ఈ కరోనా ఏమో గానీ రోజులో ఎక్కువ సమయం శానిటైజేషన్‌కే సరిపోతోంది మన మహిళలకు. ఇక వృత్తి ఉద్యోగాల రీత్యా బయటికి వెళ్లొచ్చే అతివల సంగతైతే చెప్పక్కర్లేదు. అసలే ఓవైపు ఇంటి పనులతో తీరికే దొరకదంటే.. మరోవైపు తమతో పాటు తీసుకెళ్లిన వస్తువులన్నీ శానిటైజ్ చేసేసరికి వారికి తల ప్రాణం తోకకొస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ క్రమంలో ఒక్కోసారి విసుగొచ్చి ‘ఇక ఈ శానిటైజేషన్ నా వల్ల కాదు.. ఏదైతే అదైంది..’ అనుకొని వాటిని పక్కన పడేసేవారూ లేకపోలేదు. కానీ ఈ ప్రతికూల పరిస్థితుల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కాబట్టి కాస్త ఓపిక తెచ్చుకొని ప్రతి వస్తువునూ శానిటైజ్ చేసుకోవాలి. అయితే అందుకు కూడా పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంట్లోని ప్రతి వస్తువునూ శానిటైజ్ చేయడానికి విభిన్న డిస్-ఇన్ఫెక్టెంట్ గ్యాడ్జెట్స్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరల్లోనే లభించే ఆయా పరికరాల్ని ఒకసారి కొని ఇంటికి తెచ్చుకున్నామంటే ఏ వస్తువునైనా నిమిషాల్లో శుభ్రం చేసేసుకోవచ్చు. మరి, ఇంతకీ ఏంటా గ్యాడ్జెట్స్? అవి ఎలా పనిచేస్తాయి? రండి తెలుసుకుందాం...
శానిటైజర్ పోర్టబుల్ బాక్స్
మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లినా నిరంతరం మనతో పాటే ఉండే వస్తువేదైనా ఉందంటే అది మొబైల్ ఫోనే! అంతలా మనందరం మొబైల్‌కి కనెక్టయిపోయాం! అయితే దీన్ని విభిన్న రకాలుగా ఉపయోగించుకోవడం వరకు బాగానే ఉంటుంది కానీ శానిటైజ్ చేయడమే పెద్ద పని అంటారా? ఇకపై అంత శ్రమ కూడా అక్కర్లేదు. ఎందుకంటే మొబైల్‌ని నిమిషాల్లో శానిటైజ్ చేయడానికి ‘శానిటైజర్ పోర్టబుల్ బాక్స్’ ప్రస్తుతం మార్కెట్లో సందడి చేస్తోంది.

ఫొటోలో చూపించినట్లుగా ఇది అచ్చం మొబైల్ ప్యాక్ చేసిన బాక్స్లా కనిపిస్తుంది. ఆ మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశంలో మొబైల్‌ని పెట్టుకోవడానికి వీలుంటుంది. దీనికి లోపలి వైపు ఇరువైపులా అతినీల లోహిత కాంతి ప్రసరించేలా బల్బుల్ని అమర్చారు. ఇప్పుడు మొబైల్‌ని ఈ బాక్స్‌లో ఉంచి.. మూత పెట్టేసి.. దాని కింద ఉన్న మొదటి బటన్ని నొక్కాలి. ఆపై అందులోని యూవీ లైట్స్ సహాయంతో మొబైల్ వైరస్ రహితంగా మారుతుంది. అంతేకాదు.. ఈ బాక్స్‌లోపల పైభాగంలో కాస్త అరోమా ఆయిల్ వేసి రెండో బటన్ని నొక్కితే అటు మొబైల్ శానిటైజ్ కావడంతో పాటు ఇటు సువాసనలు కూడా వెదజల్లుతుంది. ఇలా ఈ శానిటైజ్ పోర్టబుల్ బాక్స్ సహాయంతో కొన్ని నిమిషాల్లోనే ఫోన్‌ని శుభ్రం చేసుకోవచ్చు. ఇందులోనూ బ్యాటరీ సహాయంతో పని చేసేవి, యూఎస్బీ కనెక్ట్ చేసేవి.. ఇలా రెండు రకాలుంటాయి. వాటి నాణ్యత, డిజైన్ని బట్టి ఈ పోర్టబుల్ బాక్స్ ధర రూ. 1,299 నుంచి రూ. 2,599 వరకు ఉంది.
స్టెరిలైజర్ వాండ్
ఈ కరోనా ప్రతికూల పరిస్థితుల్లో మనతో పాటు బయటికి తీసుకెళ్లిన వస్తువులే కాదు.. ఇంట్లో ఏ ఉపరితలాన్ని ముట్టుకున్నా.. వాటిని శానిటైజ్ చేయాల్సి వస్తోంది. అలాగని మనం రోజూ వాడే పరుపులు, దిండ్లు, సోఫాసెట్స్, డైనింగ్ టేబుల్.. వంటి పెద్ద పెద్ద వస్తువుల్ని శానిటైజర్‌తో శుభ్రం చేయడమంటే పెద్ద పని. అలాకాకుండా ‘స్టెరిలైజర్ వాండ్’ ఆ పనిని చాలా సులభతరం చేస్తుంది.

ఫొటోలో చూపించినట్లుగా చూడ్డానికి అచ్చం స్లైడ్ ఫోన్లా ఉంటుందిది. దీన్ని ఓపెన్ చేస్తే పైభాగంలో అతినీలలోహిత కిరణాలు వెలువడే పొడవాటి బల్బులు అమరి ఉంటాయి. ముందుగా దీన్ని యూఎస్బీతో పూర్తిగా ఛార్జింగ్ చేసి.. ఆపై ఈ పరికరానికి పక్కభాగంలో ఉన్న ‘ఆన్’ బటన్ని నొక్కితే బల్బుల్లోంచి యూవీ లైట్ ప్రసరిస్తుంది. అలా దాంతో ఇంట్లోని ప్రతి ఉపరితలాన్ని నిమిషాల్లో శుభ్రం చేసేసుకోవచ్చు.. భలే ఉంది కదూ ఈ గ్యాడ్జెట్! దీని నాణ్యత, ఆకృతిని బట్టి ధర రూ. 1,099 నుంచి రూ. 2,950 వరకు ఉంటుంది.
ఎలక్ట్రిక్ షూ డ్రయర్
చాలామంది బయటి నుంచి తిరిగొచ్చాక తమతో పాటు తీసుకెళ్లిన అన్ని వస్తువుల్ని శానిటైజ్ చేస్తారు కానీ చెప్పులు, షూస్ మాత్రం అలాగే వదిలేస్తుంటారు. కానీ వాటివల్ల కరోనా వైరసే కాదు.. ఇతర బ్యాక్టీరియా, వైరస్లు కూడా ఇంటి ముంగిట్లోకి వచ్చి చేరతాయి. అందుకు కారణం.. వాటిని నిరంతరం ధరించడం వల్ల లోపలి భాగానికి గాలి తగలక తడిగా అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తడిదనం వాతావరణంలోని బ్యాక్టీరియా, వైరస్‌లను ఇట్టే ఆకర్షిస్తుంది.. తిరిగి వాటిని అలాగే ఉపయోగించడం వల్ల మనకే అపాయం. కాబట్టి షూలు, చెప్పుల లోపలి భాగాల్ని కచ్చితంగా శానిటైజ్ చేయడం లేదంటే ఆరబెట్టడం ఉత్తమం. ఇందుకోసం ‘ఎలక్ట్రిక్ షూ డ్రయర్’ చక్కగా ఉపయోగపడుతుంది.

ఫొటోలో చూపించినట్లుగా అచ్చం మనం ఉపయోగించే కంప్యూటర్ మౌస్ ఆకృతిలో ఉంటుందిది. దీన్ని ఫొటోలో మాదిరిగా షూ లోపల ఉంచి ప్లగ్‌ని సాకెట్‌కు కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేయాలి. దీనికి ఉన్న రంధ్రాల నుంచి వేడి ఉత్పత్తై షూ లోపలి భాగం ఆరిపోవడంతో పాటు దానిలో ఏమైనా బ్యాక్టీరియా, వైరస్, ఇతర క్రిములుంటే నశించిపోతాయి. ఇక షూ బయటి భాగం, కింది భాగాన్ని స్టెరిలైజర్ వాండ్‌తో శానిటైజ్ చేసుకుంటే సరి. ఈ షూ డ్రయర్ (జత) నాణ్యత, డిజైన్‌ను బట్టి ధర రూ. 450 నుంచి రూ. 2,999 వరకు ఉంటుంది.
శానిటైజింగ్ డోర్ మ్యాట్
కరోనా సమయంలో అనే కాదు.. సాధారణంగా బయటి నుంచి ఇంటికొచ్చాక కాళ్లు కడుక్కొని లోపలికి వెళ్లడం మన సంప్రదాయం. అయితే బయట కాళ్లు కడుక్కునే సదుపాయం లేని వాళ్లు అలాగే బాత్రూమ్లోకి వెళ్లడం వల్ల అరికాళ్లకు అంటుకున్న మురికి, బ్యాక్టీరియా, వైరస్లు ఇంట్లోని టైల్స్పైకి చేరతాయి. మరి, ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే ఇంటి గుమ్మం ముందు ఓ ‘శానిటైజింగ్ డోర్ మ్యాట్’ని అమర్చితే సరి.
ఫొటోలో చూపించినట్లుగా ఇది చూడ్డానికి అచ్చం మనం ఉపయోగించే డోర్ మ్యాట్లాగే ఉంటుంది.. కాకపోతే దీనిలో రెండు లేయర్లుంటాయి. కింద రబ్బర్‌తో తయారైన కాస్త మందపాటి లేయర్ ఉంటుంది. ఇది కాస్త లోతుగా ఉంటుంది. డిస్టిల్డ్ వాటర్‌లో విలీనం చేసిన శానిటైజర్‌ని ఈ రబ్బర్ మ్యాట్‌లో నింపి.. దానిపై కాస్త మృదువుగా ఉండే మరో లేయర్‌ని పరచాలి. ఇప్పుడు ఆ మ్యాట్‌పై నిల్చున్నప్పుడు ఆ శానిటైజర్ సాఫ్ట్ లేయర్కి ఉండే రంధ్రాల ద్వారా పైకొచ్చి మన అరికాళ్లను శుభ్రం చేస్తుంది. సో.. బయటే మన అరికాళ్లు క్లీన్ అవుతాయి కాబట్టి ఇప్పుడు నేరుగా బాత్రూమ్లోకి వెళ్లి చేతులు, కాళ్లు శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి డోర్‌మ్యాట్స్ ప్లెయిన్‌వి కాకుండా వివిధ ప్రింటెడ్ డిజైన్లున్నవి, 3-డి తరహావి సైతం ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి. ఈ మ్యాట్ నాణ్యత, డిజైన్‌ను బట్టి ధర రూ. 799 నుంచి రూ. 5,000 వరకు ఉంది.
ఫోల్డబుల్ డిస్-ఇన్ఫెక్షన్ బ్యాగ్
సాధారణంగా బయటి నుంచి ఇంటికొచ్చాక వేసుకున్న డ్రస్ ఒక్కటే ఉతుక్కుంటే సరిపోతుందనుకుంటారు. కానీ దానికి మ్యాచింగ్‌గా ధరించిన యాక్సెసరీస్, హెయిర్ క్లిప్స్.. వంటి వాటి మాటేంటి? వాటిని అలాగే వదిలేయలేం.. అలాగని ఒక్కోదాన్ని శానిటైజ్ చేయాలంటే విసుగొచ్చేస్తుంది. అందుకే అలాంటివన్నీ ఒకేసారి శానిటైజ్ చేసే పరికరమేదైనా ఉంటే బాగుంటుంది కదా!

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ‘ఫోల్డబుల్ డిస్-ఇన్ఫెక్షన్ బ్యాగ్’ అందుకోసం చక్కగా ఉపయోగపడుతుంది. చూడ్డానికి అచ్చం ఇది మన మేకప్ కిట్లా ఉంటుంది. బాక్స్ మూతకు కిందివైపు (అంటే లోపలివైపు) యూవీ లైట్ బల్బులుంటాయి. ఇప్పుడు మనం శానిటైజ్ చేయాలనుకున్న వస్తువులన్నీ ఈ బ్యాగ్‌లో వేసి.. ప్లగ్‌ని సాకెట్‌కి కనెక్ట్ చేసి, స్విచ్ ఆన్ చేయాలి. కొన్ని నిమిషాల్లోనే అందులోని వస్తువులన్నీ చక్కగా శానిటైజ్ అవుతాయి. పని పూర్తయ్యాక ఈ బ్యాగ్‌ని ఫోల్డ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. కాస్త పెద్ద బ్యాగ్ అయితే దుస్తుల్ని, పాత్రల్ని కూడా శానిటైజ్ చేసుకోవచ్చు. ఈ బ్యాగ్ నాణ్యత, పరిమాణం, డిజైన్‌ను బట్టి ధర రూ. 2,499 నుంచి రూ. 5,418 వరకు ఉంటుంది.
డిస్-ఇన్ఫెక్షన్ స్ప్రేయర్
ఇంట్లో ఉన్నా పదే పదే చేతులు కడుక్కోవడం బద్ధకమై ఆల్కహాల్ శానిటైజర్‌నే ఉపయోగిస్తున్నారు చాలామంది. అయితే అందరూ దాన్నే ముట్టుకోవడం వల్ల వైరస్ విస్తరించే అవకాశం ఎక్కువ. కాబట్టి ఆటోమేటిక్ స్ప్రేయర్ తరహాలో ఉండేదైతే మంచిది. అలాంటిదే ఈ ‘డిస్-ఇన్ఫెక్షన్ స్ప్రేయర్’ కూడా!

ఫొటోలో చూపించినట్లుగా ఇది చూడ్డానికి దోమల్ని చంపే మెషీన్లా ఉంటుంది. దీనికి కింది వైపు ఉన్న బాటిల్లో శానిటైజర్‌ని నింపి.. తిరిగి అమర్చాలి. వాడే ముందు దీన్ని పూర్తిగా ఛార్జింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ముందు భాగంలో ఉన్న బటన్ని నొక్కాలి. ఇప్పుడు దీని పైభాగంలో ఉండే రంధ్రం దగ్గర చేయి ఉంచగానే శానిటైజర్ పైకి చిమ్ముతుంది. చేయి తీసేయగానే స్ప్రే చేయడం ఆపేస్తుంది. అంటే సెన్సర్ మాదిరిగా పనిచేస్తుందిది. సో.. దాన్ని తాకే పని లేకుండానే మనం చేతుల్ని శుభ్రం చేసుకోవచ్చు. ఈ స్ప్రేయర్ నాణ్యత, ఆకృతిని బట్టి ధర రూ. 1,199 నుంచి రూ. 1,599 వరకు ఉంటుంది.
చూశారుగా.. ఇంట్లోని వస్తువుల్ని సులభంగా శానిటైజ్ చేయడానికి ఎన్ని రకాల గ్యాడ్జెట్లు మనకు అందుబాటులో ఉన్నాయో! కాబట్టి అనవసరంగా శ్రమ పడకుండా ఎంచక్కా వీటిని ఇంటికి తెచ్చేసుకోండి.. ఏ వస్తువైనా ఈజీగా శానిటైజ్ చేసేసుకోండి. అయితే ఏ వస్తువును ఎంతసేపు శుభ్రం చేయాలన్న విషయం ఆయా గ్యాడ్జెట్‌తో పాటు అందించే లేబుల్‌పై స్పష్టంగా రాసి ఉంటుంది. దాని ప్రకారం ఫాలో అయితే అతినీల కిరణాల వల్ల ఆయా వస్తువులు పాడు కాకుండా జాగ్రత్తపడచ్చు.
Photos: Amazon.in