సాధారణంగా పిల్లలు మాట్లాడుతుంటూనే ఎంతో ముద్దుగా ఉంటూ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. ఎందుకంటే వారి మాటలు, హావభావాల్లో ఎలాంటి కల్మషం ఉండదు. స్వచ్ఛత, అమాయకత్వం మాత్రమే కనిపిస్తాయి. అందుకే పిల్లలు ఏ పనిచేసినా చూడడానికి చాలా ముచ్చటేస్తుంటుంది. ఈ క్రమంలో పసిఛాయలు కూడా పోని ఓ ముగ్గురు బుడతలు రాక్స్టార్లుగా మారారు. పాటలు పాడుతూ తమదైన హుషారుతో డ్యాన్స్ చేశారు. ఇందులో ప్రత్యేకమేముందనేగా మీ డౌటు? సాధారణంగా రాక్స్టార్లు గిటారో, లేకుంటే మరో వాయిద్య పరికరాన్నో వాయిస్తూ పాటలు పాడతారు. అయితే ఈ బుడతల చేతిలో ఎలాంటి గిటార్ లేకున్నా కి ‘రాక్’ అనిపించారు. అది ఎలాగో మీరే చూడండి.

అచ్చం వారిలానే..!
చేతిలో ఖరీదైన గిటార్.. ట్రెండీ హెయిర్ స్టైల్స్.. చూడగానే ఆకట్టుకునే డ్రస్సింగ్.. చూడడానికి రాక్స్టార్ల ఆహార్యం ఇలాగే ఉంటుంది. అయితే ఇవేం లేకున్నా రాక్స్టార్లుగా మారిపోయారు ముగ్గురు బుడతలు. చింపిరి జుట్టు, సాధారణ దుస్తులు ధరించిన ఓ ముగ్గురు చిన్నారులు తమను తాము గిటారిస్టులుగా వూహించుకున్నారు. అందులో ఒకడు తన చేతిలో కర్రను పట్టుకుని గిటారుగా వూహించుకుని వాయించగా, మిగతా ఇద్దరు ఖాళీ చేతులు కదుపుతూ గిటార్ వాయిస్తున్నట్లు కటింగ్ ఇచ్చారు. స్టేజ్‌లపై రాక్స్టార్లు ఎలా వూగుతూ డ్యాన్స్ చేస్తూ గిటార్ వాయిస్తారో.. అచ్చం అలాగే చేశారీ బుడతలు. వారిలాగే హావభావాలు పలికిస్తూ తమదైన శైలిలో పాటలు పాడుతూ హుషారెత్తించారు.
టీం వర్క్ బాగుంది.!
ఈ క్రమంలో క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో గాల్లో గిటారు వాయించిన ఈ బుల్లి రాక్స్టార్లకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ ఈ బుల్లి రాక్స్టార్లు ఈ శనివారం రాత్రి ఏ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు? నేను కూడా వచ్చి వారితో జాయిన్ అవుతా’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను తమ అధికారిక ట్విట్టర్లో షేర్ చేసింది ‘ఫిట్ భారత్’. కేవలం ఒక నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోను చూసిన నెటిజన్లందరూ ఈ బుడతల ఫెర్ఫార్మెన్స్‌కి ఫిదా అవుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘మనస్ఫూర్తిగా పాడుతున్నారు’ అని ఒకరు కామెంట్ పెట్టగా.. ‘వారి ప్యాషన్‌కు హ్యాట్సాప్’ అని మరొకరు స్పందించారు. ‘మేం కూడా మీ పార్టీలో జాయిన్ అవ్వొచ్చా’ అని మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు. ఇవే కాక ‘టీం వర్క్ బాగుంది’, ‘సో క్యూట్’, ‘సూపర్బ్ ఎనర్జీ’ అంటూ బుడతలను అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. మరి గిటారు లేకున్నా రాక్స్టార్టుగా మారిపోయిన బుడతల బ్యాండ్ పార్టీపై మీరు కూడా ఓ లుక్కేయండి.