స్వచ్ఛమైన మనసు, అమాయకత్వం చిన్నారుల సొంతం. అందుకే పిల్లలు మాట్లాడుతుంటే ఎంతో ముద్దుగా ఉంటుంది. ఇక నిష్కల్మషమైన పసిపిల్లల బోసి నవ్వు ఎలాంటి బాధనైనా ఇట్టే మరిపిస్తుంది. ప్రస్తుతం కరోనా ప్రభావంతో అందరి మోముపై చిరునవ్వు మాయమైపోయింది. ఈ పరిస్థితుల్లో ఓ బుడ్డోడు పగలబడి నవ్వుతూ అందర్నీ నవ్విస్తున్నాడు. కిలకిలా నవ్వుతూ కరోనా భయాన్ని మరిచిపోయేలా చేస్తున్నాడు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ లాంటి ప్రముఖులు సైతం ఆ పిల్లాడి బోసి నవ్వుకు ఫిదా అవుతున్నారు. మరి ఆ నవ్వు వెనక ఉన్న అసలు కథే ఏంటో చూద్దాం రండి...

తుమ్మినట్లు నటిస్తూ !
పిల్లల సంతోషం కంటే తల్లిదండ్రులకు ఏదీ ఎక్కువ కాదు. వారి మోములో నవ్వు చూడడానికి ఏం చేయడానికైనా సిద్ధపడతారు. ఇక కరోనా ప్రభావంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయంలోనూ పిల్లలను జాలీగా ఉంచడానికి వారి తల్లిదండ్రులు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తు్న్నారు. ఇందులో భాగంగా ఇటీవల కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఇంట్లోనే రెస్టరంట్లు, సినిమా హాల్స్, రోలర్ కోస్టర్ మొదలైనవి ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మిసిసిపీకి చెందిన ఓ మహిళ తన తుమ్ములతో పిల్లాడిని నవ్వించింది. కరోనా కాలంలో తుమ్ములతో ఆటలేంటి? అనుకుంటున్నారా? అయితే అవి నిజమైన తుమ్ములు కాదండోయ్. తన చిన్నారిని తనివితీరా నవ్వించేందుకు తుమ్మినట్లు నటించింది. అంతే...!
సరదాగా నవ్వేయండి!
ప్రస్తుతం వైరలవుతున్న ఈ వీడియోలో ఓ తల్లి తన బాబుకి అన్నం తినిపిస్తుంటుంది. ఈ సమయంలో ఆమె ఒక్కసారిగా తుమ్మినట్లు నటిస్తుంది. దీంతో ఆ పిల్లాడు పగలబడి నవ్వుతాడు. ఎప్పుడైతే ఆ బుడ్డోడు నవ్వు ఆపడం మానేస్తాడో మళ్లీ ఆ తల్లి తుమ్ములు వచ్చినట్లు నటిస్తుంది. ఈక్రమంలో తన కుమారుడి మోములో బోసి నవ్వులు చూస్తూ ఆనందంతో ఆ తల్లి కళ్లల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్ట్లు పెట్టే అమితాబ్...తాజాగా ఈ చిన్నారికి సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకున్నారు. ‘ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో చిన్న మార్పు కోసం ఓ సారి ఈ వీడియో సరదాగా నవ్వేయండి’ అంటూ షేర్ చేసిన ఈ 55 సెకన్ల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ వీడియో ఇప్పటివరకు సుమారు 12 లక్షల వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం. మరి కరోనా తెచ్చిన కష్టాల నుంచి కాస్త ఉపశమనం కలిగించేలా ఉన్న ఈ పిల్లాడి నవ్వును మీరు కూడా చూసి ఆస్వాదించండి.