వేదకు ఏడాది కూతురుంది. ఆ పాపకు తలస్నానం చేయించాలంటే వేదకు రోజూ ఇబ్బందే! తలపై నుంచి నీళ్లు పోస్తే చాలు.. ఆ బుజ్జాయి తలపైకి ఎత్తడం, నీళ్లు మింగడం, కళ్లు తెరిచే ఉంచడం చేస్తుంది. తద్వారా తన చిన్నారికి ఎక్కడ పొలమారుతుందోనని భయం భయంగా రోజూ తలస్నానం చేయిస్తుంటుంది వేద.
సుధ కొడుక్కి మొన్ననే అన్నప్రాసన చేశారు. వాడికి ఉగ్గు తినిపించే క్రమంలో అది కాస్తా కింద పడిపోవడం, డ్రస్‌పై పడడంతో సగం వృథాగా పోతుంది. ఇలా జరగకుండా తన చిన్నారికి సులభంగా ఉగ్గు తినిపించే మార్గమే లేదా? అని ఆలోచిస్తోంది సుధ.
కొత్తగా తల్లైన మహిళలకు తమ చిన్నారులతో ఇలాంటి అనుభవాలు కామనే. ఇంట్లో పెద్ద వాళ్లుంటే ఇలాంటి సమస్యలకు సంబంధించిన పరిష్కార మార్గాలు వాళ్లే సూచిస్తారు. కానీ ఆ అవకాశం లేని తల్లులకు మాత్రం చిన్నారుల ఆలనా పాలనా కత్తి మీద సామే అని చెప్పాలి. అయితే ఇకపై అంత కష్ట పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పిల్లలకు లాలపోసే దగ్గర్నుంచి వారి కడుపు నింపేదాకా.. ప్రతి పనినీ సులభం చేయడానికి బోలెడన్ని గ్యాడ్జెట్లు మార్కెట్లో అందుబాటులోకొచ్చేశాయి. మరి, అలాంటి కొన్ని బేబీ గ్యాడ్జెట్ల గురించి మనమూ తెలుసుకుందాం రండి..
బేబీ షవర్ క్యాప్
పసి పిల్లలకు తలస్నానం చేయించాలంటే తల్లులకు కత్తి మీద సామే. వాళ్లను ఒక దగ్గర కూర్చోబెడితే అస్సలు కూర్చోరు. మాటిమాటికీ లేచి నిల్చోవడం, ఆ పక్కనున్న బకెట్లోకి తొంగి చూడడం.. వంటివి చేస్తారు. పైగా తలపై నుంచి పోసే నీళ్లు, జుట్టుకు పెట్టే షాంపూ ఎక్కడ తమ పిల్లల నోట్లోకి, ముక్కులోకి, చెవుల్లోకి వెళ్తాయోనని తల్లులకు బెంగ. మరి, ఇకపై అలా జరగకుండా బుజ్జాయిలకు సులభంగా తలస్నానం చేయించాలంటే ‘బేబీ షవర్ క్యాప్’ కొనాల్సిందే!

ఫొటోలో చూపించినట్లుగా పైభాగం ఓపెన్‌గా ఉండే క్యాప్‌లా.. చుట్టూ కాస్త వెడల్పుగా ఉండి.. చెవులు కవరయ్యేలా హెడ్‌సెట్‌లా ఉంటుందిది. దీనికి వెనుక వైపు ఉన్న బటన్స్ సహాయంతో పిల్లల తలకు ఎడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది అమర్చాక పిల్లలకు తలస్నానం చేయిస్తే.. నీళ్లు, షాంపూ వారి కళ్లలోకి, ముక్కులోకి, చెవుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తపడచ్చు. దీని నాణ్యతను బట్టి ధర రూ. 99 నుంచి రూ. 219 వరకు ఉంది.
బాటిల్ ఫీడర్
పిల్లలకు ఘనాహారం అలవాటు చేసే క్రమంలో తల్లులు కిందా మీదా పడుతుంటారు. వారు తినకపోవడం, మొహం తిప్పడం.. వల్ల ఆ పదార్థం కాస్తా కింద పడిపోవడం, వాళ్ల డ్రస్‌పై పడడం, తల్లి చేతికి అంటుకోవడం.. ఇలా చిందర వందరగా తయారవుతుంది. మరి, అలా జరగకుండా పిల్లలకు సులభంగా ఉగ్గు తినిపించాలంటే..? అందుకు ‘బాటిల్ ఫీడర్’ చక్కటి ఎంపిక.

ఫొటోలో చూపించినట్లుగా అచ్చం ఫీడింగ్ బాటిల్లా ఉంటుందిది. కాకపోతే ముందు భాగంలో నిపుల్కి బదులుగా స్పూన్ అమరి ఉంటుంది. ఇప్పుడు మీరు తయారుచేసిన ఉగ్గు లేదా ఇతర పదార్థాన్ని ఆ బాటిల్లో పోయాలి. అయితే ఈ పదార్థం మరీ గట్టిగా ఉండకుండా జాగ్రత్తపడాలి. ఇలా పదార్థం నింపిన బాటిల్‌ని మూత పెట్టి.. నెమ్మదిగా ఒత్తుతూ స్పూన్‌తో పిల్లలకు తినిపించాలి. ఈ బాటిల్ ఫీడర్ వల్ల పదార్థం కింద పడకుండా, బేబీ డ్రస్‌పై పడకుండా ఉంటుంది. అలాగే పని పూర్తయ్యాక లేదంటే బాటిల్లో పదార్థం మిగిలినా సరే.. బాటిల్‌పై మూత పెట్టేస్తే సరి.. కొన్ని ఫీడింగ్ బాటిల్స్‌కి స్పూన్ని మూసేసే అమరిక కూడా ఉంటుంది. ఈ ఫీడర్ నాణ్యతను బట్టి ధర రూ. 299 నుంచి రూ. 499 వరకు ఉంటుంది.
బేబీ చైర్ సీట్

పిల్లలకు కూర్చోవడం అలవాటు చేసే క్రమంలో తల్లులు భయపడుతుంటారు. ఎందుకంటే బ్యాలన్స్ ఆగక వాళ్లు ఎక్కడ వెనక్కి పడిపోతుంటారోనని వారి భయం. అయితే ‘బేబీ చైర్ సీట్’ ఉంటే ఇకపై ఆ భయం అక్కర్లేదు. ఫొటోలో చూపించినట్లుగా వెనక్కి ఒరగడానికి, కాళ్లు ముందుకి పెట్టుకోవడానికి వీలుగా కుర్చీలా ఉంటుందిది. చిన్నారిని కూర్చోబెట్టాలనుకున్నప్పుడు దీన్ని ఉపయోగిస్తే సరి. తల్లులకు ఎంతో సులభంగా, పిల్లలకు సౌకర్యవంతంగా ఉండే ఈ బేబీ చైర్స్ ప్రస్తుతం మార్కెట్లో విభిన్న డిజైన్లలో లభ్యమవుతున్నాయి. వాటి నాణ్యత, డిజైన్‌ను బట్టి ధర రూ. 591 నుంచి రూ. 1,048 వరకు ఉంది.
క్రాలింగ్ ప్యాడ్స్

పాకడం.. అప్పుడప్పుడే నేర్చుకుంటున్న పిల్లల మోచేతులు, మోకాళ్లు కమిలిపోయి నల్లగా మారడం మనం చూసే ఉంటాం. అంతేకాదు.. ఈ క్రమంలో వారు గబగబా పాకుతుంటే ఆ పక్కనే ఉండే వస్తువుల వల్ల వారికి గాయాలు కూడా అవుతుంటాయి. మరి, అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? సింపుల్.. ‘క్రాలింగ్ ప్యాడ్స్’ కొనేసుకుంటే సరి.

ఫొటోలో చూపించినట్లుగా అచ్చం సాక్సుల్లా ఉంటాయివి. మెత్తటి వస్త్రంతో, సాగేలా తయారుచేసిన వీటిని పాపాయి చేతులకు, కాళ్లకు తొడిగి.. మోచేతులు, మోకాళ్ల దగ్గర ఎడ్జస్ట్ చేస్తే సరి. తద్వారా పిల్లల చర్మానికి ఎలాంటి హానీ కలగదు.. ఒకవేళ గబుక్కున మోకాళ్లపై పడినా దెబ్బతగలకుండా ఉంటుంది. ఈ క్రాలింగ్ ప్యాడ్స్‌తో పాటు బేబీ మాప్ సూట్స్ కూడా ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి. వీటి నాణ్యత, డిజైన్, ప్యాక్‌లో వచ్చే ప్యాడ్స్ సంఖ్యను బట్టి ధర రూ. 179 నుంచి రూ. 399 వరకు ఉంది.
బేబీ హెల్మెట్
పిల్లలకు నడక వచ్చిందంటే అస్సలు ఆగరు.. మన మాట వినకుండా పరిగెట్టడమే పనిగా పెట్టుకుంటారు. తద్వారా గోడ అంచులు, ఇతర వస్తువులు తలకు తాకే ప్రమాదం ఉంది.. ఒక్కోసారి జారిపడిపోయి తలకు దెబ్బ తగులుతుంటుంది. ఇలాంటి ప్రమాదాలు జరిగినా పిల్లల తలకు దెబ్బ తగలకుండా ఉండాలంటే అందుకు ‘బేబీ హెల్మెట్’ ఉండాల్సిందే!
ఫొటోలో చూపించినట్లుగా అచ్చం మనం పెట్టుకునే హెల్మెట్‌లా ఉంటుందిది. అయితే అంత బరువుగా ఉండకుండా చాలా తేలిగ్గా, మృదువుగా ఉండే మెటీరియల్‌తో దీన్ని తయారుచేస్తారు. దీన్ని తలపై అమర్చడం వల్ల వారికి తలపై ఏదో ఉన్నట్లుగా కూడా అనిపించనంత తేలిగ్గా ఉంటుందిది. చిన్నారుల తలకు దెబ్బతగలకుండా రక్షణ కల్పించే ఈ బేబీ హెల్మెట్స్ ప్రస్తుతం మార్కెట్లో బోలెడన్ని డిజైన్లలో లభ్యమవుతున్నాయి. వాటి డిజైన్, నాణ్యతను బట్టి ధర రూ. 499 నుంచి రూ. 899 వరకు ఉంది.
గమనిక: చిన్నారుల పెంపకం విషయంలో తల్లుల పనిని సులభతరం చేసే కొన్ని అధునాతన గ్యాడ్జెట్లేంటో తెలుసుకున్నారుగా! అయితే ఇవి ఉపయోగించే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు.. పిల్లల్నీ నిర్లక్ష్యం చేయకుండా అనుక్షణం ఓ కంట కనిపెడుతూనే ఉండాలన్న విషయం తల్లులందరూ గుర్తుపెట్టుకోండి..!
Photos: Amazon.in