'వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ.. నిర్విఘ్నం కురుమే దేవ.. సర్వకార్యేషు సర్వదా..' అంటూ చేయబోయే కార్యాలకు విఘ్నాలన్నింటినీ తొలగించమని ఆ బొజ్జగణపయ్యను కోరుకునే రోజు వినాయక చవితి.. ఆరోజు ఉదయాన్నే స్నానాదులు పూర్తిచేసుకొని మండపాన్ని చక్కగా అలంకరించి.. వినాయకుడిని అందులో ప్రతిష్టించి, ఏక వింశతి పత్రాలతో పూజ చేస్తాం.. అయితే ఎంత పత్రాలతో పూజించినా.. మన చిట్టిగణపయ్యను పూలతో అలంకరించకుండా ఊరుకుంటామా? లేదు కదూ.. కేవలం పత్రాల్లోనే కాదు.. గణేషుడికి ఇష్టమైన పూలల్లోనూ ఎన్నో ఔషధ గుణాలున్నాయి. మరి, అలాంటి కొన్ని పూల గురించి తెలుసుకుందాం రండి..
మందార పుష్పం..

ఎర్ర మందారాలతో పార్వతీ తనయుడిని పూజిస్తే.. చూడడానికి మండపం అందంగా మారిపోతుంది. మందార పూలతో దండ గుచ్చడమో.. లేక విడిగానే ఈ పూలతో మండపాన్ని అలంకరించడమో చేస్తే ఈ రంగు అలంకరణ ఇంటికే సరికొత్త శోభ తీసుకొస్తుంది. అంతేకాదు.. ఇలా పూజించిన తర్వాత మిగిలిన మందార పుష్పాలను ఉపయోగించి అందాన్ని, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. మందార పుష్పాలను రుబ్బి కురులకు పట్టించి, ఓ అరగంటాగి తలస్నానం చేస్తే జుట్టు ఒత్తుగా మారుతుంది. లేదా వాటిని ఎండబెట్టి అవి ఎండిన తర్వాత పొడిచేసి దాన్ని నూనెలో కలిపి కురులకు ఉపయోగించవచ్చు.
అర్క పుష్పం

సాధారణ భాషలో దీన్నే జిల్లేడు పువ్వుగా పిలుస్తాం. శివుడికే కాదు.. వినాయకుడికి కూడా ప్రీతిపాత్రమైన పుష్పం ఇది. రకరకాల వ్యాధుల్ని నయం చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. విషపురుగులు కరిచినప్పుడు విషానికి విరుగుడుగా, చర్మవ్యాధులు, గాయాల నుంచి విముక్తి కలిగించడానికి ఇది ఉపయోగపడుతుంది. వీటితో అందమైన దండలు అల్లి గణేషుడి మెడలో వేస్తే ఇటు అందానికి అందం, అటు ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా.
దాడిమీ పుష్పం

దీన్నే దానిమ్మ పువ్వుగా పిలుస్తాం. సాధారణంగా దానిమ్మ కాయల గురించే మనకు తెలుసు. అయితే దాని పువ్వుల్లో కూడా మంచి ఆయుర్వేద గుణాలుంటాయి. నీళ్ల విరేచనాలు, నోటిపూత తగ్గించడానికి దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ పుష్పాలతో వినాయకుడిని అభిషేకిస్తే చాలా అందంగా ఉంటుంది.
క్రౌంచ్య పుష్పం

సాధారణంగా శంఖు పుష్పం అని పిలిచే ఈ తెలుపు, నీలం రంగు పూలతో అలంకరిస్తే మండపమంతా మెరిసిపోతుంది. ఈ పూలు కేవలం అలంకరణకు మాత్రమే కాదు.. ఎన్నో వ్యాధులను దూరం చేయడంలోనూ ఉపయోగపడతాయి. ఆందోళన, ఎక్కువగా చెమటలు పట్టడం, తలనొప్పి, మైగ్రెయిన్ వంటివన్నీ తగ్గించే గుణాలు ఇందులో ఉన్నాయి.
దతూర పుష్పం(ఉమ్మెత్త)

కేవలం ఉమ్మెత్త ఆకు మాత్రమే కాదు.. పువ్వులు కూడా మంచి ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ పూలన్నా వినాయకుడికి ఇష్టమే. వీటిని అలంకరణకు వాడితే పెద్ద పెద్ద పూలతో మండపం ఆకర్షణీయంగా తయారవుతుంది. కీళ్లనొప్పులు, విషపురుగుల కాటు, చర్మ సంబంధ సమస్యలను తగ్గించడం కోసం ఈ పూలను ఉపయోగిస్తుంటారు. జుట్టు పెరగడానికి కూడా ఇవి బాగా తోడ్పడతాయి.
వకుల పుష్పం

సువాసనభరితమైన ఈ పుష్పాలతో మాలలు కట్టి వినాయకుడి మెడలో వేస్తే ఇళ్లంతా మంచి వాసనతో నిండిపోవడమే కాదు.. అందంగానూ కనిపిస్తుంది. ఈ పూలను దంతాలు, చిగుళ్ల సమస్యలు తగ్గించడంలో ఉపయోగిస్తారు. రక్తస్రావాన్ని ఆపే మందుగా (యాస్ట్రింజెంట్గానూ) వాడే ఈ పూల వల్ల చలువ చేస్తుందట.
పద్మ పుష్పం

అందమైన పూలలో ఒకటి కలువ పువ్వు. నీటిపై మెరిసే ఈ పూలను కూడా వినాయకుడిని అలంకరించడానికి ఉపయోగించవచ్చు. పైగా ఈ పూలంటే గణనాథునికి ఎంతో ప్రీతి. రక్తస్రావాన్ని ఆపి, ఆ సమయంలో వచ్చే నొప్పి తగ్గించే గుణాలు ఈ పుష్పంలోనూ ఉంటాయి. అలాగే మూత్ర సంబంధ సమస్యలను కూడా ఇది నివారిస్తుంది.
చూశారుగా.. వినాయకుడికి ఇష్టమైన కొన్ని పుష్పాలు.. వాటిలోని ఔషధ గుణాలు.. ఇవే కాదు.. చామంతి, గన్నేరు, పారిజాతం, కదంబం, పున్నాగ.. వంటి పుష్పాలను ఉపయోగించి కూడా వినాయకుడికి అలంకరణ చేయవచ్చు.