పూర్తి ఏకాగ్రత ఆమెపై ఉండేటట్టుగా చూసుకోండి. మీరు ఆమెతో ఎక్కువ సమయం కేటాయించానని చెప్పారు. అయితే అలా గడిపిన సమయంలో ఆమె ఎంత సంతృప్తి చెందుతుంది అనే విషయాన్ని కూడా గమనించాలి. అలాగే మీ దంపతులిద్దరూ, పాప, బాబు.. అందరూ ఒక్కటే అనే విషయాన్ని ఆమెకి చెప్పే ప్రయత్నం చెప్పండి. అయితే ప్రాక్టికల్‌గా ఇది ఎలా సాధ్యమవుతుంది అనేది పూర్తిగా అర్థం కాకపోవచ్చు. దానికి మీరు సైకాలజిస్టుని కలిసి మీ పరిస్థితుల్ని వివరించండి. వారు అమ్మాయి మానసిక స్థితి, ప్రజ్ఞా స్థాయిని పరీక్షిస్తారు. అలాగే మీ వైపు నుంచి అమ్మాయికి ఎలాంటి సహాయం చేయాలనేది కూడా వారు వివరిస్తారు.
- డా|| పద్మజ, సైకాలజిస్ట్