మృదుల ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో తన వెంటే ఓ శానిటైజర్ బాటిల్‌ని తీసుకెళ్తుంటుంది. అయితే ఓ రోజు హడావిడిలో బాటిల్ మర్చిపోయి ఆఫీసుకెళ్లింది. ఇక ఆ రోజంతా ఏది ముట్టినా, పట్టినా చేతులు కడుక్కుంటూ విసుగెత్తిపోయిందామెకు.
సృజన రోజూ బైక్ మీదే ఆఫీసుకెళ్తుంటుంది. అక్కడక్కడా సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు చేతుల్ని శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటుంది. అయితే అది పాకెట్ శానిటైజరే అయినా బ్యాగులో ఏదో ఓ మూల పడిపోయి అస్సలు దొరకట్లేదామెకు. ఇలా చాలాసార్లే వెతికింది సృజన.
ఇలాంటి అనుభవాలు మనకూ కామనే. ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో అందరూ తమ వెంట ఓ శానిటైజర్ బాటిల్‌ని ఉంచుకోవడం తప్పనిసరైంది. అయితే దాన్ని మన హ్యాండ్‌బ్యాగ్‌లో వేస్తే అది ఏదో ఒక మూలన పడిపోయి.. అప్పుడప్పుడూ ఎంత వెతికినా దొరకదు. మరి, అలాంటి సమస్య రాకుండా ఉండాలంటే ‘హోల్డర్ శానిటైజర్స్’ అందుకు చక్కటి మార్గం. పాకెట్ శానిటైజర్స్ మాదిరిగానే ఉండే వీటికి బ్యాగ్‌కు తగిలించుకోవడానికి వీలుగా హోల్డర్స్ అమరి ఉంటాయి. ఎంచక్కా వాటిని మన హ్యాండ్‌బ్యాగ్ లేదా జిప్ రంధ్రానికి వేలాడదీస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు మన చేతుల్ని శానిటైజ్ చేసుకోవచ్చు.. అంతేకాదు.. ఇవి బ్యాగ్‌కు స్టైలిష్ లుక్‌ని సైతం అందిస్తాయి. మరి, అలాంటి హోల్డర్ శానిటైజర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి..
శానిటైజర్ పౌచ్
సాధారణంగా మనం ఆఫీస్‌కి లేదంటే షాపింగ్‌కి వెళ్లినప్పుడు మన వెంట తీసుకెళ్లే మొబైల్‌ని బ్యాగ్‌లో పెట్టేస్తుంటాం. అదే మన ఇంటికి దగ్గర్లోని కిరాణా కొట్టు, మార్కెట్‌కి వెడితే చిన్న పౌచ్‌లో ఫోన్, డబ్బులు పెట్టేసుకొని వెళ్లిపోతాం. ఈ క్రమంలో ‘దగ్గర్లో ఉండే షాప్కేగా.. శానిటైజర్ లేకపోతే ఏంటి?’ అని నిర్లక్ష్యం చేస్తుంటారు కొందరు. అయితే అది మోసుకెళ్లడం అంత ఇబ్బందిగా అనిపిస్తే.. మీ పౌచ్ జిప్ లేదా మీ డ్రస్ హుక్స్‌కి తగిలించుకొని వెళ్తే సరి! అలాంటి శానిటైజర్ బాటిలే ఇది!

ఫొటోలో చూపించిన విధంగా మినీ పౌచ్లా ఉన్న దీనిలో ఒక మినీ శానిటైజర్ బాటిల్ కూడా ఉంటుంది. ఈ పౌచ్కి బ్యాగ్‌కు తగిలించుకునే విధంగా ఓ హోల్డర్ కూడా అమరి ఉంటుంది. బాటిల్లో శానిటైజర్ నింపుకొని దాన్ని మీ బ్యాగ్ లేదా పౌచ్‌కు వేలాడదీసుకుంటే అది ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది. మర్చిపోవడం, నిర్లక్ష్యం చేయడమన్న మాటే రాదు! ఇలాంటి శానిటైజర్ పౌచ్‌లు ప్రస్తుతం మార్కెట్లో విభిన్న డిజైన్లలో లభ్యమవుతున్నాయి. వాటి డిజైన్, ఫ్యాబ్రిక్‌ను బట్టి రెండు పౌచ్‌ల ధర రూ. 229 గా ఉంది.
పౌచ్‌లో దూరిపోయి..
బ్యాగ్‌కు వేలాడదీసుకునేదే అయినా.. పౌచ్‌లో నుంచి బాటిల్‌ను తీసి చేతుల్ని శానిటైజ్ చేసుకోవడానికి కూడా కొంతమంది బద్ధకిస్తుంటారు. అలాంటి వారి కోసమే మరో శానిటైజర్ పౌచ్‌ని తయారుచేశారు.
ఫొటోలో చూపించినట్లుగా ఇంతకుముందు మాదిరిగానే పౌచ్లా ఉండి.. బాటిల్ ముందు భాగం పౌచ్ నుంచి బయటికి వచ్చినట్లుగా ఉంటుందిది. ఇక వెనక వైపు బ్యాగ్‌కి తగిలించుకునే విధంగా హోల్డర్ ఉంటుంది. ఈ పౌచ్‌ను హ్యాండ్‌బ్యాగ్‌కు తగిలించుకొని పౌచ్ తెరిచే పనిలేకుండానే చేతుల్ని శానిటైజ్ చేసుకోవచ్చు. ఇలాంటి పౌచ్‌లు సైతం విభిన్న ఫ్యాబ్రిక్స్‌తో, ప్రింట్స్‌తో ప్రస్తుతం మార్కెట్లో సందడి చేస్తున్నాయి. వాటి డిజైన్‌ను బట్టి ధర రూ. 129గా ఉంది.
బ్యాగ్ ట్యాగ్ హ్యాండ్ శానిటైజర్ మిస్ట్
హ్యాండ్‌బ్యాగ్‌కు ఏదో ఒక కీచెయిన్ తగిలించడం మనలో చాలామందికి అలవాటే. ఈ క్రమంలో కొందరు స్టైల్ కోసం కీచెయిన్ వేలాడదీస్తే.. మరికొందరు బ్యాగ్ బోసిగా ఉందని తగిలిస్తుంటారు. అయితే ఏదేమైనా ప్రస్తుత కరోనా కాలంలో అలాంటి కీచెయిన్‌కి బదులుగా ఈ ‘బ్యాగ్ ట్యాగ్ హ్యాండ్ శానిటైజర్ మిస్ట్’ని వేలాడదీయండి. ఒకవేళ బ్యాగ్ తీసుకెళ్లే పని లేకపోతే మీ బైక్ కీచెయిన్‌కి కూడా దీన్ని వేలాడదీసి మీ వెంటే ఉంచుకోవచ్చు.

ఫొటోలో చూపించినట్లుగా ఉన్న ఈ శానిటైజర్ బాటిల్ మూతకు హోల్డర్ మాదిరిగా లూప్ హుక్ అమరి ఉంటుంది. దాని సహాయంతో ఈ బాటిల్‌ను మీరు మీ బ్యాగ్ లేదా వ్యాలెట్‌కి తగిలించుకోవచ్చు. కావాల్సినప్పుడు మూత తీసి ఉపయోగించుకుంటే సరి! ఈ మినీ శానిటైజర్ బాటిల్ ధర రూ. 99 నుంచి రూ. 294 గా ఉంది.
పిల్లల కోసం ప్రత్యేకంగా!
పిల్లలు ఏదైనా చెప్తే ఓ పట్టాన వినరు. ప్రస్తుత పరిస్థితుల్లోనూ వారిని బయటికి వెళ్లనీయకుండా, ఇంట్లో ఉన్నా శుభ్రంగా ఉంచేందుకు తల్లులు తలలు పట్టుకుంటున్నారు. ఏదైనా ముట్టినా, పట్టినా శానిటైజర్ రాసుకోమంటే ఆ మాటల్ని పెడచెవిన పెడుతున్నారు. అలాంటి వారికోసం మార్కెట్లో సరికొత్త హోల్డర్ శానిటైజర్స్ వచ్చేశాయి. ఎంతైనా పిల్లలందరికీ కార్టూన్ క్యారక్టర్స్ అంటే ఎంతో ఇష్టం. అందుకే అలాంటి ముద్దుముద్దు బొమ్మల రూపంతో హోల్డర్స్ మాదిరిగా రూపొందించిన శానిటైజర్ బాటిల్స్ భలే ఆకట్టుకుంటున్నాయి.

ఫొటోలో మీరు చూస్తున్నవి అలాంటి స్ప్రే బాటిల్సే! సాధారణ శానిటైజర్ బాటిల్స్కే ముందు భాగంలో కార్టూన్ క్యారక్టర్స్, స్మైలీస్, ఇతర బొమ్మల రూపంలో ఉన్న హోల్డర్స్‌ని అమర్చుకోవచ్చు. ఇప్పుడెలాగో పిల్లలందరూ ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి శానిటైజర్ నింపిన ఆ బాటిల్స్‌ని వారి డ్రస్ హుక్స్‌కి, షర్ట్ బటన్స్‌కి తగిలించేస్తే సరి! అయితే ఇంట్లో ఉన్నప్పుడు కూడా పదే పదే శానిటైజర్ వాడడం సరికాదు. కాబట్టి వారు మరీ ఎక్కువగా ఉపయోగించకుండా, అత్యవసరమైనప్పుడే వాడేలా మీరే వారికి వివరించి చెప్పాలి. లేదంటే ఎంత పడితే అంత శానిటైజర్‌ని ఉపయోగిస్తే లేనిపోని అనారోగ్యాలు కొనితెచ్చుకున్న వారవుతారు. ఈ తరహా శానిటైజర్ బాటిల్స్ (2) ధర రూ. 299గా ఉంది.
పిల్లలే కాదు.. పెద్దలకూ శానిటైజర్ మంచిది కాదు. బయటికి వెళ్లినప్పుడు అన్ని చోట్లా మనకు చేతులు కడుక్కునే వెసులుబాటు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మాత్రమే శానిటైజర్ వాడాలి. అది కూడా మితంగా వాడాలన్న విషయం గుర్తుపెట్టుకోండి!
Photos: Amazon.in