స్టీలు గిన్నెలో టీ పెట్టి, వేరే గదిలో స్నేహితురాలితో మాట్లాడుతూ ఉండిపోయింది కవిత. దాంతో టీ అంతా పొంగిపోయి గిన్నె మాడిపోయింది..
ఉదయాన్నే పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్ చేసే పనిలో ఉన్న రాధ స్టవ్ మీద పెట్టిన పాల సంగతి మరిచిపోయింది.. ఇంకేముంది.. పాలన్నీ మరిగిపోయి గిన్నె మాడినట్లుగా తయారైంది..
వీరికే కాదు.. వంటింట్లో ఇలాంటి అనుభవాలు చాలామందికి నిత్యం ఎదురవుతూనే ఉంటాయి. మరి, ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ స్టీలు పాత్రలను తిరిగి తళతళా మెరిపించడం ఎలా అని ఆలోచిస్తున్నారా?? అందుకోసం కొన్ని చిట్కాలు ఫాలో అయితే సరి.. అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..
స్టీలు గిన్నెలు శుభ్రంగా ఉన్నప్పుడు తళతళలాడుతూ ఎంత మంచి లుక్‌ని ఇస్తాయో; వాటి మీద గీతలు పడినా లేదా వాటిని సరిగ్గా శుభ్రం చేయకపోయినా అంతే కళావిహీనంగా కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా మనం రోజువారీ ఉపయోగించే స్టీలు గిన్నెలను శుభ్రం చేసే విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వాటిని శుభ్రం చేయడమే కాకుండా కొత్తవాటిలా మెరిపించేందుకు ఉపకరించే కొన్ని చిట్కాలు..

గోరువెచ్చని సోప్‌వాటర్‌తో..
రోజువారీ ఉపయోగించే స్టీల్ పాత్రలను శుభ్రం చేసేందుకు కూడా ఒక క్రమపద్ధతి అంటూ ఉంటుంది. దీని ప్రకారం ముందుగా చల్లని నీళ్లతో ఆ పాత్రపై ఎలాంటి పదార్థాలు లేకుండా పైపైన కడిగేయాలి. తర్వాత మెత్తని స్పాంజ్‌తో గోరువెచ్చని నీళ్లలో కలిపిన సోప్ మిశ్రమాన్ని ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ స్టీల్పాత్రలపై ఏవైనా పదార్థాలు గట్టిగా అంటిపెట్టుకొని ఉంటే వాటిని తొలగించేందుకు స్టీల్ లేదా ఐరన్ స్క్రబ్‌ను ఉపయోగించకూడదు. ఇందుకు నైలాన్ స్క్రబ్‌ని మాత్రమే ఉపయోగించాలి. ఫలితంగా పాత్రలపై ఎలాంటి గీతలు పడకుండా వాటిని కొత్తగా కనిపించేలా చేయచ్చు. అలాగే స్టీల్ గిన్నెలను శుభ్రం చేసిన తర్వాత వాటిని మెత్తని వస్త్రంతో తుడుచుకొని కాసేపు ఆరబెట్టాలి. ఇలా చేయడం వల్ల వాటి మెరుపు ఎక్కువ కాలం నిలిచి ఉండడమే కాదు.. మంచి లుక్‌ని కూడా ఇస్తాయి.
ఏవైనా పదార్థాలు అంటుకున్నప్పుడు..
స్టీల్ పాత్రలను ఉపయోగించే క్రమంలో వాటికి అప్పుడప్పుడూ కొన్ని పదార్థాలు కూడా అంటుకుపోతూ ఉంటాయి. ఇందుకోసం స్టీల్ లేదా ఐరన్ స్క్రబ్‌ని ఉపయోగించడం తగదు. అలా అంటుకుపోయిన పదార్థాలను సులభంగా వదిలించేందుకు బాగా వేడిగా మరిగించిన నీటిని ఉపయోగిస్తే సరి. దీనికోసం మనం చేయాల్సిందల్లా.. పదార్థం అంటుకున్న పాత్రలో తగినన్ని సలసలా మరిగించిన వేడినీళ్లు పోసి అవి చల్లారేవరకు ఆ పాత్రను కదపకుండా ఉంచడమే. ఆ తర్వాత స్పాంజ్ లేదా నైలాన్ స్క్రబ్‌ని ఉపయోగించి పాత్రని శుభ్రం చేస్తే అంటుకున్న పదార్థాలు సులభంగా తొలగిపోతాయి.

టొమాటో కెచప్‌తో..
ఈ రోజుల్లో మనం ఉపయోగించే స్టీల్ పాత్రలకు అడుగుభాగంలో రాగి పూత ఉండడం సర్వసాధారణం అయిపోయింది. ఇలాంటి పాత్రలకు స్టీల్ ఒక్కటే కొత్తగా ఉంటే సరిపోదు.. రాగి కోటింగ్ కూడా కొత్తదానిలా మెరవాలి. ఇందుకోసం వంటింట్లో అందుబాటులో ఉండే టొమాటో కెచప్‌ని ఉపయోగిస్తే సరి. రాగి కోటింగ్ ఉన్న ప్రాంతంలో కెచప్‌ని అప్త్లె చేసి పది నిమిషాలు అలానే వదిలేయాలి. ఆ తర్వాత స్క్రబ్‌తో వాటిని శుభ్రం చేస్తే కొత్తవాటిలా మెరుస్తాయి.
మాడిపోయినప్పుడు..
సాధారణంగా స్టీల్ పాత్రలు మాడిపోయినప్పుడు బ్రౌన్ కలర్లో మరకలు పడడమే కాకుండా అవి పాత్ర ఉపరితలానికి చాలా గట్టిగా అతుక్కుని కూడా ఉండిపోతాయి. ఇలాంటి వాటిని తొలగించాలంటే ముందుగా ఆ పాత్రలో నీళ్లు పోసి కాసేపు నానబెట్టాలి. ఆ తర్వాత అందులో రెండు చెంచాల బేకింగ్ సోడా వేయాలి. ఇలా చేయడం వల్ల పాత్రకు అంటుకున్న మాడిపోయిన పదార్థాలకు సంబంధించిన వ్యర్థాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. తర్వాత నైలాన్ స్క్రబ్‌తో పాత్రలను శుభ్రం చేయడం ద్వారా మాడిపోయిన మరకలన్నీ పూర్తిగా వదిలిపోతాయి.
వెనిగర్‌తో..
పాత్రల్లో పాలు లేదా నీళ్లు ఎక్కువగా మరిగించినప్పుడు ఖనిజాలు ఎక్కువగా చేరడం వల్ల అడుగుభాగం అట్టకట్టినట్లుగా తయారవుతుంది. ఇలాంటప్పుడు మూడువంతుల నీళ్లలో 1/3 వంతు వెనిగర్ కలిపి ఆ మిశ్రమాన్ని పాత్రలో వేయాలి. తర్వాత కాసేపు కదపకుండా పక్కన పెట్టాలి. కొద్దిసేపటి తర్వాత వేడినీళ్లతో ఆ పాత్రని శుభ్రం చేయడం ద్వారా అడుగుభాగంలో చేరిన ఖనిజాలను పూర్తిగా తొలగించవచ్చు.

స్టీల్ మెరవాలంటే..
స్టీల్ పాత్రలు ఎప్పుడూ మెరుస్తూ ఉండాలంటే అందుకోసం బేకింగ్ సోడా, నీళ్లు కలిపి మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ఒక క్లాత్ సహాయంతో పాత్రలకు అప్త్లె చేసి గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేయాలి. ఆ తర్వాత నీటి మరకలు పడకుండా మెత్తని వస్త్రంతో తుడిచి ఆరబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల స్టీల్ పాత్రలు ఎప్పుడూ కొత్తవాటిలా మెరుస్తూ ఉంటాయి.
స్టీల్ పాత్రలు కొత్తవాటిలా మెరుస్తూ ఉండాలంటే ఏం చేయాలి?? వాటికి ఉండే మరకలను ఎలా వదిలించాలి.. అనే అంశాల గురించి తెలిసిందిగా.. మరి, మీరు కూడా ఈ చిట్కాలను పాటించి చూడండి..!