వీటితో కిచెన్ సింక్ చిటికెలో శుభ్రం!
ఇంట్లో మనం ఎక్కువగా సమయం గడిపే ప్రదేశం ఏంటి.. అంటే కిచెన్ అనే సమాధానమొస్తుంది. అవును.. ఉదయం లేచిన దగ్గర్నుంచి ఆఫీసుకు వెళ్లే వరకు.. అలాగే ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ఎక్కువ సమయం కిచెన్‌లోనే గడిచిపోతుంటుంది. ఈ క్రమంలో వంట చేయడం, గిన్నెలు కడగడం, కిచెన్ ప్లాట్‌ఫామ్ శుభ్రం చేసుకోవడం.. వంటివన్నీ రోజూ తప్పకుండా చేయాల్సిన పనులు. ఇలా క్లీన్‌గా ఉంచినప్పుడే వంటగది పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. అయితే కిచెన్ ప్లాట్‌ఫామ్, సింక్.. వంటివి శుభ్రం చేయడానికి చాలామంది నానా తంటాలూ పడుతుంటారు. కారణం.. వంట చేసే క్రమంలో ప్లాట్‌ఫామ్‌పై నూనె మరకలు పడి జిడ్డుగా తయారవడం, సింక్‌లో పదార్థాల వ్యర్థాలు ఇరుక్కొని జామ్ కావడం.. వంటి సమస్యలు తలెత్తడమే! మరి, అలా జరగకుండా కిచెన్ సింక్‌ని, ప్లాట్‌ఫామ్‌ని సులభంగా శుభ్రం చేసుకోవాలంటే.. అందుకు బోలెడన్ని గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకొని వాటినీ మన కిచెన్‌లో భాగం చేసుకుందాం రండి..