అజ్ఞానానికి సంకేతం... అనర్థాలకు మూలం చీకటి. కంటికి వెలుగు కనబడకపోవడమే చీకటి కాదు. మస్తిష్కం విచక్షణా జ్ఞానాన్ని కోల్పోవడం కూడా చీకటే ! ఈ చీకటే ప్రపంచంలోని చాలా అనర్థాలకు... ముఖ్యంగా ఆడవారిపై జరిగే అఘాయిత్యాలకు కారణంగా నిలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా దిశ వంటి ఎందరో స్త్రీల జీవితాలను ఈ చీకటి తన అజ్ఞానాంధకార గుప్పిట్లో బంధిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇటీవల ఈ చీకటి మరింత వ్యాప్తి చెందుతుండడంతో సమాజంలోని బాహ్య చీకటిని, మనిషిలోని అంత: చీకటిని తొలగించేందుకు కంకణం కట్టుకున్నాయి కొన్ని ప్రభుత్వాలు. అందులో ముందుంటోంది దిల్లీ ప్రభుత్వం. ఇందుకు నిదర్శనమే దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బాలురతో చేయించిన ఈ ప్రతిజ్ఞ.

స్త్రీ భయపడని ప్రాంతం కావాలి !
‘‘నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను... ఎల్లప్పుడూ స్త్రీలందర్నీ గౌరవిస్తానని... ఎప్పుడూ ఏ స్త్రీతో అనుచితంగా ప్రవర్తించనని.. ఏ స్త్రీపైనా అఘాయిత్యానికి పాల్పడనని... ఎవరైనా స్త్రీ ఆపదలో ఉంటే నా పూర్తి శక్తి మేరకు ఆమెకు రక్షణగా ఉంటానని.. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను’’. ఇది స్త్రీల రక్షణ కోసం దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన సమక్షంలో బాలుర చేత చేయించిన ప్రతిజ్ఞ సారాంశం. స్త్రీ రాత్రి పూట అడుగుపెట్టేందుకు భయపడని ప్రాంతంగా దిల్లీని తీర్చిదిద్దుతానని గతంలోనే సంకల్పించిన కేజ్రీవాల్ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించి, రాష్ట్రంలోని మిగతా స్కూళ్ల విద్యార్థులతో కూడా టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రతిజ్ఞ చేయించారు. అంతేకాదు బాలికలు ఇంటికి వెళ్లిన తర్వాత ఈ ప్రతిజ్ఞ గురించి తల్లిదండ్రులతో చర్చించి తమ సోదరులతో కూడా ఈ విధంగా ప్రతిజ్ఞ చేయించమని కోరారు. ఇక ముఖాముఖిలో భాగంగా అసలు ఇటువంటి నేరాలు ఎందుకు జరుగుతున్నాయో చెప్పగలరా అని విద్యార్థులను అడిగారు. అందుకు అద్భుతమైన సమాధానాలు ఇచ్చారు విద్యార్థులు.

మా కుటుంబాల నుంచే మొదలుపెట్టాలి !
‘‘మనం మన ఆలోచనాధోరణిని మార్చుకోవాలంటే ముందు మన కుటుంబం నుంచే మార్పు మొదలవ్వాలి. చాలా కుటుంబాల్లో కూతురి కంటే కొడుకే బెటర్ అని ఆలోచిస్తుంటారు. అందుకు తగ్గట్లే పిల్లల్ని పెంచుతుంటారు. అలా కాకుండా ఆడపిల్లలకు, మగపిల్లలకు సమ ప్రాధాన్యాన్ని ఇవ్వాలి’’ కేజ్రీవాల్ అడిగిన ప్రశ్నకు ఓ విద్యార్థిని ఇచ్చిన సమాధానం ఇది.
‘‘మన టీనేజర్లు, తల్లిదండ్రులు, పెద్దల మధ్య జనరేషన్ గ్యాప్ ఉంది. మాలాంటి వారు స్వేచ్ఛగా ప్రతిదీ వారితో షేర్ చేసుకోలేకపోతున్నాం. ఇటువంటి నేరాలు జరిగినప్పుడు ఇంట్లో చర్చ జరగాలి. మంచేదో చెడేదో మా వయసు వారికి నేర్పించాలి. ప్రస్తుత సమాజంలో చాలామంది పెద్దవారు పెద్ద హోదాలో ఉండీ తప్పుడు పనులు చేస్తున్నారు. వారు విద్యావంతులే అయినప్పటికీ అలా చేస్తుండడాన్ని మనం మార్చలేకపోతున్నాం. అందుకు కారణం... ఎదిగే సమయంలో వారికి సరైన జ్ఞానం లభించలేదు.’’ అని మరో విద్యార్థిని ప్రస్తుత సమాజం గురించి చాలా చక్కగా చెప్పింది.

ఇక ఒక బాలుడైతే..‘‘చాలామంది స్త్రీలు తమపై దుర్ఘటన జరిగిన తర్వాత పోలీసులను ఆశ్రయించేందుకు భయపడుతున్నారు. వారికి ఆ సమయంలో ధైర్యం చెప్పేవారు ఉండడం లేదు’’ అన్నాడు. ఇలా చాలామంది పిల్లలు పిన్న వయస్కులే అయినా... నేడు సమాజంలో జరుగుతున్న నేరాలకు కుటుంబంలోని లోపాలను ఎత్తి చూపడంతో పాటు చట్ట, న్యాయ వ్యవస్థలను మరింత పటిష్టపరచాలని తమ మనసులోని భావాలను తెలియజేశారు.
చీకటి లేని వీధుల కోసం !
పిల్లలిచ్చిన సమాధానాలకు ‘వెరీగుడ్’ అని మెచ్చుకున్న కేజ్రీవాల్ స్త్రీల రక్షణకు తానేం చేస్తున్నారో తెలిపారు. ఇప్పటికే దిల్లీలోని పలు అసురక్షిత ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేసినట్లు తెలిపారు. ఈక్రమంలోనే ఏ నేరగాడు చీకటి పొరల్లోంచి తప్పించుకోకుండా గతంలో ఏర్పాటు చేసిన 1,40,000 సీసీ కెమెరాలకు తోడు మరో 1,40,000 సీసీ కెమెరాలను అనేక వీధుల్లో ఏర్పాటు చేయించనున్నట్లు తెలిపారు. ఇక రాత్రి సమయంలో రోడ్ల వెంబడి చీకటి అనేది కనిపించకుండా 2,10,000 స్ట్రీట్ లైట్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే స్త్రీల రక్షణకు ఇంతకంటే గొప్పగా చేయాల్సింది మరొకటి ఉందని ఆయన అన్నారు.
‘‘మనిషి ఆలోచనాధోరణిలో మార్పు రానంత కాలం చట్టం, న్యాయం స్త్రీల రక్షణ కోసం చేసేదేదీ సరిపోదు. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వారి కుటుంబం వారికి అండగా నిలిచే దేశం మనది. అదే కుటుంబం కనుక.. తప్పు చేస్తే తమ నుంచి సహాయం అందదనే భయాన్ని చిన్నప్పటి నుంచి కలిగిస్తే... ఆ తప్పు చేయడానికి వారు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. ఈక్రమంలోనే బాలురు బాలికలతో తప్పుగా మాట్లాడితే ఇంటికి రానివ్వద్దు, తమని అక్క, చెల్లి అని పిలవద్దని విద్యార్థినులకు చెప్పాను’’ అని కేజ్రీవాల్ తెలిపారు. అంతేకాదు స్త్రీల రక్షణ గురించి చర్చించేందుకు తాను మూడు, నాలుగు నెలలకోసారి ఇలానే లైవ్‌లో పిల్లలతో మాట్లాడతానని కూడా ఆయన హామీనిచ్చారు.
Photos: Screengrab