చిన్న వస్తువులు ఒక్కోసారి పెద్ద సమస్యలు తీరుస్తాయి. అలాంటిదే చాక్ పీస్ కూడా..! కేవలం బోర్డు మీద రాయడానికో, ముగ్గులు వేయడానికో కాకుండా దీన్ని చాలా రకాలుగా వాడొచ్చు. అదెలాగో తెలుసుకోవాలంటే ఇది చదవండి.

* దుస్తుల మీద, లెదర్ వస్తువుల మీద నూనె మరకలు పడ్డప్పుడు చాక్‌పీస్‌తో రుద్ది, ఒక పది నిముషాల తర్వాత దులిపేయాలి. చాక్‌పీస్ నూనె పూర్తిగా పీల్చుకుని మరకని మాయం చేస్తుంది.

* వెండి, రాగి, ఇత్తడి వస్తువులు నల్లబడుతున్నాయా? అయితే వాటిని తిరిగి మెరిపించాలంటే చాక్ పీస్ పొడితో శుభ్ర పరిస్తే సరి..!

* చాక్ పీస్ పొడిని గుడ్డలో కట్టి తడిగా ఉన్న లేదా చెమట వాసన ఉన్న షూలలో రెండు గంటలపాటు(రాత్రంతా ఉంచితే మరీ మంచిది) ఉంచాలి.ఇలా చేస్తే తడి, వాసన పోయి షూలు శుభ్రంగా ఉంటాయి.

* పెన్నుతో రాసేటప్పుడు తప్పుదొర్లిందా..అందుబాటులో వైట్నర్ లేకపోతే కంగారు పడకండి. చాక్ పీసును వైట్నర్గా ఉపయోగించి చూడండి. సమస్య ఇట్టే పరిష్కారమౌతుంది.

* అతి ముఖ్యమైన పేపరు మీద నీళ్లు ఒలికిపోయాయా..? పరవాలేదు..ఆ తడి మీద చాక్‌పీసును దొర్లించండి. మంత్రం వేసినట్టు నీరంతా మాయమౌతుంది.

* తాళపు చెవి తరచూ తాళంలో ఇరుక్కు పోతుంటే ఆ తాళానికీ తాళపు చెవికీ చాక్ పీసును రుద్దండి. సమస్య పరిష్కారమౌతుంది.

చీమలు పోవాలంటే ఇలా చేయండి. చాక్పీసుని కాస్త గ్యాసోలిన్ నూనెలో తడపాలి. లేదంటే దానిపై నాలుగు లెమన్ గ్రాస్ ఎసెన్షియల్ ఆయిల్ చుక్కలు వేయాలి. ఆ చాక్ పీసును గోడ వెంబడి గీస్తే ఇక చీమలు ఆ ప్రదేశానికి రావు.

* తెల్లని గోడలపై పగుళ్లను, మేకులు కొట్టిన మరకలను, చాక్ పీసుతో రుద్ది కవర్ చేయొచ్చు.

* పాత దుస్తులు, దుప్పట్లు పెట్టే ప్రదేశంలో చాక్ పీసులని ఒక పల్చని గుడ్డలో కట్టి ఉంచితే ముతక వాసన రాదు.
ఇవండీ చాక్‌పీస్ ఉపయోగాలు.. ఇవి కాకుండా మీకు మరిన్ని చాక్‌పీస్ చిట్కాలు తెలిస్తే మాతో పంచుకోండి..!