బియ్యం కడిగిన నీళ్లను వేరు చేసేటప్పుడు ఆ నీటితో పాటే కొన్ని బియ్యం కూడా సింక్‌లో పడిపోయి వృథా అవడం మనకు రోజూ ఎదురయ్యే అనుభవమే.
అలాగే పాస్తాను ఉడికించిన తర్వాత ఆ నీటిని వడకట్టే క్రమంలో పాస్తా ఎక్కడ సింక్‌లో పడిపోతుందోనని అనుకునే వారూ మనలో చాలామందే!
నూనెలో వేయించిన పదార్థాలు, స్నాక్స్‌ను టిష్యూ పేపర్లో వేసి అది ఆ నూనెను పూర్తిగా పీల్చేసుకున్నాక తినడం మనకు అలవాటే. అలా ఆ నూనె వృథా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచించేవారూ మనలో లేకపోలేదు.
మనం రోజూ కిచెన్‌లో వంట చేసే క్రమంలో ఇలాంటి అనుభవాలు మనకు మామూలే. మరి, ఈ క్రమంలో ఆయా పదార్థాలు వృధా కాకుండా ఉండడంతో పాటు ఈ పనులన్నీ సులువుగా పూర్తవ్వాలంటే.. అందుకోసం వివిధ రకాల కిచెన్ గ్యాడ్జెట్స్ ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి. పిండిని సులభంగా జల్లించడం దగ్గర్నుంచి ఒక్క బియ్యపు గింజ కూడా కింద పడకుండా సులువుగా బియ్యం కడిగే దాకా ప్రతి పనినీ ఈజీ చేసేస్తున్నాయీ సరికొత్త కిచెన్ టూల్స్. మరి, వంటింట్లో పనిని మరింత సులభతరం చేస్తోన్న ఆ గ్యాడ్జెట్లేంటి? అవి ఎలా ఉపయోగపడతాయి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

ఆయిల్ స్ట్రెయినర్
పండగలు, ప్రత్యేక సందర్భాల్లో ఏవైనా పిండి వంటలు లేదంటే రోజూ సాయంత్రం వివిధ రకాల స్నాక్స్ చేసుకోవడం మనకు అలవాటే. అయితే వీటిలో చాలా మటుకు నూనెలో వేయించేవే ఉంటాయి. మరి వాటిని డీప్ ఫ్రై చేశాక టిష్యూ షీట్స్‌లో వేయడం లేదంటే నేరుగా గిన్నెలో వేసేయడం చాలామంది చేసే పని. ఫలితంగా ఆ ఆయిల్ టిష్యూకు అంటుకోవడం, గిన్నెలో వృథాగా పోవడం జరుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే 'ఆయిల్ స్ట్రెయినర్' మీ ఇంట్లో ఉండాల్సిందే! ఫొటోలో చూపించినట్లుగా కర్వీగా ఉండే రంధ్రాలతో కూడిన ఈ మల్టీ లేయర్ స్టీల్ ప్లేట్‌కు ఇరువైపులా హ్యాండిల్స్ ఉంటాయి. అలాగే మధ్యభాగంలో హోల్డర్స్ ఉంటాయి. ఆ హోల్డర్స్‌ని రెండు చేతులతో లాగడం వల్ల ఆ లేయర్స్ ఒక దాని పక్కన మరొకటి వచ్చి ఇలా బౌల్ మాదిరిగా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెపై ఉంచి.. అందులో ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన వంటకాల్ని కాసేపు ఉంచడం వల్ల నూనె కింద ఉన్న గిన్నెలోకి పడిపోతుంది. తద్వారా ఆ నూనెను ఏదైనా కూర చేసేటప్పుడు ఉపయోగించుకోవచ్చు. అలాగే ఆ స్నాక్స్‌కి ఎక్కువ నూనె కూడా పట్టుకోదు. ఇలా నూనె వృథా కాకుండా, దీన్ని సులభంగా వేరు చేసే ఈ స్ట్రెయినర్ నాణ్యత, డిజైన్‌ను బట్టి దీని ధర రూ. 199 నుంచి రూ. 1,029 వరకు ఉంది.

రైస్ వాషింగ్ బౌల్
బియ్యం కడగడమనేది మనం రోజూ కిచెన్‌లో చేసే అతి ముఖ్యమైన పనుల్లో ఒకటి. అయితే ఈ క్రమంలో కడిగిన నీళ్లను వేరు చేసేటప్పుడు ఆ నీళ్లతో పాటు కొన్ని బియ్యం కూడా సింక్‌లో పడిపోవడం మనం గమనిస్తుంటాం. అయితే ఇలా బియ్యం కింద పడిపోకుండా నీటిని వంపేయాలంటే 'రైస్ వాషింగ్ బౌల్'ని మీ కిచెన్‌లో చేర్చుకోవాల్సిందే! ఫొటోలో చూపించినట్లుగా ఉండే ఈ వెడల్పాటి బౌల్‌కు కింది వైపు చిన్న చిన్న రంధ్రాలుంటాయి. పైవైపు బియ్యం కడిగి ఆ నీటిని కిందికి వంచడం వల్ల ఆ రంధ్రాల నుంచి నీళ్లు సింక్‌లో పడిపోతాయి. ఈ క్రమంలో ఒక్క బియ్యపు గింజ కూడా కింద పడకుండా ఉండేందుకు వీలుగా బౌల్ అంచు మరింత పెద్దగా, వెడల్పుగా ఉంటుంది. ఇలా బియ్యం కడిగే పనిని మరింత సులభతరం చేసే ఈ బౌల్ నాణ్యత, రంగును బట్టి దీని ధర రూ. 89 నుంచి రూ. 399 వరకు ఉంది.

టీ బాల్ స్ట్రెయినర్
ఈ రోజుల్లో చాలామంది ఇన్‌స్టంట్‌గా తయారుచేసుకునే టీ, కాఫీలనే ఆశ్రయిస్తున్నారు. ఇందుకోసం టీ బ్యాగ్స్‌ని ఉపయోగిస్తున్నారు. మరి, టీ బ్యాగ్స్ కాకుండా విడిగా ఉండే తేయాకు పొడితో ఇన్స్టంట్ టీ తయారుచేసుకోలేమా? అంటే.. ఈజీగా చేసుకోవచ్చు.. అంటూ మన ముందుకొచ్చేసింది 'టీ బాల్ స్ట్రెయినర్'. ఫొటోలో చూపించినట్లుగా అచ్చం బాల్ మాదిరిగా ఉండే ఈ స్ట్రెయినర్కు హ్యాండిల్ ఉంటుంది. దాన్ని కాస్త గట్టిగా నొక్కితే బాల్ రెండుగా చీలుతుంది. ఇందులో కావాల్సినంత టీ పొడిని ఉంచి హ్యాండిల్‌ను వదిలితే బాల్ మూసుకుపోతుంది. ఇప్పుడు దీన్ని వేడి నీరు లేదా పాల కప్పులో పెట్టి కొన్ని సెకన్ల పాటు ఉంచి, తీసేస్తే సరి.. వేడి వేడి టీ సిద్ధమవుతుంది. ఇలా ఈ స్ట్రెయినర్ను ఉపయోగించి ఎంతో సులభంగా, ఇన్‌స్టంట్‌గా టీ తయారుచేసుకోవచ్చు. ఈ స్ట్రెయినర్ డిజైన్, నాణ్యతను బట్టి దీని ధర రూ. 84 నుంచి రూ. 510 వరకు ఉంది.

పాస్తా స్ట్రెయినర్ క్లిప్
పాస్తా, నూడుల్స్‌తో పాటు కొన్ని రకాల కాయగూరల్ని వండే ముందు ఉడికించడం మనకు తెలిసిందే. అయితే వాటిని ఉడికించడం వరకు బాగానే ఉంది కానీ ఆ ఉడికించిన నీటిని వడకట్టేటప్పుడు ఆయా పదార్థాలు సింక్‌లో పడిపోతుంటాయి. అలా జరగకుండా ఉండాలంటే నీటిని వంపే ముందు ఆ పాత్రలకు 'స్ట్రెయినర్ క్లిప్'ను అమర్చితే సరి. ఫొటోలో చూపించినట్లుగా ముందు భాగంలో కాస్త కర్వీగా ఉండి.. రంధ్రాలుండే ఈ స్ట్రెయినర్కు ఇరువైపులా క్లిప్పులుంటాయి. వాటిని పాత్రకు తొడిగి ఆపై నీటిని వంపేస్తే అందులోని పదార్థాలు కింద పడకుండా జాగ్రత్తపడచ్చు. ఇలా సులభంగా ఉడికించిన పదార్థాల నుంచి నీటిని వేరు చేస్తుందీ స్ట్రెయినర్. దీని నాణ్యతను బట్టి ధర రూ. 285 నుంచి రూ. 1,692 వరకు ఉంది.

ఫ్లోర్ సిఫ్టర్
గోధుమ, మైదా, శెనగపిండి.. వంటి వాటిని వాడే ముందు జల్లించుకోవడం కామన్. అయితే వీటిని ఎక్కువ మొత్తాల్లో జల్లించుకోవాలంటే కాస్త కష్టంతో కూడుకున్న పనే. అయితే ఈ పనిని మరింత సులభతరం చేస్తుంది 'ఫ్లోర్ సిఫ్టర్'. ఫొటోలో చూపించినట్లుగా మగ్లాగా ఉంటుందీ సిఫ్టర్. అడుగున గుండ్రంగా తిరిగే జాలీ లాంటి అమరిక ఉంటుంది. హ్యాండిల్ దగ్గర వత్తడానికి మరో అమరిక ఉంటుంది. ఇప్పుడు పిండిని ఈ మగ్‌లో పోసి హ్యాండిల్‌ని ప్రెస్ చేస్తూ, వదులుతూ ఉండడం వల్ల అడుగున ఉండే జాలి గుండ్రంగా తిరుగుతుంది. ఈ క్రమంలో పిండి మనం కింద అమర్చిన గిన్నె లేదా బౌల్లో పడుతుంది. ఇలా ఈజీగా కావాల్సినంత పిండిని జల్లించుకోవచ్చు. పిండి జల్లించుకునే పనిని మరింత సులభతరం చేసిన ఈ సిఫ్టర్ డిజైన్, నాణ్యతను బట్టి దీని ధర రూ. 232 నుంచి రూ. 769 వరకు ఉంది.