చిన్నారులే ఇంటికి సిరిమువ్వలు.. వాళ్లకు ఎలాంటి చిన్న అపాయం జరిగినా ప్రాణం తల్లడిల్లిపోతుంది. అయితే అప్పుడే పాకడం, నడవడం మొదలుపెట్టే చిన్నారులకు సంబంధించి ప్రమాదాలు ఎక్కువగా ఇంట్లోనే జరుగుతున్నాయి. వాళ్లకు ఏ ఇబ్బందీ కలగకుండా ఉండాలంటే ఇంటా, బయట కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. మరి, అవేమిటో చూద్దామా...
* చిన్నారి నేలపై పాకుతోందంటే ఇంట్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడూ గేటు మూసి ఉంచడం మర్చిపోకూడదు. వాళ్ల చేతికి ఏ వస్తువూ అందకుండా చూసుకోవాలి. చాలా ప్రమాదాలు ఇలాంటి చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే జరుగుతున్నాయని గుర్తించాలి.
* పిల్లలు తలుపు సందుల్లో చేతులు పెట్టి తలుపును వాళ్ల వైపు లాక్కోవడం వంటివి చేస్తుంటారు. కొన్నిసార్లు అందులో చేతులు పెట్టినప్పుడు గాలి కారణంగా అవి కొట్టుకోవచ్చు కూడా! ఇలాంటప్పుడు చేతులు నలిగి, రక్తం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే తలుపులు కదలకుండా ప్రత్యేక ఏర్పాటు చేసుకోవాలి.
* వాళ్ల చేతికి అందే ఎత్తులో ఏ వస్తువులూ లేకుండా చూడాలి. కొన్నిసార్లు బరువైన వస్తువులను పైకి లాక్కుని ప్రమాదం బారినపడుతుంటారు కూడా. కాఫీ కప్పులు, గాజు సామాన్లు, చాకులు, కత్తులు.. ఇలా ఏవీ వాళ్లకు అందుబాటులో ఉంచొద్దు.

* కిందికి ఉండే స్విచ్ బోర్డు, ప్లగ్స్లో వాళ్లు చేతులు పెట్టడం లేదా చిన్న చిన్న వస్తువులు అందులో ఉంచడం... లాంటివి కూడా చేస్తుంటారు. వీలైతే అక్కడ కరెంటు డిస్కనెక్ట్ చేయండి. లేదంటే లోపలకు చేతులు వెళ్లకుండా ప్లగ్లు మార్చడం, బోర్డు అక్కడ నుంచి తీసి పైన పెట్టడం...ఏదో ఒక ప్రత్యామ్నాయ ఏర్పాటు తప్పనిసరి. ఇంట్లో స్మోక్ అలారం ఏర్పాటు చేసుకోవడం కూడా మంచిదే.
* పిల్లలు నడక నేర్చుకునే క్రమంలో లేచి నిల్చున్నప్పుడు గోడల చివర, మూలల వద్ద తలను గుద్దుకోవడం జరుగుతుంది. ఆ చివరలు పదునుగా లేకుండా చేయాలి. వీలైతే అటువైపు వెళ్లకుండా ఏర్పాట్లు చేస్తే ఇంకా మంచిది.
* చిన్నచిన్న వస్తువులు, కాయిన్స్, పిన్నులు... లాంటివి చిన్నారులు మింగేసే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి వారికి అందుబాటులో ఇలాంటి వస్తువులు లేకుండా జాగ్రత్తపడాలి.
* మందులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, కత్తెర, గాజు సామాన్లు...ఇలా ఏవీ చిన్నారికి అందుబాటులో ఉంచొద్దు.
* ఫ్లోరింగ్ ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నేల ఎప్పుడూ తడిగా ఉంచొద్దు. చీమలు, క్రిములు, కీటకాలు లాంటివి లేకుండా చూసుకోవాలి.
* ఒకటి కన్నా ఎక్కువ అంతస్తులు ఉన్నప్పుడు మెట్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. చిన్నారులు కొంత వరకు వెళ్లి కిందకు దిగలేరు. పైకి ఎక్కలేరు. అలాంటప్పుడు మెట్ల పైనుంచి కిందికి దొర్లిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ల కదలికలపై ఒక కన్నేయడం ఎంతైనా మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ మెట్లు ఎక్కనివ్వకుండా చూడాలి.

* నీళ్ల బకెట్లు, ట్యాంకు... ఇలాంటివాటి వద్దకు చిన్నారులు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
* మీకు కారు ఉంటే అందులో బేబీ సీటు ఏర్పాటు చేయడం తప్పనిసరి. ప్రయాణం చేసినప్పుడు పిల్లలు ఏ ఇబ్బందీ లేకుండా పడుకునేలా సీటింగ్ ఉండాలి. అలాగే వారిపై ఎండ పడకుండా తగిన ఏర్పాట్లు చేయాలి.
* కొన్ని ఆహార పదార్థాలు చిన్నారులకు ఎలర్జీ కలిగిస్తాయి. వాళ్లకు కొత్తగా ఏదైనా తినిపిస్తున్నప్పుడు రోజుకొక వెరైటీనే పెట్టాలి. కొద్దికొద్దిగా నిదానంగా అలవాటు చేయాలి. రకరకాల పదార్థాలు ఒకే రోజు పెట్టకూడదు. కొన్ని రోజుల వ్యవధి తీసుకొని కొత్త ఆహారాన్ని ప్రయత్నించవచ్చు. మీరిచ్చిన ఆహారం వాళ్లకు నప్పుతుందో, లేదో; శరీరానికి సరిపడుతుందో లేదో పరిశీలించడం చాలా ముఖ్యం.
ఇలా చిన్నారుల విషయంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. ప్రతి అంశంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా బుజ్జాయికి ఏ ప్రమాదం కలగకుండా చూసుకోవచ్చు. మీరూ సంతోషంగా ఉండొచ్చు!!