మహిళలు వంట చేయడంలో సిద్ధహస్తులు. వృత్తి ఉద్యోగాల్లో ఎంత బిజీగా ఉన్నా, ఎంతటి కీలక పదవిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నా కాస్త టైం దొరికిందంటే చాలు.. రకరకాల వంటలు చేయడమంటే చాలామంది మహిళలకు ఆసక్తే. తను కూడా అంతే అంటున్నారు అమెరికా నూతన ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్. నిజం చెప్పాలంటే ఆ పనిలోనే చెప్పలేనంత ఆనందం ఉందంటున్నారు! సగటు భారతీయ మహిళలా తాను కూడా వంట చేయడాన్ని అమితంగా ఇష్టపడతానంటోన్న ఆమెలో చేయి తిరిగిన పాకశాస్త్ర నిపుణురాలున్నారనడంలో సందేహం లేదు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఆమె తన సోషల్ మీడియా ఖాతాల్లో తరచూ పోస్ట్ చేసే ఆయా రెసిపీల ఫొటోలు, వీడియోలే!
అమెరికా ఎన్నికల ప్రచారం దగ్గర్నుంచి నేటి దాకా పలు సందర్భాల్లో తన పాకశాస్త్ర అభిరుచుల్ని, తనకెంతో ఇష్టమైన వంటకాల్ని పంచుకుంటూనే ఉన్నారు కమల. అంతేకాదు.. ఒక బిజీ ఉమన్‌గా అటు వృత్తిని, ఇటు ఇంటిని ఎలా బ్యాలన్స్ చేసుకోవాలి?; భర్తతో కలిసి ఇంటి పనుల్ని ఎలా పంచుకోవాలి? ఇలా సగటు మహిళకు ఉపయోగపడేలా కమల చెప్పిన వంటింటి చిట్కాలెన్నో! అమెరికా నూతన ఉపాధ్యక్షురాలిగా గద్దెనెక్కిన తరుణంలో ఆమె పలు సందర్భాల్లో పంచుకున్న పాకశాస్త్ర ముచ్చట్లేంటో ఓసారి నెమరువేసుకుందాం..!
అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగిన దగ్గర్నుంచి వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు కమలా హ్యారిస్. భారతీయ సంతతి మూలాలున్న ఆమె అణువణువూ భారతీయతే నిండి ఉందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో తానెంత బిజీగా ఉన్నా సగటు భారతీయ మహిళగా తన కుటుంబం కోసం వంట చేస్తూ గృహిణిగా తన బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తిస్తానంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు కమల. ఈ క్రమంలో తాను తయారుచేసే పలు వంటకాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సైతం సోషల్ మీడియాలో పంచుకుంటుంటారామె.
చికెన్ ఇలా తింటా!
తనకెంతో ఇష్టమైన చికెన్ రెసిపీకి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు కమల. ‘దీని పేరు హోల్ రోస్టెడ్ చికెన్. ముందు రోజే హోల్ చికెన్‌కు నిమ్మరసం, మసాలా దినుసులు, సన్నగా తరిగిన వెల్లుల్లి, మిరియాల పొడి, ఉప్పు పట్టించాలి. ఆపై వెన్న రాయాలి. గట్టిగా దారంతో కట్టి ఓ రోజంతా ఫ్రిజ్‌లో పెట్టాలి. మరుసటి రోజు దాన్ని సన్నని మంటపై కాల్చి మంచి సాస్‌తో తింటే ఆ రుచే వేరు..’ అంటారు కమల. ఎప్పుడు సెలవు దొరికినా ఆ రోజు రాత్రి తన కుటుంబం కోసం ఎంతో ప్రేమతో వండి వార్చడంలో ఉన్న సంతృప్తి మరెందులోనూ దొరకదంటున్నారీ గ్రేట్ లేడీ.
ఆ పండక్కి.. ఈ రెసిపీతోనే..!
తమ కడుపు నింపే పంటలకు, ప్రకృతికి కృతజ్ఞతలు చెబుతూ ‘థ్యాంక్స్ గివింగ్ డే’ పేరుతో అమెరికాలో ఏటా నవంబర్‌లో ఓ వేడుక జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో అక్కడి ప్రజలు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి వంట చేసుకొని విందారగిస్తుంటారు. అలా కమల కూడా ఈ ప్రత్యేకమైన రోజున తాను తన కుటుంబం కోసం తయారుచేసిన ఓ స్పెషల్ రెసిపీని ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. ఇందులో భాగంగా కార్న్‌బ్రెడ్ డ్రెస్సింగ్ వంటకం తయారీ విధానాన్ని ఇన్‌స్టా స్లైడ్స్ రూపంలో పంచుకున్న ఆమె.. ‘ఇది మా కుటుంబానికి ఎంతో ఇష్టమైన రెసిపీ!’ అంటూ క్యాప్షన్ పెట్టారు.
ఇడ్లీ-సాంబార్ ఉంటే చాలు!
తాను ఎన్నో ఏళ్లుగా అమెరికాలో ఉంటోన్నప్పటికీ భారతీయ రుచుల్ని మాత్రం మర్చిపోనని చెబుతున్నారు కమల. ఇటీవలే ఓ సందర్భంలో తనకిష్టమైన వంటకాల గురించి మాట్లాడుతూ.. ‘దక్షిణాదిన ఇడ్లీ-సాంబార్, ఉత్తరాదిన టిక్కీలంటే మహా ఇష్టం.. ఇక చిన్నతనంలో పెరుగు, పప్పు, బంగాళాదుంప కూర, కోడిగుడ్డు పొరటు ఆస్వాదిస్తూ తినేదాన్ని. మా అమ్మమ్మ శాకాహారి కావడంతో ఆమె ఎటైనా వెళ్లినప్పుడు తాతయ్యతో కలిసి గుడ్లతో ఫ్రెంచ్ టోస్ట్ చేసుకొని తినేవాళ్లం. ఇక పాశ్చాత్య వంటకాల్లో హోల్ రోస్టెడ్ చికెన్, ట్యూనా మెల్ట్, బురిటోస్, ఛీజ్ బర్గర్ అంటే మక్కువతో తింటా. ఉదయం అల్పాహారంగా బాదం పాలలో నానబెట్టిన రైసిన్ బ్రాన్ను తేనె-నిమ్మరసంతో కలిపి తీసుకుంటా..’ అంటూ తన ఆహారపు అలవాట్ల గురించి పంచుకున్నారు కమల.
కొత్త వంటకాలు నేర్చుకుంటా!
ఎన్నికల్లో అభ్యర్థిత్వం కోసం ప్రయత్నిస్తోన్న క్రమంలో కమల భారత సంతతి కమెడియన్ మిండీ కలింగ్‌తో కలిసి వేసిన మసాలా దోసె వీడియో ఎంత వైరలైందో మనం చూసే ఉంటాం. అయితే ఇలా తాను వంట చేయడమే కాదు.. వంట నేర్చుకోవడానికీ వెనకాడనంటున్నారు కమల. ఈ క్రమంలో ఓ రోజు తన అభిమాని ఇంటికెళ్లి ఆమెను సర్ప్రైజ్ చేసిన కమల.. తన దగ్గర్నుంచి మాన్స్టర్ కుకీస్ రెసిపీని నేర్చుకున్నానంటున్నారు. పిండి ఉపయోగించకుండా పీనట్ బటర్, ఓట్మీల్ వంటి పదార్థాలతో తయారుచేసిన ఈ రెసిపీ ఎంతో రుచిగా ఉందంటూ ఆ అమ్మాయిని ప్రశంసల్లో ముంచెత్తారీ ఉపాధ్యక్షురాలు.
కలిసి పంచుకుంటే ఈజీ అవుతుంది!
ఓవైపు ఇటు భారతీయ, అటు పాశ్చాత్య వంటకాలతో తనలోని పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని చాటుకుంటోన్న కమల.. మహిళలందరికీ వర్క్-లైఫ్ బ్యాలన్స్ పాఠాలు సైతం నేర్పుతున్నారు. ‘ఈ రోజుల్లో ఇంటి పని, వంట పని, కెరీర్.. ఈ మూడూ బ్యాలన్స్ చేయలేక చాలామంది మహిళలు సతమతమైపోతున్నారు. కానీ వీటిని సమన్వయం చేసుకోవడం ఎంతో సులువు. అన్ని పనులకు ప్రణాళిక ఉన్నట్లే వంటకీ ఉండాలి. అందుకు అవసరమైన పనులన్నీ ముందుగానే పూర్తి చేసుకోవాలి. నేను గంటల తరబడి జూమ్ కాల్స్, సమావేశాలతో బిజీగా గడుపుతుంటా. అయినా అలసట లేకుండా వంట చేయడాన్ని ఆస్వాదిస్తా. దీని వెనకున్న సీక్రెట్ ఏంటో తెలుసా.. ఇందాక మీకు చెప్పినట్లుగా ముందుగానే అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకోవడం. ఒక్కమాటలో చెప్పాలంటే నా మనసు బాగోలేనప్పుడు, ఒత్తిడిగా అనిపించినప్పుడు వంటే నన్ను మామూలు మనిషిని చేస్తుంది. ఇక పనులు సులభంగా పూర్తవ్వాలంటే భార్యాభర్తలిద్దరూ పనుల్ని పంచుకోవాలి. ఈ క్రమంలో నా భర్తకు వంటింటి బాధ్యతలు అప్పగించిన సందర్భాలెన్నో!’ అంటారామె.
అది అమ్మ నుంచే నేర్చుకున్నా!
ఆరోగ్యంపై శ్రద్ధ వహించే కమల తనకు కావాల్సిన కాయగూరలు, ఆకుకూరల్ని తానే స్వయంగా పండించుకుంటానంటున్నారు. ‘ఆహారంతో ఆరోగ్యం అనే సూత్రాన్ని నేను బాగా నమ్ముతాను. అందుకే నేను తీసుకునే ప్రతి పదార్థంలో నా శరీరానికి కావాల్సిన పోషకాలు ఉండేలా జాగ్రత్తపడతా. మరో విషయమేంటంటే.. ఆయా వంటకాల్లో ఉపయోగించే వివిధ రకాల దినుసుల్ని నేనే స్వయంగా పెంచుకుంటా. ఇక పదార్థాల్ని వృథా చేయడం నాకు నచ్చదు. మిగిలిపోయిన పదార్థాల్ని మళ్లీ ఎలా ఉపయోగించచ్చో అమ్మ నుంచే నేర్చుకున్నా..’ అంటారామె. ఇక ఆహారమంటే ఎంతో ఇష్టపడే నన్ను చూసి అమ్మ ఓ రోజు ‘కమలా నీకిష్టమైనవి తినాలనుకుంటే ముందు వాటిని ఎలా వండాలో నేర్చుకో అంది.. అది మొదలు వంటిల్లే నాకెంతో ఇష్టమైన స్థలమైంది.. అప్పట్నుంచే ఘుమఘుమల్ని ఆస్వాదించడం మొదలుపెట్టా..’ అంటూ తానో పెద్ద ఫుడీనంటూ చెప్పుకొచ్చారామె.
చక్కగా వంట చేయడం, ఇష్టంగా కుటుంబ సభ్యులకు వడ్డించడమే కాదు.. వంటింటిని పొందికగా సర్దుకోవడంలోనూ ఓర్పు-నేర్పు తన సొంతమంటున్నారు కమల. ఈ క్రమంలో పప్పుదినుసులు, మసాలాలు, బీన్స్.. వంటి వాటిని ప్రత్యేకంగా భద్రపరచుకుంటానంటూ తన కిచెన్ సీక్రెట్స్‌ని కూడా పంచుకున్నారామె.
ఇలా ఓవైపు తీరిక లేకుండా గడుపుతున్నా.. మరోవైపు గృహిణిగా తన పనుల్ని బ్యాలన్స్ చేసుకుంటూ ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు కమల. ఆమె చెప్పిన కిచెన్ టిప్స్, వంట చేసే క్రమంలో తాను పాటించే చిట్కాలు మనందరికీ ఎంతగానో ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు.