దీపావళి... మన జీవితాల్లోని చీకట్లను పారదోలి వెలుగులను నింపే పండగ. టపాసుల మోతలు, దివ్వెల వెలుగుజిలుగుల మధ్య ప్రతిఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఈ పండగను ఆనందంగా జరుపుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. వేడుకల్లో భాగంగా చాలామంది ఒక్కరోజుతో ఆగకుండా రెండు, మూడు రోజుల పాటు టపాసులు కాలుస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మునుపటిలా లేవు. కరోనా కారణంగా పండగల సందడి తీరు మారింది. అసలే చలికాలం, అమాంతంగా పెరిగిపోతున్న వాయు కాలుష్యం, పైగా కోరలు చాస్తోన్న కరోనా...ఇలాంటి పరిస్థితుల్లో టపాసుల వినియోగానికి సంబంధించి పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ‘పండగలే కాదు...ప్రాణాలూ ముఖ్యమే’ అంటూ సుప్రీంకోర్టు కూడా ఈ ఆంక్షలను సమర్థించింది. మరి కరోనా వేళ ఆనందాన్ని కోల్పోకుండా దీపావళిని సెలబ్రేట్ చేసుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం రండి...

టపాసులు వద్దు... దీపాలే ముద్దు!
సాధారణంగా దీపావళి అనగానే టపాసులే గుర్తొస్తాయి. చిన్నా, పెద్దా, ఆడ, మగ..అనే తేడాలు లేకుండా ఆనందంతో చిందులేస్తూ టపాసులు కాల్చడానికి ఆసక్తి చూపుతుంటారు. కానీ వాటి వల్ల వాతావరణ కాలుష్యం ఎక్కువైపోతుందని ఎన్నో ఏళ్ల నుంచి పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా ప్రస్తుతం దేశమంతా కరోనా విలయతాండవం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో దీపావళి టపాసుల నుంచి వెలువడే పొగతో కాలుష్యం ఏర్పడి కొవిడ్ మరింత వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. దీంతో చాలా రాష్ట్రాలు ఇప్పటికే టపాసులపై నిషేధం విధించాయి. మరికొన్ని రాష్ట్రాలు మాత్రం స్వల్ప స్థాయిలో పొగ విడుదలయ్యే కాకరపువ్వొత్తుల వంటి చిన్న చిన్న టపాసులు కాల్చవచ్చని మినహాయింపులు ఇస్తున్నాయి. ఈ క్రమంలో సాధ్యమైనంతవరకు టపాసుల జోలికే వెళ్లకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. టపాసుల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలతో ఆస్తమా, ఉబ్బసం, బ్రాంకైటిస్... తదితర దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు తీవ్ర ముప్పు పొంచి ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ రసాయన ఉద్గారాలు ఊపిరితిత్తుల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కొవిడ్ లాంటి శ్వాస సంబంధిత రోగాలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి టపాసులతో కాకుండా దీపాల కాంతులతో పండగ జరుపుకోవడం ఉత్తమం. అందమైన ప్రమిదలు, రంగురంగుల పూలు, ముగ్గులు, దీపాలతో మీ ఇంటిని అలంకరించుకోండి. టపాసుల ధగధగ కాంతుల కంటే మీ ఇల్లే దేదీప్యమానంగా వెలిగిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
వీరు ఇంట్లోనే ఉంటే మంచిది!
వృద్ధులు, గర్భిణులు, చిన్నారులకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. పైగా చలికాలంలో వైరస్ విస్తరణ మరింత పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి వారు వేడుకల్లో పాల్గొనకుండా ఇంట్లో ఉండడమే మంచిది. ఇక ఆస్తమా వంటి ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు, మానసిక జబ్బులు ఉన్న వారు టపాసుల శబ్దాలకి, పొగకి వీలైనంత దూరంగా ఉండాలి.

శానిటైజర్‌తో జాగ్రత్త!
అందమైన ప్రమిదలు, దీపాల కాంతులు ఇంటికి పండగ కళను తీసుకొస్తాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దీపాలను వెలిగించేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ శానిటైజర్ రాసుకుని దీపాలు, కొవ్వొత్తులు వెలిగించొద్దు. ఎందుకంటే ప్రస్తుతమున్న శానిటైజర్లలో చాలావరకు ఆల్కహాల్‌తో కూడుకున్నవే. కాబట్టి చేతులకు శానిటైజర్ రాసుకుని టపాసులు కాల్చడం, దీపాలు వెలిగించడం వంటి పనులు అసలు చేయద్దు. ఇక టపాసులు కాల్చిన తర్వాత కూడా సబ్బుతోనే చేతులు కడుక్కోవాలి. ఇంట్లో కూడా ఎక్కడపడితే అక్కడ శానిటైజర్ బాటిళ్లను ఉంచకండి. వంటగదితో పాటు దీపాలకు దూరంగా వీటిని ఉంచడం మంచిది.
పేపర్ సోప్ వాడండి!
వ్యక్తిగత పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ప్రతి ఒక్కరూ శానిటైజర్ వినియోగిస్తున్నారు. అయితే దీనిని అతిగా వాడితే మొదటికే మోసం వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శానిటైజర్‌కు బదులుగా పేపర్ సోప్‌ను వినియోగించడం మేలని వారు సూచిస్తున్నారు. బయటకు వెళ్లిన ప్రతిసారీ శానిటైజర్‌ను వెంట తీసుకెళ్లలేం కాబట్టి పేపర్ సోపే మంచి ప్రత్యామ్నాయం. దీనితో సులభంగా చేతులు శుభ్రం చేసుకోవచ్చు. పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

సామాజిక దూరం తప్పనిసరి!
పండగలంటేనే పదిమందితో కలిసి చేసుకునేవి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి హంగామాకు దూరంగా ఉండడమే మంచిది. ఒకవేళ తప్పదనిపిస్తే తక్కువమంది సమక్షంలో సెలబ్రేషన్స్ చేసుకోవాలి. ఒకవేళ ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం... వంటి అనారోగ్యాలుంటే ఇంట్లోనే ఉండడం మేలు. అలాగే ఇటీవల కరోనా నుంచి కోలుకున్న వారు ‘మాకు ఎలాగూ నెగెటివ్ వచ్చింది కదా... మాకేం కాదు..!’ అన్న నిర్లక్ష్యంతో గుంపులోకి వెళ్తే మరోసారి ముప్పు తెచ్చుకున్నట్లే.
అయితే ఎంత తక్కువమంది ఉన్నా సరే... సామాజిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం, ఎప్పటికప్పుడు చేతులు శానిటైజ్ చేసుకోవడం...వంటి జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి. ఇక ఆప్యాయంగా హత్తుకోవడాలు, కరచాలనాలు, కలిసి ఫొటోలు దిగడాలు వంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
బయటి ఆహారం వద్దు!
ఓవైపు చలికాలం, మరోవైపు కరోనా...ఇలాంటి పరిస్థితుల్లో బయటి నుంచి భోజనం తెప్పించడం కంటే ఇంట్లోనే వంట చేసుకోవడం మేలు. ఆహారం నుంచి కరోనా సోకుతుందనేందుకు ఎలాంటి సైంటిఫిక్ ఆధారాలు లేవు. అయితే బయటి నుంచి తీసుకొచ్చిన ఆహార నాణ్యత ఎలాంటిదో ఎవరూ ఊహించలేరు. దీంతో చాలామందికి కడుపునొప్పితో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంట్లోనే పరిశుభ్రమైన వాతావరణంలో తగిన నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పిండి వంటలు చేసుకునేలా ప్లాన్ చేసుకోండి. వీటితో పాటు సి-విటమిన్, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, ఇతర పోషకాలున్న వంటలకు ప్రాధాన్యమిస్తే ఆనందంతో పాటు ఆరోగ్యం కూడా సొంతమవుతుంది. అలాగే వంట చేసే వారు తప్పనిసరిగా మాస్క్, చేతులకు గ్లౌజులు ధరించాలి. అలాగే భోజనం చేసే సమయంలో కూడా అందరూ ఒకే చోట చేరి మాట్లాడుకోవద్దు. ఎందుకంటే ఆ సమయంలో మాస్క్ తొలగిస్తాం కాబట్టి వైరస్ విస్తృతికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే కాస్త ఎడం పాటిస్తూ దూరం దూరంగా కూర్చొని తినాలి.

పెట్స్ జాగ్రత్త!
సాధారణంగా కుక్కల్లాంటి పెంపుడు జంతువులు మంటలను చూసి భయపడతాయి. టపాసుల శబ్దాలు వాటిని మరింత భయభ్రాంతులకు గురిచేస్తాయి. పైగా వాటికి వాసన పీల్చే సామర్థ్యం కూడా అధికంగా ఉండడంతో పొగకు ఉక్కిరిబిక్కిరి అయ్యే ప్రమాదముంది. అందుకే పండగ రోజు పెంపుడు జంతువులను శబ్దాలు వినిపించని గదిలో కట్టేసి ఉంచడం మంచిది. ఇంట్లో వెలిగించే దీపాలు, ప్రమిదలకు కూడా వాటిని దూరంగా ఉంచాలి. లేకపోతే అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రమాదముంది.
సో... కరోనా వేళ ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ అటు దీపావళి పండగను ఎంజాయ్ చేయండి... ఇటు ఆరోగ్యాన్ని కాపాడుకోండి..!
అందరికీ దీపావళి శుభాకాంక్షలు!