మీ పిల్లలు చిన్నవయసు నుంచే క్రమంగా బరువు పెరుగుతున్నారా? అయితే టీనేజ్‌కి వచ్చేసరికి వారు స్థూలకాయులుగా మారే అవకాశం ఉందంటోంది ఓ తాజా అధ్యయనం. ఎందుకంటే టీనేజ్‌లోకి వచ్చే సరికి వారి శరీరంలో క్యాలరీలు కరగడం చాలావరకు తగ్గుతుందట. ఈ సమయంలో సరైన వ్యాయామం లేకపోవడం, క్యాలరీలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం.. వంటివన్నీ ఇందుకు కొన్ని కారణాలుగా వారు గుర్తించారు. కాబట్టి బరువు విషయంలో చిన్నతనం నుంచే జాగ్రత్తగా ఉండడం మంచిది. తద్వారా టీనేజీలో ఎదురయ్యే స్థూలకాయం, ఇతర ఆరోగ్య సమస్యల బారి నుంచి కూడా దూరంగా ఉండచ్చు. మరి అందుకు ఏం చేయాలో తెలుసుకుందాం రండి.

చొరవ చూపాలి..
చాలామంది పిల్లలు వారిని ఏది చేయొద్దంటామో.. అదే చేస్తుంటారు. ఆహారం విషయంలోనూ అంతే! ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.. అని చెప్పినా సరే.. అవే తింటామని మొండికేస్తుంటారు. కానీ, వారిని అలాగే వదిలేస్తే టీనేజీలో స్థూలకాయం బారిన పడచ్చు. కాబట్టి చిన్నతనం నుంచే జంక్‌ఫుడ్, నూనె సంబంధిత పదార్థాలు, ప్రాసెస్డ్ ఫుడ్.. వంటి కొవ్వులు, క్యాలరీలు అధికంగా ఉండే ఆహార పదార్థాలకు పిల్లల్ని సాధ్యమైనంతవరకు దూరంగా ఉంచాలి. అలాగని వాటిని పూర్తిగా తీసుకోవడం మానేయమంటే వాళ్లు అస్సలే మానరు. కాబట్టి మీరే నెలకో, పదిహేను రోజులకోసారో.. వారికి నచ్చిన ఏదో ఒక పదార్థం తక్కువ మొత్తంలో తినేలా చూడొచ్చు. అలాగే వారు రోజూ ఏం తింటున్నారు.. అని ఓ కన్నేసి ఉంచడం మంచిది. తద్వారా కొవ్వులు అధికంగా ఉండే ఆహార పదార్థాలకు వారు చేరువ కాకుండా జాగ్రత్తపడచ్చు.
ఓ అలవాటుగా..
టీనేజీలో స్థూలకాయం బారిన పడకుండా ఉండేందుకు పిల్లలకు వ్యాయామం ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. అలాగని బరువు పెరిగిన తర్వాత కఠినతరమైన వ్యాయామాలు చేసి దాన్ని తగ్గించుకోవడం కంటే చిన్నతనం నుంచే చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేస్తూ మంచి జీవనవిధానాన్ని అలవర్చుకోవడం మంచిది. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయంలో శ్రద్ధ వహించడం ఉత్తమం. ఈ క్రమంలో పెద్దలు వ్యాయామం చేస్తూ.. తమతో పాటు పిల్లల్ని పలు రకాల వ్యాయామాల్లో భాగం చేయాలి. నడక, జాగింగ్, స్కిప్పింగ్, సైక్లింగ్, మెట్లెక్కడం, యోగా, ఈత, డ్యాన్స్, ఆటలు.. వంటి వాటిని వారి రోజువారీ పనుల్లో భాగం చేయాలి. ఇలా అలవాటైన తర్వాత క్రమంగా జిమ్, మెడిటేషన్ తరగతులు, ప్రత్యేక శిక్షణ తరగతుల్లో చేర్పించడం.. మొదలైనవి చేయడం వల్ల అటు మంచి లైఫ్‌స్త్టెల్ అలవడడమే కాకుండా.. బరువు కూడా అదుపులో ఉంటుంది. తద్వారా టీనేజీలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురవకుండా జాగ్రత్తపడచ్చు.

వీటికి దూరంగా..
పిల్లలు చిన్నతనం నుంచి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు అలవాటు పడడం వల్ల కూడా వారు టీనేజీకి వచ్చేసరికి స్థూలకాయం బారిన పడుతున్నారంటున్నారు నిపుణులు. అదేంటీ.. అనుకుంటున్నారా? టీవీ చూడడం.. మొబైల్స్, పీసీలో ఆటలాడడం, సామాజిక అనుసంధాన వెబ్సైట్లలో చాటింగ్.. వంటివన్నీ కూర్చుని చేసేవే. ఇలా రోజులో అధిక సమయం కూర్చోవడం వల్ల కూడా వారు బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే అసలు టీవీ చూడొద్దు.. గ్యాడ్జెట్స్ ముట్టుకోవద్దు.. అంటే వారు వినరు కాబట్టి రోజులో కొద్దిసేపు ఓ వినోదాత్మక కార్యక్రమమో, వారికి ఇష్టమైన మరేదైనా ప్రోగ్రామో.. చూడనివ్వడం మంచిది. అలాగే పిల్లల్ని మొబైల్స్, సామాజిక అనుసంధాన వెబ్సైట్ల జోలికి వెళ్లకుండా కాపాడడం మరీ మంచిది. ఒకవేళ వారికి అవి అలవాటుగా మారితే.. నెమ్మదిగా ఆ అలవాటును తగ్గించాలి. ఎందుకంటే ఒకసారి వాటికి అలవాటు పడ్డారంటే వదలడం కష్టంగా మారుతుంది. కాబట్టి ఇవన్నీ పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పటి నుంచే దృష్టిలో ఉంచుకొని, వ్యాయామంతో వారి బరువు అదుపులో ఉంచడం ఉత్తమం.
కాస్త కష్టమైనా..
చిన్నపిల్లల్ని పండ్లు, పచ్చి కూరగాయలు, నట్స్.. వంటి ఆరోగ్యకరమైన ఆహారం తినమంటే అస్సలు తినరు. కేక్స్, చిప్స్.. వంటివైతే ఇష్టంగా లాగించేస్తారు. ఎందుకంటే వాటి రుచి అలాంటిది మరి. అయితే పిల్లలు అమితంగా ఇష్టపడి తినే ఇలాంటి ఆహార పదార్థాలు వారి ఆరోగ్యానికి అంత మంచివి కావు అన్న సంగతి తెలిసిందే. అందుకే కాస్త కష్టమైనా వారికి చిన్నతనం నుంచే పండ్లు.. క్యారట్, బీట్రూట్ వంటి దుంపలు.. బాదం, జీడిపప్పు, పల్లీల వంటి నట్స్ తినడం అలవాటు చేయాలి. పిల్లలు ఏదైనా మిమ్మల్ని చూసే నేర్చుకుంటారు కాబట్టి ఆ పని మీరూ చేస్తూ.. వారిని కూడా చేయమని ప్రోత్సహించాలి. ఇలా పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లు చేయడం వల్ల వారు టీనేజీలో స్థూలకాయం బారిన పడకుండా కాపాడచ్చు.. అదేవిధంగా వారి ఆరోగ్యాన్నీ సంరక్షించచ్చు.
టీనేజీ పిల్లల్లో స్థూలకాయాన్ని ఆపాలంటే చిన్నతనం నుంచే పిల్లల విషయంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఇవీ. మరి, మీరూ ఇలాంటి విషయాల్లో శ్రద్ధ వహించి.. నిపుణులు చెప్పిన చిట్కాల్ని పాటిస్తే ఈ సమస్యను చాలావరకు తగ్గించవచ్చు. ఫలితంగా మీ పిల్లల ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చు.