లాక్డౌన్ 4.0లో కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ ఇంకా కొంతమంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. అయితే పాఠశాలలు, కళాశాలలు ఇంకా తెరచుకోకపోవడంతో పిల్లలందరూ ఇంట్లోనే గడుపుతున్నారు. కొంతమంది మాత్రం ఆన్లైన్ క్లాసులకు అటెండవుతున్నారు. మొత్తం మీద లాక్‌డౌన్‌తో చాలామంది పిల్లలు టీవీలు, కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్ల బాట పట్టారు. ఆన్లైన్ గేమ్స్, వీడియో గేమ్స్, యూట్యూబ్.. అంటూ విచ్చలవిడిగా ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. అయితే అంతర్జాల వాడకానికి సంబంధించి పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అవరసమని సూచిస్తోంది నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ. లేకపోతే సైబర్ నేరగాళ్ల నుంచి లైంగిక వేధింపులు, ఇతర సమస్యలు తప్పవని ఆ ఏజెన్సీకి చెందిన ‘ది కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా(సెర్ట్-ఇన్)’ విభాగం హెచ్చరించింది. అదేవిధంగా పిల్లలు ఇంటర్నెట్ వాడుతున్నప్పుడు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోకుండా ఉండేందుకు కొన్ని కీలకమైన మార్గదర్శకాలు జారీ చేసింది.
సైబర్ నేరాలు పెరుగుతున్నాయ్!
లాక్డౌన్ కారణంగా పెద్దలతో పాటు పిల్లలూ భారీగా ఇంటర్నెట్ను వాడుతున్నారు. కార్యాలయాలు మూతపడడంతో ఇప్పటికీ చాలామంది ఉద్యోగులు ‘వర్క్ ఫ్రం హోమ్’ అంటూ ఇంటిపట్టునే ఉండి విధులు నిర్వహిస్తున్నారు. పిల్లలు ఆన్లైన్ పాఠాలు, కోర్సులంటూ పెద్ద ఎత్తున ఇంటర్నెట్ను ఆశ్రయిస్తున్నారు. గంటల తరబడి కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌లు, స్మార్ట్ ఫోన్లతోనే గడిపేస్తున్నారు. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు పలు నేరాలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలో పిల్లలు - స్మార్ట్ఫోన్ల వినియోగానికి సంబంధించి నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ పలు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.

అలాంటి వాటిని బ్లాక్ చేయండి!
* ఇంటర్నెట్కు సంబంధించి కొన్ని అప్లికేషన్లు, వెబ్సైట్లను యాక్సెస్ చేసుకోవాలంటే వ్యక్తిగత సమాచారం కావాలని అడుగుతుంటాయి. పిల్లలను అలాంటి వెబ్సైట్లకు దూరంగా ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లో నూ వ్యక్తిగత సమాచారం అందులో పొందుపరచవద్దని పిల్లలకు సూచించాలి.
* ఇంటర్నెట్ వాడుతున్నప్పుడు సాధారణంగా రకరకాల వెబ్‌సైట్స్ లింక్స్ ప్రత్యక్షమవుతుంటాయి. అందులో కొన్ని అభ్యంతరకరమైనవి కూడా ఉండచ్చు. ఇలాంటి సైట్లను పిల్లలు ఓపెన్ చేయకుండా తల్లిదండ్రులు తగిన సూచనలివ్వాలి. వీలైతే వారికి ఉపయోగకరమైన కొన్ని వెబ్సైట్లు మాత్రమే ఓపెనయ్యేలా సెట్టింగ్స్ మార్చాలి.
* ఇక ఇంటర్నెట్లో కనిపించే పాపప్స్, స్పామ్ మెసెజ్‌లు, మాల్వేర్లకు స్పందించవద్దని పిల్లలకు చెప్పాలి. యాంటీ వైరస్‌ను ఇన్స్టాల్ చేసి తరచుగా కనిపించే ఇలాంటి మెసేజ్‌లను, అప్లికేషన్లను బ్లాక్ చేయండి.
* ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్టాగ్రామ్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లను వినియోగించడంపై పిల్లలకు పూర్తిగా అవగాహన పెంచాలి. ప్రధానంగా వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు షేర్ చేయడం వల్ల కలిగే పరిణామాలేంటో పిల్లలకు అర్థమయ్యేలా వివరించండి.

* ఇక యూట్యూబ్ వినియోగానికి సంబంధించి కూడా పిల్లలపై పర్యవేక్షణ అవసరం. ఈక్రమంలో ఏవైనా అభ్యంతరకరమైన వెబ్సైట్లు వారు చూసినట్లు తెలిస్తే.. వాటిని ఇంకెప్పుడూ చూడద్దని సున్నితంగా, అర్థమయ్యేలా వివరించాలి. అలాంటివి చూడడం వల్ల ఎదురయ్యే నష్టాల్ని కూడా వారికి చెప్పాలి. అలాగే అలాంటి వెబ్సైట్లను బ్లాక్ చేయాలి.
* ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా వచ్చే లింక్స్‌ను ఓపెన్ చేసే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
* ఆన్లైన్ ఛాటింగ్‌కు సంబంధించి పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారో కనిపెట్టుకుని ఉండాలి.
* మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్, యాప్స్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండాలి. అధికారిక యాప్ స్టోర్ నుంచే యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.
* అవసరం లేని, ఉపయోగించని అప్లికేషన్లను అన్ ఇన్స్టాల్ చేయాలి.
* కొన్ని అప్లికేషన్లు పాస్వర్డ్స్ సేవ్ చేసుకోవాలని కోరుతుంటాయి. అలా చేయడం సురక్షితం కాదని పిల్లలకు చెప్పాలి.
చూశారుగా.. పిల్లలు అంతర్జాలం వినియోగించే క్రమంలో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో! మరి, ఈ విషయాల్లో మీరూ అప్రమత్తంగా ఉండి.. ఇంటర్నెట్ వినియోగానికి సంబంధించి చిన్నారుల్లో అవగాహన పెంచండి..!