ఇంటి అలంకరణలో గార్డెనింగ్ కూడా ఓ భాగమే. అయితే మొన్నటివరకు ఇంటి వెలుపలి వరకు మాత్రమే పరిమితమైన ఈ పచ్చదనం ఈ మధ్య కాలంలో చిన్న చిన్న మొక్కల రూపంలో ఇంట్లోకి కూడా ప్రవేశించింది. ఈ క్రమంలో ఇంటి అలంకరణకు మాత్రమే కాదు.. ఇంట్లోని గాలిని శుభ్రం చేసి మన ఆరోగ్యానికి దోహదం చేసే మొక్కల్ని పెంచుకోవడానికి ఇప్పుడంతా ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి మొక్కే 'సాంసెవిరియా'. 'స్నేక్ ప్లాంట్', 'డైహార్డ్ హౌస్ ప్లాంట్', 'డెవిల్స్ టంగ్', 'మదర్-ఇన్-లాస్ టంగ్'గా.. ఇలా విభిన్న పేర్లతో పిలిచే ఈ మొక్కను తెలుగులో 'చాగనార' అంటారు. ముఖ్యంగా పడకగదిలోని అపరిశుభ్రమైన గాలిని పరిశుభ్రంగా మార్చడంలో ఈ మొక్క పాత్ర కీలకం. కేవలం ఇదొక్కటే కాదు.. ఈ మొక్క వల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి. అవేంటో తెలుసుకొని దీన్ని మన ఇంట్లో కూడా భాగం చేసుకుంటే అందానికి అందం, మనకు ఆరోగ్యం.. ఏమంటారు..!

గాలిని శుభ్రపరుస్తుంది..
ఇంట్లోని గాలిని శుభ్రపరచడానికి ఈ మొక్క చక్కటి ఎంపిక అని నాసా జరిపిన పరిశోధనల్లో తేలింది. పెద్ద పెద్ద పరిశ్రమల్లో వెలువడే ఫార్మాల్డిహైడ్, గ్త్జెలీన్, టోలీన్, నైట్రోజన్ ఆక్సైడ్.. వంటి విషపూరిత వాయువులు కలిసిన గాలిని శుభ్రం చేయడంలో ఈ మొక్కకు సాటి వేరేది లేదంటే అతిశయోక్తి కాదు. అలాగే ఆటోమోటివ్ ప్లాంట్లు, ఎయిర్‌క్రాఫ్ట్ ప్లాంట్లు, ప్త్లెవుడ్ షాపులు, కార్పెట్లు - పెయింట్లు తయారుచేసే షాపులు, ప్రింటింగ్ ప్రెస్‌లు.. తదితర ప్రదేశాల్లో హానికారక రసాయనాలు వెలువడడం సహజం. అలాంటప్పుడు కొన్ని సాంసెవిరియా మొక్కల్ని ఆ చుట్టు పక్కల ఏర్పాటుచేసుకుంటే ఈ రసాయనాలన్నీ అది పీల్చేసుకొని గాలిని శుభ్రం చేస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. అలాగే బెడ్రూమ్లో మనం స్ప్రే చేసే రూమ్ ఫ్రెష్నర్స్, దోమల బెడద తగ్గించుకోవడానికి ఉపయోగించే మస్కిటో కాయిల్స్.. వంటి వాటి నుంచి వెలువడే రసాయనాల్ని కూడా ఇది తొలగిస్తుంది. అందుకే 1800 చదరపు అడుగుల ఇంట్లో దాదాపు 15-18 దాకా చిన్న చిన్న సాంసెవిరియా మొక్కల్ని ఏర్పాటుచేసుకోవడం మంచిదని, తద్వారా ప్రతి గదిలోని గాలి శుభ్రపడుతుందని చెబుతున్నారు నిపుణులు.

ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది..
మనకు ఆక్సిజన్ ప్రాణవాయువు అన్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని ఇళ్లలోని గదుల్లో కిటికీలు, వెంటిలేషన్లు ఉండకపోవచ్చు. తద్వారా ఆ గదిలోకి గాలి సరిగ్గా ప్రసరించకపోవచ్చు. ఇలా గాలి ప్రసరణ సరిగ్గా లేకపోతే మనకు ఆక్సిజన్ అందక ఉక్కిరిబిక్కిరి అవుతుంటాం. అలాంటప్పుడు సాంసెవిరియా మొక్క చక్కగా ఉపయోగపడుతుంది. ఇది మూసి ఉన్న గదిలోని కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. రాత్రుళ్లు ఈ ప్రక్రియ మరింత వేగవంతంగా జరుగుతుంది. ఇందుకోసం ఒక గదిలో 6-8 మీడియం సైజులో ఉన్న మొక్కల్ని అమర్చుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది.

అలర్జీలు మటుమాయం!
పొడిగాలి వల్ల కూడా అప్పుడప్పుడూ అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే గదిలో సాంసెవిరియా మొక్కల్ని అక్కడక్కడా అమర్చడం మంచిది. తద్వారా ఈ మొక్క వాతావరణంలోకి తేమను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే గాలి నాణ్యత సరిగ్గా లేకపోవడం వల్ల సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ (ఎస్బీఎస్) బారిన పడే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల చెవులు, ముక్కు, గొంతులో దురద రావడం, దగ్గు, నీరసం, వికారం, కడుపులో తిప్పుతున్నట్లు ఉండడం, ఏకాగ్రత కోల్పోవడం, కండరాల్లో నొప్పి.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవన్నీ దూరం కావాలంటే గాలిని శుభ్రపరచడానికి ఉపయోగపడే సాంసెవిరియా మొక్కల్ని మన చుట్టూ ఏర్పాటుచేసుకోవడం అత్యవసరం.

ఇవి కూడా..
* సాంసెవిరియా ఇంట్లోని గాలిని శుభ్రపరచడంతో పాటు టాయిలెట్ నుంచి వచ్చే దుర్వాసనను దూరం చేస్తుంది. అలాగే బాత్రూమ్లలోని హ్యుమిడిటీని సైతం తగ్గిస్తుంది.
* ఈ మొక్క ఆకుల్ని ఆయుర్వేద చికిత్సల్లో వాడుతుంటారు. ముఖ్యంగా చర్మ సంరక్షణకు, పాము కాటుకు విరుగుడుగా, కుష్టువ్యాధి నివారణకు, కీళ్ల నొప్పులు వంటివి తగ్గడానికి ఉపయోగిస్తుంటారు.
* చిన్నపిల్లలుండే ఇంటి పరిసరాల్లో ఈ మొక్కను ఉంచితే అది వారిలో చికాకును దూరం చేసి, వారు ప్రశాంతంగా, కామ్‌గా ఉండేలా చేస్తుందట! అయితే ఈ మొక్క ఆకులు విషపూరితంగా ఉంటాయి కాబట్టి వాటిని చిన్నారులు, పెంపుడు జంతువులు నోట్లో పెట్టుకోకుండా కాపాడాల్సిన బాధ్యత మీదే! అందుకోసం వీటిని ఇంట్లో కాకుండా ఇంటి బయట వాకిట్లో అమర్చితే చిన్నారులు, పెట్స్ వాటికి కాస్త దూరంగా ఉండే అవకాశం ఉంటుంది.
* సాంసెవిరియా మొక్కను అదృష్ట మొక్కగా కూడా భావిస్తారు. ఇది చెడు దృష్టిని దూరం చేయడంతో పాటు మనసుకు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది. అందుకే దీన్ని ఎక్కువగా ఇంటి ముంగిళ్లలో, ఆఫీసు డెస్కులపై అమర్చుకుంటుంటారు.
సంరక్షించడమూ సులభమే!

పొడవైన ఆకులతో, పొట్టిగా ఉండే ఆకులతో.. ఇలా రెండు రకాలుగా ఉండే ఈ మొక్కను సంరక్షించడం కూడా చాలా సులువు. * ఈ మొక్కకు నీళ్లు పదే పదే పెట్టాల్సిన పనిలేదు. మొక్కకు పోషకాలు అందించే మట్టి పొడిగా ఉండేలా చూసుకోవాలి. 2-6 వారాలకోసారి నీళ్లు పోస్తే సరిపోతుంది. కానీ నీళ్లు పట్టే ముందు మాత్రం మట్టి పొడిగా ఉండడం ముఖ్యమన్న విషయం మర్చిపోకూడదు. ఇలా మట్టి పొడిగా ఉండడం వల్ల దానికి అవసరమైన పోషకాలు అందడంతో మొక్క చచ్చిపోకుండా జాగ్రత్తపడచ్చు. * వెలుతురు ఎక్కువగా, తక్కువగా ఉండే ప్రదేశాల్లో ఈ మొక్కను అమర్చవచ్చు. అయితే సూర్యరశ్మి నేరుగా దీనిపై పడకుండా జాగ్రత్తపడడం ఉత్తమం. ఎందుకంటే ఎండ వేడి వల్ల ఈ మొక్క ఆకులు కాలిపోయే ప్రమాదం ఉంది. * ఈ మొక్కకు చీడపీడల బెడద కూడా ఉండదు. ఒకవేళ చీడపీడల బారిన పడ్డట్త్లెతే మాత్రం దానికి తగ్గ ఎరువులు వేస్తే సరిపోతుంది. * ఇలాంటిదే మరో మొక్క కావాలన్నా, లేదంటే ఈ మొక్కనే ఇతరులకు బహుమతిగా అందించాలన్నా మరొకటి కొనాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ఈ మొక్క వేర్లను, ఆకుల్ని నాటితే కొత్త మొక్కగా రూపాంతరం చెందుతుంది. * ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం, తక్కువ వెలుతురులో పెంచడం వల్ల ఈ మొక్క 5-10 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా ఉండే అవకాశముంది. సాధారణంగా దీని జీవితకాలం 2-5 సంవత్సరాలు ఉంటుంది.
|
అటు ఇంటికి అందాన్నివ్వడంతో పాటు, ఇటు ఇంట్లోని గాలిని శుద్ధి చేసి, ఆక్సిజన్‌ను విడుదల చేసి ఆరోగ్యాన్ని అందించే సాంసెవిరియా మొక్క వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసుకున్నారు కదా! ఇంకెందుకాలస్యం.. వెంటనే దీన్ని మీ ఇంటికి తెచ్చుకొని ఈ ప్రయోజనాలన్నీ పొందండి.