పచ్చని పేడతో కళ్ళాపి చల్లి, ఆకాశంలోని చుక్కల్ని నేలపై వరుసగా పేర్చి, వాటిని అందంగా కలుపుతూ, ఆ మధ్యలో రంగుల్ని నింపుతూ.. ఇలా సంక్రాంతి వచ్చిందంటే తెలుగు లోగిళ్లన్నీ హరివిల్లును తలపిస్తాయి. అందుకే ధనుర్మాసాన్ని ముగ్గుల మాసంగా అభివర్ణిస్తుంటారు పెద్దలు. అయితే కాలం మారుతోంది.. కల్చర్‌లోనూ పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రతి దాంట్లోనూ కొత్తదనం కోరుకుంటూ, ఆధునికతను జోడిస్తూ ముందుకు సాగుతోన్న ఈ తరం అతివలు ముగ్గులకూ కొత్త సొబగులద్దుతున్నారు. నాటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే తమలోని సృజనాత్మకతను చాటుతున్నారు. ముగ్గుల్ని విభిన్నంగా, వైవిధ్యంగా తీర్చిదిద్దుతూ సంక్రాంతికి సరికొత్తగా స్వాగతం పలుకుతున్నారు. ‘కాదేదీ కళకు అనర్హం’ అన్నట్లుగా పలు వస్తువుల్నీ రంగవల్లికల్లో భాగం చేస్తున్నారు. మరి, సంక్రాంతి సందర్భంగా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న అలాంటి కొన్ని ట్రెడిషనల్ కమ్ మోడ్రన్ రంగోలీ డిజైన్స్ గురించి తెలుసుకుందాం...
చుక్కల ముగ్గులు, మెలికల ముగ్గులు, నాలుగు గీతలు గీస్తూ వేసే ముగ్గులు.. ఇలా ఒకప్పుడు సంక్రాంతి వచ్చిందంటే ఇలాంటి ముగ్గుల హడావిడి ఎక్కువగా కనిపించేది. అయితే మారుతున్న కాలాన్ని బట్టి ఈ ముగ్గుల్లోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తెల్లటి పిండితో వేసే ముగ్గుల్ని కాస్తా విభిన్న రంగులతోనే తీర్చిదిద్దుతున్నారు ఈ తరం అతివలు. ఇప్పుడున్న అపార్ట్మెంట్ కల్చర్‌కు అనుగుణంగా తక్కువ ప్రదేశంలోనూ, టైల్స్-మార్బుల్.. వంటి నేలలపై అందమైన రంగవల్లుల్ని తీర్చిదిద్దుతూ ఓవైపు తమ ఇళ్లకు సంక్రాంతి శోభను తీసుకొస్తూనే.. మరోవైపు తమలోని సృజనను చాటుకుంటున్నారు. అంతేకాదు.. ఈ బిజీ లైఫ్స్టైల్లో ముగ్గులు వేయడాన్నీ పెద్ద పనిగా భావించకుండా ఎంతో సులభంగా వేసేస్తున్నారు.
నీటిపై తేలియాడుతూ..!
ఒక వెడల్పాటి పాత్రలో నిండుగా నీళ్లు పోసి అందులో రంగురంగుల పూలను అందంగా పేర్చి గుమ్మానికి ఎదురుగా లేదంటే ఓ టేబుల్‌పై అమర్చడం మనకు తెలిసిందే! అయితే ఇప్పుడు ఈ పద్ధతిని సంక్రాంతి ముగ్గులు వేయడానికీ ఉపయోగిస్తున్నారు నేటి అతివలు. ఇందుకోసం వాటర్‌ప్రూఫ్ తరహా ఓహెచ్పీ షీట్స్, ఫోమ్ షీట్స్ వంటివి పువ్వులు, ఆకుల రూపంలో కట్ చేసి వాటిపై కుందన్స్, బీడ్స్.. వంటి మెటీరియల్స్‌తో అదనపు హంగులద్ది.. ఆపై వాటన్నింటినీ ఒక క్రమపద్ధతిలో అతికించి.. ఒక చిన్న ముగ్గు మాదిరిగా తయారుచేస్తున్నారు. దీన్ని ఒక వెడల్పాటి పాత్రలో పెట్టి అందులో నీళ్లు నింపుతున్నారు. ఇలా ఇప్పుడిది నీటిపై తేలియాడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఇలా తయారుచేసిన అందమైన రంగవల్లికను ఇంటి ముంగిట్లో, హాల్ మధ్యలో అమర్చుతూ తమ ఇంటికి సంక్రాంతి శోభను తీసుకొస్తున్నారు ఈ తరం అతివలు. ఇలాంటి వాటర్ తరహా రంగోలీ డిజైన్లలో భాగంగా నేరుగా నీటిపై ముగ్గులేస్తూ తమలోని వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నారు మరికొందరు మహిళలు.
ముగ్గుగా.. షో పీస్‌గా!
ఎంతో కష్టపడి ఇంటి ముంగిట్లో అందంగా తీర్చిదిద్దిన రంగవల్లికను మరుసటి రోజు తొలగించడానికి మనసు రాదు చాలామందికి! అయినా సరే తొలగించక తప్పదు! క్విల్లింగ్ రంగోలీని ఎంచుకుంటే ఆ సమస్యే ఉండదు. సన్నగా, పొడవుగా కత్తిరించిన రంగురంగుల కాగితాలను పువ్వులు, ఆకులు, బొమ్మలు.. ఇలా వివిధ రూపాల్లో చుడుతూ.. వాటన్నింటినీ ఒక మందపాటి పేపర్‌పై అమర్చి ముగ్గు ఆకృతిలో తీర్చిదిద్దుతారు. రడీమేడ్ గా దొరికే వీటిని నేరుగా తెచ్చుకొని ఇంటి ముంగిట్లో అమర్చుకోవడమే తరువాయి! ఇక పని పూర్తయ్యాక దాచిపెట్టి మరో సందర్భంలో ఉపయోగించుకోవచ్చు.. లేదంటే గోడపై షో పీస్గానూ వేలాడదీయచ్చు. రోజూ ఉద్యోగాలు, ఇంటి పనులతో బిజీబిజీగా ఉండే మహిళలకు ఇలాంటి రడీమేడ్ ముగ్గులు చాలా ఉపయోగపడతాయి.
చిటికెలో ముగ్గు సిద్ధం!
ఈ బిజీ లైఫ్స్టైల్లో ఉదయాన్నే లేచి, ముంగిట్లో ముగ్గు వేసి, అందులో రంగులు నింపే ఓపిక, తీరిక చాలామందికి ఉండకపోవచ్చు. ఈ క్రమంలో ‘అబ్బ.. ముగ్గుల డిజైన్ల అచ్చులు ఏవైనా దొరికే బాగుండు! తెచ్చుకొని అందులో రంగులు నింపుకోవచ్చు..!’ అనుకునే వారు మనలో చాలామందే! అలాంటి వారు అక్రిలిక్ ముగ్గుల్ని ఎంచుకోవచ్చు. అక్రిలిక్ షీట్లపై విభిన్న ముగ్గుల ఆకృతిలో అచ్చుల్ని కట్ చేసి ప్రస్తుతం మార్కెట్లో అమ్ముతున్నారు. అలాంటివి తెచ్చుకొని మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఆ షీట్‌ని అమర్చి.. ఆ ఖాళీల్లో రంగులు నింపుకుంటే సరి! ఆ తర్వాత షీట్ నెమ్మదిగా తొలగించి చూస్తే అచ్చం ముగ్గేసి రంగులు నింపినట్లుగానే కనిపిస్తుంది.. పనీ సులభంగా పూర్తవుతుంది.
కేవలం ఇదే కాదు.. అక్రిలిక్ తరహాలో రడీమేడ్ ముగ్గులు సైతం ప్రస్తుతం లభిస్తున్నాయి. ఇందులో భాగంగా అక్రిలిక్ ప్యానళ్లను ముచ్చటైన రంగోలీ డిజైన్లలో కత్తిరించి, వాటి మీద రంగులు వేసి, కుందన్లతో అందంగా అలంకరించినట్లుగా ఇవి రూపొందుతాయి. విడి భాగాలుగా లభ్యమయ్యే వీటిని ఇంటికి తెచ్చుకొని ముంగిట్లో ముగ్గుగా పేర్చితే సరి! ఇక పని పూర్తయ్యాక తీసి దాచుకొని మరోసారి ఉపయోగించుకోవచ్చు. ఈ ఐడియా ఏదో భలే బాగుందే అనిపిస్తోంది కదూ!!
ప్రకృతిని భాగం చేస్తూ..!
ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిలో పర్యావరణ స్పృహ పెరుగుతోంది. చేసే ప్రతి పనిలోనూ ప్రకృతికి హాని కలగకుండా జాగ్రత్తపడుతున్నారు. ఈ క్రమంలో ఇంట్లో పచ్చటి మొక్కల్ని ఏర్పాటు చేసుకోవడం దగ్గర్నుంచి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవడం, ప్రత్యేక సందర్భాల్లో పర్యావరణహిత వస్తువుల్నే బహుమతిగా ఇవ్వడం దాకా.. ఇలా ప్రతి విషయంలోనూ ప్రకృతిపై తమకున్న ప్రేమను చాటుకుంటున్నారు. అక్కడితో ఆగిపోకుండా సంక్రాంతి సందర్భంగా ముంగిట్లో వేసే రంగవల్లికలకూ అదే పద్ధతిని ఆపాదిస్తున్నారు. అంటే.. రంగురంగుల పూలు, ఆకులతో ప్రకృతి పులకించిపోయేలా ముగ్గులు వేస్తున్నారన్నమాట! ఇక ఆరోగ్య స్పృహ ఉన్న వారు రంగులకు బదులుగా రంగురంగుల ధాన్యాలను ముగ్గు ఖాళీల్లో రాశులుగా పోస్తున్నారు. ఇలా పర్యావరణ ప్రేమికులు, ఆరోగ్య స్పృహ కలిగిన వారు ముగ్గు రూపంలోనూ వారి సృజనను ప్రదర్శిస్తూ అందరికీ చక్కటి సందేశాన్ని అందిస్తున్నారు.
చేత్తో వేయక్కర్లేదు!
ముగ్గంటే చేత్తోనే వేయాలా? చుక్కల్నే కలపాలా? అంటే.. అసలు వాటి అవసరమే లేదంటున్నారు ఈ తరం అతివలు. ఎందుకంటే ప్రస్తుతం సులభంగా ముగ్గుల్ని తీర్చిదిద్దడానికి, వాటికి అదనపు హంగులద్దడానికి మన ఇంట్లోనే బోలెడంత మెటీరియల్ ఉందంటున్నారు. ఈ క్రమంలోనే కేవలం రంగుల్ని నేలపై రాశులుగా పోసి వాటిని ఇయర్ బడ్స్, ఫోర్క్, స్పూన్స్, గాజులు, కాయిన్స్.. వంటి చిన్న చిన్న వస్తువులతో డిజైన్లా తీర్చిదిద్దుతూ తమలోని సృజనను ప్రదర్శిస్తున్నారు కొందరు మహిళలు. ఇక మరికొందరేమో.. ఖాళీ ఫెవికాల్ బాటిల్లో ముగ్గు పిండిని పోసి, బాటిల్‌ని ఒత్తుతూ కావాల్సిన డిజైన్లు వేస్తున్నారు. ఇక వీటి మధ్యలో రంగురంగుల కుందన్స్, స్టోన్స్, బీడ్స్.. వంటి వాటిని అమర్చుతూ అదనపు హంగులద్దే వారూ లేకపోలేదు. ఇలా వారి వారి సృజనను బట్టి సులభంగా అందమైన రంగవల్లికల్ని తీర్చిదిద్దుతున్నారు నేటి తరం అతివలు.
చుక్కలతో పనిలేకుండా కేవలం రంగులతోనే దేవతా రూపాలు, బొమ్మలు, తెలుగింటి అమ్మాయిల ప్రతిరూపాలు.. ఇలా వివిధ డిజైన్లు వేసే వారూ లేకపోలేదు. అంతేనా.. ఇంటి మూలల్లోనూ అందమైన బోర్డర్స్ డిజైన్స్ వేస్తూ తమలోని క్రియేటివిటీని చాటే అమ్మాయిలు బోలెడంత మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే సులభంగా, అందంగా, ఆకర్షణీయంగా ఈ తరం అతివలు తీర్చిదిద్దుతోన్న రంగవల్లికలెన్నో ఉన్నాయి. ముగ్గులు వేయడంలోనూ నాటికీ, నేటికీ ఎన్ని మార్పులొచ్చాయో కదూ!!
మరి, ఇవి కాకుండా మీకు తెలిసిన విభిన్న రంగోలీ డిజైన్లు, సులభంగా ముగ్గును తీర్చిదిద్దే పద్ధతులేమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్ ద్వారా అందరితో పంచుకోండి.. మీలోని సృజనను చాటుకోండి..!
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!