అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుటుంబ సమేతంగా ఇటీవలే భారత పర్యటనకు వచ్చి వెళ్లిన విషయం తెలిసిందే. వీళ్లు దిల్లీలో పర్యటించిన ఆ రెండురోజులూ అక్కడే కాదు.. దేశమంతా సందడి నెలకొంది. అయితే ఈ పర్యటనలో భాగంగా రెండో రోజు ట్రంప్ సతీమణి, అమెరికా ప్రథమ మహిళ.. మెలానియా ట్రంప్ దిల్లీ మోతీబాగ్‌లోని సర్వోదయ పాఠశాలను సందర్శించారు. అక్కడి విద్యార్థులు ఆమెను సంప్రదాయబద్ధంగా, ఎంతో ఆత్మీయంగా స్వాగతించారు. ఆపై అక్కడి విద్యార్థులు చేసిన నృత్యాలు, పాఠశాలలో నిర్వహించే ‘హ్యాపీనెస్ కరిక్యులం’ క్లాసులు ఆమెను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో భారత పర్యటన తనకెన్నో మధురానుభూతుల్ని మిగిల్చిందని, ముఖ్యంగా సర్వోదయ పాఠశాలలోని విద్యార్థులు, అక్కడి హ్యాపీనెస్ తరగతులు తనలో ఎంతగానో స్ఫూర్తి నింపాయని అమెరికాకు వెళ్లాక ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు మెలానియా. అంతేకాదు.. ఈ క్రమంలో ఆమె ఆనందాన్ని ఇలా పంచుకున్నారు.

దిల్లీలోని సర్వోదయ పాఠశాలను ఉద్దేశిస్తూ..
దిల్లీలోని సర్వోదయ పాఠశాలను సందర్శించిన మెలానియా.. ఈ క్రమంలో తనకెదురైన అనుభవాలు, అనుభూతులను ట్వీట్ల రూపంలో ఇలా పంచుకున్నారు. అక్కడి చిన్నారులతో కలిసి దిగిన ఫొటోలను కొలేజ్ చేసి ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ ప్రథమ మహిళ వరుసగా చేసిన ట్వీట్స్ ఇలా ఉన్నాయి.
‘దిల్లీలోని సర్వోదయ పాఠశాలలో నిర్వహించిన ‘రీడింగ్ క్లాస్‌రూం’, ‘హ్యాపీనెస్ కరిక్యులం’ కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకం. ‘బీ బెస్ట్’ కార్యక్రమంలోని సూత్రాలు అమెరికాకే పరిమితం కాకుండా ప్రపంచమంతటా విస్తరించడం ఎంతో సంతోషకరం..’
‘సంప్రదాయ పద్ధతిలో నాకు బొట్టు పెట్టి, హారతిచ్చి స్వాగతించినందుకు సర్వోదయ పాఠశాలకు ధన్యవాదాలు..’
‘దిల్లీలోని సర్వోదయ పాఠశాలలో గడిపిన ఆ మధ్యాహ్నం నేనెప్పటికీ మర్చిపోలేను! అక్కడి విద్యార్థులు, అధ్యాపకులతో సమయం గడపడం నాకెంతో గొప్పగా అనిపిస్తోంది. ఇంత ఆత్మీయంగా నన్ను స్వాగతించినందుకు మీకు నా ధన్యవాదాలు..!’
అంతేకాదు.. తమ మొదటి రోజు పర్యటనలో భాగంగా ట్రంప్, మెలానియాలు దిల్లీలోని చారిత్రక కట్టడమైన తాజ్‌మహల్‌ను సందర్శించారు. ఈ క్రమంలో తన మనసులో కలిగిన భావాల్ని కూడా ట్వీట్ రూపంలో పంచుకున్నారీ ఫస్ట్ లేడీ. తాజ్ సందర్శనలో ట్రంప్-మెలానియా చేతిలో చేయి వేసి, ఆ చారిత్రక ప్రదేశమంతటా కలియదిరుగుతూ.. తాజ్ విశేషాలను అక్కడి గైడ్‌ను అడిగి తెలుసుకుంటూ.. ఇలా వారు తాజ్ అందాలను ఆస్వాదిస్తున్నప్పుడు తీసిన వీడియోను ట్విట్టర్లో పంచుకున్న మెలానియా.. ‘ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్ ఎంతో అద్భుతంగా ఉంది! అలాంటి కట్టడాన్ని వీక్షించడం ఓ మధురానుభూతి..’ అంటూ రాసుకొచ్చారు మిసెస్ ట్రంప్.
మెలానియా సర్వోదయ స్కూల్ విజిట్‌లో భాగంగా ప్రసంగించినప్పుడు, తాజాగా తాను చేసిన ట్వీట్లను ఒకసారి పరిశీలిస్తే.. ‘బీ బెస్ట్’ అనే మాట పదే పదే వినిపించడం, కనిపించడం మనం గమనించచ్చు. ఇంతకీ ‘బీ బెస్ట్’ అంటే ఏంటంటే.. తాను అమెరికాలో నిర్వహిస్తోన్న ఓ ప్రచార కార్యక్రమం.
అసలేంటీ ‘బీ బెస్ట్’..?

సామాజిక పరంగా, వ్యక్తిత్వపరంగా ఉన్నతంగా ఎదిగి, ఉత్తమమైన మార్గంలో నడవడానికి ఉపయోగపడే వివిధ అంశాల్లో చిన్నారులకు అవగాహన కల్పించేదే ఈ ‘బీ బెస్ట్’ అవేర్నెస్ క్యాంపెయిన్. ఈ క్యాంపెయిన్‌ను అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ 2018, మే 7న ప్రారంభించారు. ఈ క్యాంపెయిన్‌లో చిన్నారులకు సామాజికంగా, శారీరకంగా, మానసికంగా ఎలా ఎదగాలో నేర్పిస్తుంటారు. ‘బీ బెస్ట్’ ముఖ్య ఉద్దేశాలివే!
* చిన్నారుల సంరక్షణ * ఆన్లైన్ భద్రత * మాదక ద్రవ్యాల వల్ల ఎదురయ్యే ప్రమాదాల గురించి పిల్లలకు అవగాహన కల్పించడం.

చిన్నారుల సంరక్షణ ఇందులో భాగంగా పెద్దలు-గురువులను ఎలా గౌరవించాలి?, సామాజిక విలువలు, ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాల్లో చిన్నారులకు శిక్షణనిస్తారు. ఫలితంగా పిల్లలు సమాజంలో ఉన్నత వ్యక్తిగా ఎదిగేందుకు ఇవి దోహదం చేస్తాయి. అంతేకాదు.. ఆరోగ్యంగా జీవించడం ఎంత ముఖ్యమో తెలుసుకొని పిల్లలు చిన్నతనం నుంచే మంచి ఆహారపుటలవాట్లను అవవరుచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆన్లైన్ భద్రత ఆన్లైన్ భద్రతలో భాగంగా సోషల్ మీడియాను వాడే పద్ధతుల గురించి వివరిస్తూ.. దాన్ని చెడుగా కాకుండా మంచి ప్రయోజనాలకు ఎలా ఉపయోగించాలో పిల్లలకు అవగాహన కల్పిస్తారు.
 మాదక ద్రవ్యాల వల్ల ఎదురయ్యే ప్రమాదాలు.. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి బానిసలుగా మారకుండా ఉండడానికి దానివల్ల కలిగే దుష్ప్రభావాల గురించి పిల్లల్లో అవగాహన కల్పిస్తారు. దీనితో పాటు.. మాదక ద్రవ్యాలకు బానిసలైన, హింసకు గురైన పిల్లలకు, వారి కుటుంబాలకు సహాయం చేస్తూ.. వారి తల్లిదండ్రులకు సైతం అవగాహన కల్పిస్తారు. ఈ మూడు ముఖ్యమైన ఉద్దేశాలతో ప్రారంభమైన ఈ ‘బీ బెస్ట్’ క్యాంపెయిన్ వల్ల పిల్లలు సన్మార్గంలో ముందుకు సాగుతూ.. ఉత్తమమైన జీవితాన్ని గడపడం నేర్చుకుంటారు. ఈ క్యాంపెయిన్‌కు సంబంధించిన విశేషాలను తరచూ సోషల్ మీడియాలో మెలానియా పంచుకుంటూనే ఉంటారు.
|