ఎవరికైనా సహాయం చేయమంటే చాలామంది నుంచి వచ్చే సమాధానం... ‘ఓ వైపు మన పరిస్థితే బాగాలేదు. ఇక ఇతరులకు ఏం సాయం చేస్తాం’ అని! అయితే ఇతరులకు సాయం చేయాలంటే ఉండాల్సింది డబ్బులు కాదని, సంకల్పం ఉంటే చాలని నిరూపించింది అమెరికాకు చెందిన కేట్లిన్ హార్డీ అనే ఓ ఐదేళ్ల చిన్నారి. చిన్న చేతులే అయినా పెద్ద సాయం చేసి అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఇంతకీ ఎవరీ చిన్నారి, తను చేసిన ఆ గొప్ప పనేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి...
కేట్లిన్ హార్డీ కాలిఫోర్నియాలోని విస్టాలో ఉన్న బ్రీజ్ హిల్ స్కూల్లో చదువుకుంటోంది. రోజూ స్కూల్‌కి వెళ్లిరావడం, ఆడుకోవడం ఇదీ... కేట్లిన్ దిన చర్య. ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా పరిశీలించే కేట్లిన్ ఒకరోజు స్కూల్లో ఓ సంఘటనను చూసి చలించిపోయింది. స్కూల్‌కి వచ్చిన చిన్నారుల తల్లుల్లో ఒకావిడ.. ‘ఈ లంచ్ ఫీజులు కట్టలేకపోతున్నాం, ఇక మా వల్ల కాదని’ చెబుతూ వాపోయింది. అక్కడే ఉన్న కేట్లిన్ ఇదంతా విని సాయంత్రం ఇంటికి వెళ్లగానే స్కూ్ల్లో జరిగిన విషయాన్ని తల్లి కరీనా హార్డీకి వివరించింది. ‘స్కూల్లో చాలామంది లంచ్ ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు.. వారికి నేనేం సాయం చేయాలేనా’?అని ప్రశ్నించింది. దానికి స్పందించిన కేట్లిన్ తల్లి కరీనా... ‘మనకు ఉన్నదాంట్లో వీలైనంత కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయాల’ని చెప్పింది. ఈ మాటలను చిన్నారి కేట్లిన్ చాలా సీరియస్‌గా తీసుకుంది. ఎలాగైనా తోటి స్నేహితులకు సాయం చేయాలని గట్టిగా నిశ్చయించుకుంది.

స్టాల్ ఏర్పాటు..
ఇందులో భాగంగానే తల్లి చెప్పిందంతా విన్న కేట్లిన్కు ఓ ఐడియా వచ్చింది. తన స్నేహితుల లంచ్ ఫీజులను కట్టడానికి తానే డబ్బులు సంపాదించాలని ఫిక్స్ అయ్యింది. ‘ఒక స్టాల్ ఏర్పాటు చేసి కేక్, కుకీస్ వంటివి అమ్ముతాను... వాటి ద్వారా వచ్చిన డబ్బులను ఫ్రెండ్స్ ఫీజుకోసం ఉపయోగిస్తాను. ఇందుకు నువ్వు నాకు సాయం చేయమ్మా’అని తన తల్లిని అడిగింది. ఇదంతా విన్న కరీనా హార్డీ అంత చిన్న వయసులో ఎంతో పెద్దగా ఆలోచిస్తున్న తన కూతురును చూసి సంతోషించింది. వెంటనే వారి ఇంటి దగ్గరే ఓ స్టాల్‌ను ఏర్పాటు చేసింది. స్కూల్‌కి వెళ్లిరాగానే సాయంత్రం టీ, కాఫీ, కేక్స్, కుకీస్ అమ్మడం ప్రారంభించింది కేట్లిన్. దారినపోయేవారు అసలు విషయాన్ని తెలుసుకుని కేట్లిన్ను ప్రశంసించడం ప్రారంభించారు. ఇలా వాటి అమ్మకం ద్వారా సుమారు 80 డాలర్ల (రూ. 5,700) వరకు వచ్చాయి. ఆ డబ్బుతో కేట్లిన్ తోటి విద్యార్థుల లంచ్ ఫీజును చెల్లించింది. వయసులో చిన్న అయినా కేట్లిన్ స్పందించిన తీరు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది. ఈ విషయమై స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ... ‘ఇది చాలా సంతోషించాల్సిన విషయం. విద్యార్థుల లంచ్ ఫీజు గురించి ఎన్నో మాటలు మాట్లాడుకున్నాం... కానీ ఈ చిన్నారి చేసి చూపించిందంటూ’ ప్రశంసలు కురిపించారు.
సోషల్ మీడియా ద్వారా...
కేట్లిన్ చిన్ని బుర్రలో పుట్టిన ఈ ఆలోచన సక్సెస్ కావడంతో తల్లి కరీనా దీన్ని సోషల్ మీడియా ద్వారా మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా కేట్లిన్ ఏర్పాటు చేసిన స్టాల్ ఫొటోలతో పాటు ఆ చిన్నారి లక్ష్యం గురించి వివరిస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని తెలుసుకున్న చాలా మంది కేట్లిన్ స్టాల్‌కు వచ్చి విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో ‘కికిస్ కైండ్‌నెస్ ప్రాజెక్ట్’ పేరుతో ఓ ఫేస్బుక్ పేజీని కూడా మొదలు పెట్టారు. దీని ద్వారా ఆన్లైన్లో విరాళాలు అందించే సౌకర్యాన్ని కూడా కల్పించారు. తన కూతురు ఏర్పాటు చేసిన స్టాల్‌ను ఇలాగే కొనసాగిస్తూ, పాఠశాల విద్యార్థులకు సాయం అందించేందుకు కృషి చేస్తామని కరీనా హార్డీ తెలిపారు.