జుట్టును కర్లీగా మార్చుకోవడానికి చాలామంది అమ్మాయిలు బ్యూటీపార్లర్లను ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలో బోలెడంత ఖర్చుపెట్టడానికీ వెనకాడరు. ఇలా కర్లీగా మార్చుకున్న జుట్టును చూస్తే ‘అబ్బ.. మన జుట్టును కూడా అలా కర్లీగా మార్చేసుకుంటే ఎంత బాగుంటుందో..’ అనుకోవడం సహజమే. ఇక ఈ విషయంలో స్కూలుకెళ్లే పిల్లలు తమకు విభిన్నమైన హెయిర్‌స్టైల్స్ కావాలంటూ తమ తల్లుల దగ్గర మారాం చేస్తుంటారు కూడా! ఇలా అతివల అవసరాలకు తగినట్లుగానే ప్రస్తుతం బోలెడన్ని బ్యూటీ గ్యాడ్జెట్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. కానీ అలాంటి వాటితో పనిలేకుండా కేవలం ఇంట్లో దొరికే సాక్సులతోనే తన కూతురి జుట్టుని కర్లీగా మార్చింది ఐర్లాండ్‌కు చెందిన ఓ మహిళ. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఆ కర్లీ ట్రిక్ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..

అలా వచ్చిందీ ఐడియా!
ఐర్లాండ్‌లోని న్యూటౌనాడ్స్లో నివాసముంటోంది లిన్సే క్లీల్యాండ్ అనే మహిళ. ఇద్దరు పిల్లల తల్లైన ఆమె స్వతహాగా హెయిర్ స్టైలిస్ట్. అక్కడే ‘హెయిర్ & కో’ పేరుతో ఓ హెయిర్ డ్రస్సింగ్ షాష్ని కూడా నిర్వహిస్తోంది లిన్సే. తన దగ్గరకు వచ్చే క్లయింట్స్ సలహాతో అందరికీ ఉపయోగపడేలా హెయిర్ ట్యుటోరియల్ వీడియోలు చేయాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా మొదట పిల్లలకు సంబంధించిన రకరకాల హెయిర్‌స్టైల్స్‌ని ఎంత ఈజీగా వేసేసుకోవచ్చో అనే అంశంపై వీడియోలు చేయాలనుకుంది. అనుకున్నదే తడవుగా తన ఆరేళ్ల కూతురి జుట్టును సాక్సుల సహాయంతో కర్లీగా మార్చేసి.. దాన్ని వీడియోగా రూపొందించి సోషల్ మీడియాలో ఉంచింది. ప్రస్తుతం ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.
సాక్సుతో కర్లీ హెయిర్ ఇలా!
లిన్సే తన కూతురి జుట్టును కర్లీగా మార్చడానికి కేవలం సాక్స్, నీళ్లను మాత్రమే ఉపయోగించింది. ఈ క్రమంలో స్టెప్ బై స్టెప్ వివరిస్తూ దాన్ని వీడియోగా రూపొందించిందీ బ్రిలియంట్ మామ్. * ముందుగా తన కూతురి జుట్టును నాలుగు పాయలుగా విడదీసి.. విడివిడిగా రబ్బర్ బ్యాండ్స్ వేసేసింది లిన్సే.
* ఇప్పుడు ఒక్కో పాయపై నీళ్లను స్ప్రే చేస్తూ చిక్కులు లేకుండా దువ్వింది.
 * ఆ తర్వాత ఓ సాక్స్‌ని తీసుకుని జుట్టును చివరి నుంచి పై వరకు దానికి చుట్టుకుంటూ కుదుళ్ల దాకా తీసుకొచ్చి సాక్స్ రెండు చివర్లను ముడివేసింది. * మిగిలిన మూడు పాయలను కూడా ఇదే పద్ధతిలో సాక్సుతో చుట్టేసింది. రాత్రంతా ఇలాగే ఉంచుకొని ఉదయాన్నే ఒక్కో సాక్సు విప్పుతుంటే జుట్టు అలల్లా మారింది. ఇలా ఇంట్లోనే అది కూడా సాక్సులతో జుట్టును ఈజీగా కర్ల్స్ చేసుకోవచ్చని చెబుతూ రూపొందించిన ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది లిన్సే. అంతే.. జుట్టును కర్ల్స్ చేసుకోవడం ఇంత ఈజీనా అంటూ నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారంటే నమ్మండి.
|
ఆ సాక్సులు మాకు కావాలి!
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతూ ఈ ఐరిష్ మామ్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఈ క్రమంలో కొందరు ‘మాకు ఈ సాక్స్‌లు అమ్ముతారా?’ అని అడుగుతుంటే.. ‘జుట్టును కర్ల్ చేయడానికి మీరు వాడింది నీళ్లా లేక స్పెషల్ హెయిర్ స్ప్రేనా’ అంటూ మరికొందరు తమ మదిలో మెదిలిన సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా నెటిజన్ల సందేహాలకు స్పందించిన లిన్సే ‘ఇవి మామూలు సాక్సులే.. ప్రత్యేకమైనవేం కాదు’.. ‘నేను స్ప్రే చేసింది కేవలం నీళ్లే.. హెయిర్ స్ప్రే కాదు..’ అంటూ తన ట్రిక్ గురించి చెప్పుకొచ్చిందీ లవ్లీ మామ్.
ఎటువంటి పార్లర్లు.. గ్యాడ్జెట్లు అవసరం లేకుండానే సహజ పద్ధతిలోనే జుట్టును ఎంతో సులభంగా కర్లీగా మార్చుకునే ఈ ట్రిక్ చాలా బాగుంది కదూ.. మరి మీరూ ఓసారి ట్రై చేయండి.