చిన్నపిల్లలకు కథల పుస్తకాలన్నా, కార్టూన్ సినిమాలన్నా చాలా ఇష్టం. టీవీలో ఆ తరహా సినిమాలు చూస్తూనే అందులోని క్యారక్టర్లను అనుకరిస్తుంటారు కొందరు చిన్నారులు. ఈ క్రమంలోనే మార్వెల్ సూపర్‌హీరో స్పైడర్ మ్యాన్ క్యారక్టర్ అంటే అబ్బాయిలకు మరీ ఇష్టం. ఆ పాత్రలాగే గోడలపై పాకాలని, వాటి పైనుంచి దూకాలని తెగ ఆరాటపడిపోతుంటారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన ఏడేళ్ల బుడతడిది కూడా ఇదే ఆరాటం. అయితే మొదట్లో జారి కింద పడ్డానని, దెబ్బలు తగిలాయని తన ప్రయత్నాన్ని మానుకోలేదా చిన్నోడు. అలుపెరగకుండా ప్రయత్నించాడు.. ఎలాంటి సపోర్ట్ లేకుండా అచ్చం స్పైడర్ మ్యాన్‌లా గోడలు పట్టుకొని అలవోకగా పాకడం, దూకడం నేర్చుకున్నాడు. అందుకే ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిపోయాడు.
యశర్థ్ సింగ్ గౌర్..
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన ఏడేళ్ల బుడతడు! అందరు పిల్లల్లాగే కార్టూన్ సినిమాలు చూడడమంటే ఈ బుడ్డోడికి భలే ఇష్టం. ఇక మార్వెల్ సూపర్ హీరో స్పైడర్ మ్యాన్ అంటే మరీనూ! అందుకే ఆ సినిమా చూసి ఎలాగైనా సరే తానూ స్పైడర్ మ్యాన్‌లా గోడలపై పాకాలనుకున్నాడు. మొదట్లో ప్రయత్నిస్తూ పదే పదే కిందపడే వాడు. అయినా తన ప్రయత్నాన్ని విరమించుకోలేదు యశర్థ్. ఇంట్లో పెద్ద వాళ్లు వద్దని వారించినా వినకుండా స్పైడర్ మ్యాన్ అవ్వాలని సాధన చేశాడు.. సక్సెసయ్యాడు.
టెక్నిక్స్ నేర్చుకున్నాగా..!
మూడో తరగతి చదువుతోన్న యశర్థ్ ఎలాంటి సపోర్ట్ లేకుండా గోడలు ఎక్కడం, దిగడం.. వంటివి అలవోకగా చేసేస్తున్నాడు. ఇదెలా సాధ్యమైంది అని అడిగితే అందులోని టెక్నిక్స్ నేర్చుకున్నానంటూ నిండైన ఆత్మవిశ్వాసంతో బదులిస్తున్నాడీ క్యూట్ బాయ్. ‘స్పైడర్ మ్యాన్ సినిమా చూశాక ఆ క్యారక్టర్లాగే గోడలెక్కాలని, గోడలపై పాకాలని అనుకున్నా. ఇలా చేయడం ఇంట్లోనే ప్రాక్టీస్ చేశా. మొదట్లో పదే పదే కింద పడే వాణ్ని. దాంతో ఇంట్లో వాళ్లు వద్దంటే వద్దని వారించారు. అయినా నేను వినలేదు. టెక్నిక్స్ నేర్చుకొని మరీ స్పైడర్ మ్యాన్‌లా గోడలెక్కడం నేర్చుకున్నా. ఇప్పుడు కింద పడిపోతానన్న భయమే నాకు లేదు. ఎందుకంటే ఒకవేళ పడిపోతానని అనుకున్నప్పుడు ముందుగానే దూకేస్తా. ఇలా నా స్పైడర్ మ్యాన్ స్కిల్స్ గురించి మా అన్నయ్యతో చెప్పాను. తన ద్వారానే ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి మీ దాకా చేరింది..’ అంటూ తన స్పైడర్ మ్యాన్ స్కిల్స్‌తోనే కాదు.. తన మాటలతోనూ మాయ చేస్తున్నాడీ స్పైడర్ బాయ్. పెద్దయ్యాక ఐపీఎస్ ఆఫీసర్ కావాలన్నది ఈ బుడ్డోడి కోరికట.
ఇలా ఈ చిన్నోడి స్పైడర్ మ్యాన్ స్కిల్స్ చూసి నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు. ‘వండర్’, ‘గ్రేట్’ అంటూ ఈ రియల్ స్పైడర్ మ్యాన్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
గమనిక:
అయితే చిన్నారుల్లో ఇలాంటి నైపుణ్యాలు ఉండడం మంచిదే.. కానీ ఒకరిని చూసి మరొకరు అనుకరించే అలవాటు చాలామంది పిల్లల్లో ఉంటుంది. అది ఒక్కోసారి ప్రమాదకరం కావచ్చు.. కాబట్టి మీరూ మీ పిల్లల్ని ఓ కంట కనిపెడుతూ ఉండండి.. లేదంటే మీ కళ్లు గప్పి వారు ఇతర ప్రమాదాలు కొని తెచ్చుకునే అవకాశమూ లేకపోలేదు..!