కరోనా కల్లోలం మొదలైనప్పట్నుంచి పరిశుభ్రత విషయంలో మరింత అడ్వాన్స్ అయిపోయారు మహిళలు. ఇంట్లో ఉన్న వస్తువుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం, బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్ చేయడంతో బిజీబిజీగా మారిపోయారు. అయితే వస్తువుల సంగతి సరే కానీ.. ఇంట్లో ఉన్న గాలిని ఎలా శుభ్రం చేయాలి..? అసలే ఈ వైరస్ గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందని ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటించింది. అందుకేగా మా ఇంట్లో ఎయిర్ ప్యూరిఫయర్‌ని ఏర్పాటుచేసుకున్నాం.. అంటారా? అయితే వేలకు వేలు డబ్బులు పోసి దాన్ని కొనే అవసరం లేకుండానే మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతోనే ఇంటి గాలిని శుద్ధి చేసుకోవచ్చని చెబుతోంది బాలీవుడ్ అలనాటి అందాల తార జుహీ చావ్లా. ఈ క్రమంలోనే ఇంట్లోని గాలిని శుభ్రం చేయడానికి ఓ అద్భుతమైన ఆయుర్వేద చిట్కాను ఇటీవలే ఇన్‌స్టా వేదికగా పంచుకుందీ ముద్దుగుమ్మ.
కరోనా కారణంగా మన తారలంతా గత నాలుగు నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు. అయినా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ తమ ఫ్యాన్స్‌తో నిరంతరం టచ్‌లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో ఆహారం, ఆరోగ్యం, వ్యాయామం, సౌందర్యం.. వంటి అంశాలకు సంబంధించిన బోలెడన్ని చిట్కాలతో పాటు తమ లాక్డౌన్ మెమరీస్‌ని కూడా పంచుకుంటున్నారు. అదే విధంగా బాలీవుడ్ అలనాటి అందాల తార జుహీ చావ్లా ఇంటిని శుద్ధి చేయడానికి ఉపయోగపడే ఓ ఆయుర్వేద చిట్కాను ఇటీవలే ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. బోలెడన్ని డబ్బులు పోసి ఎయిర్ ప్యూరిఫయర్ కొనే కంటే ఇంట్లో లభించే పదార్థాలతోనే ఇంట్లోని గాలిని శుభ్రం చేసుకోవచ్చని తాను అందించిన ఈ టిప్ ద్వారా చెప్పకనే చెప్పిందీ సుందరి.
ఈ రెండూ ఉంటే చాలు!
కరోనా ప్రభావం వల్లే ఆయుర్వేదంలో దాగున్న అద్భుత శక్తి గురించి ప్రపంచానికి తెలిసిందంటోంది జుహీ. ‘నిజానికి ఇంట్లో ఎయిర్ ప్యూరిఫయర్ ఏర్పాటు చేసుకోకుండా కూడా ఇంటి గాలిని శుద్ధి చేసుకోవచ్చు. అదెలా అంటే.. ఈ అద్భుతమైన ఆయుర్వేదిక్ చిట్కాతో! కరోనా ప్రభావం వల్లే ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ ఆయుర్వేదంలో ఉన్న అద్భుత శక్తి గురించి తెలిసింది. అలాంటి ఆయుర్వేదిక్ చిట్కాతో ఇంట్లోని గాలిని సహజసిద్ధంగా శుభ్రం చేసుకోవచ్చు. అందుకోసం మనకు కావాల్సిందల్లా తాజా వేపాకులు, అరటీస్పూన్ పసుపు. ఈ రెండింటినీ ఒక బౌల్లో తీసుకొని అందులో నిండా నీళ్లు పోసి ఓసారి కలుపుకోవాలి. అంతే.. ఈ బౌల్‌ని గదిలో ఓ మూలన లేదా టేబుల్‌పై ఉంచితే ఆ గదిలోని గాలి ఇట్టే శుభ్రపడుతుంది. అంతేకాదు.. ఈ మిశ్రమంతో చేతుల్ని కూడా శానిటైజ్ చేసుకోవచ్చు.. కావాలంటే మీరూ ఓసారి ట్రై చేసి చూడండి!’ అంటూ వీడియోలో భాగంగా చెప్పుకొచ్చింది జుహీ.

దేంతో ఏం ఉపయోగం!
* వేపాకుల్ని సహజసిద్ధమైన ఎయిర్ ఫిల్టర్స్గా పిలుస్తారు. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్.. వంటి ఎన్నో గుణాలు ఈ ఆకుల్లో ఉన్నాయి. వీటి ఉపరితలం గాలిలోని కార్బన్ డయాక్సైడ్తో పాటు ఇతర కాలుష్య కారకాలను, దుమ్ము-ధూళిని ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటుంది. తద్వారా గాలి శుభ్రపడుతుంది.
* ఇక పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు శ్వాసకోశ సంబంధిత సమస్యల్ని తగ్గిస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్ల బారి నుంచి మనల్ని కాపాడతాయి.
ఇవి కూడా!

* గదిలోని గాలి పరిశుభ్రంగా ఉండాలంటే సరైన వెంటిలేషన్ ఉండడం తప్పనిసరి. లేదంటే ఆ గదిలోని తేమ అక్కడి గాలిని కలుషితం చేస్తుంది. ఇక కిచెన్‌లో వెలువడే ఘాటైన వాసనల్ని బయటికి పంపించేయడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ని అమర్చుకోవాలి. ఇది ఇంట్లోని కలుషితమైన గాలిని కూడా బయటికి పంపించడంలో సహకరిస్తుంది.
 * చాలామంది ఇంట్లో సువాసన కోసం సెంటెడ్ క్యాండిల్స్‌ని వినియోగిస్తుంటారు. అయితే వీటిలోని రసాయనాల వల్ల గాలి మరింత కలుషితమవుతుంది. అందుకే వీటికి బదులుగా బీస్‌వ్యాక్స్ క్యాండిల్స్‌ని ఉపయోగించడం ఉత్తమం. ఇవి నెమ్మదిగా కరగడంతో పాటు వీటి నుంచి ఎలాంటి పొగ వెలువడదు. అలాగే ఇంట్లోని గాలిని శుద్ధి చేయడానికీ ఇవి చక్కగా ఉపయోగపడతాయి. * సాల్ట్ ల్యాంప్స్ కూడా సహజసిద్ధమైన ఎయిర్ ప్యూరిఫయర్స్‌గా ఉపయోగపడతాయి. ఇవి ఇంట్లోని గాలిలో ఉండే విషపదార్థాలను ఆకర్షించి.. గాలిని శుద్ధి చేస్తాయి. * వెదురు కర్రలను మండించగా తయారైన బొగ్గుని కూడా న్యాచురల్ ఎయిర్ ప్యూరిఫయర్‌గా పిలుస్తారు. ఇది ఎలాంటి వాసనను వెదజల్లదు.. సరికదా గాల్లోని విషపదార్థాలను, కాలుష్య కారకాలను, బ్యాక్టీరియా, వైరస్‌లను ఆకర్షించే గుణం దీనికి చాలా ఎక్కువ. * ఇక ఇంట్లోని గాలిని శుద్ధి చేసుకోవడానికి ఇండోర్ ప్లాంట్స్ కూడా చక్కగా దోహదం చేస్తాయి. ముఖ్యంగా కలబంద, తులసి, బోస్టన్ ఫెర్న్, మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, రబ్బర్ మొక్కలు, పీస్ లిల్లీ, చామంతి.. వంటి మొక్కల కుండీలను ఆయా గదుల్లో అమర్చడం వల్ల అక్కడి గాలి శుద్ధవుతుంది.
 * గాలిలోని బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్.. వంటి సూక్ష్మక్రిములను 99.96 శాతం వరకు చంపే శక్తి అత్యవసర నూనెలకు ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అందుకే రోజ్మేరీ, టీట్రీ, నిమ్మ, లవంగం, గ్రేప్ ఫ్రూట్.. వంటి అత్యవసర నూనెల్లో ఏదో ఒకదాన్ని కొన్ని కాటన్ బాల్స్‌పై వేసి ఆయా గదుల్లో అమర్చుకోవడం వల్ల అక్కడి గాలి శుభ్రపడుతుంది.
|
సో.. చూశారుగా! బోలెడంత డబ్బు ఖర్చు పెట్టి ఎయిర్ ప్యూరిఫయర్స్ కొనే కంటే ఎంచక్కా ఇంట్లో ఉండే వాటితోనే సహజసిద్ధంగా మన ఇంట్లోని గాలిని శుద్ధి చేయడమెలాగో! మనమూ ఈ చిట్కాలను పాటించి మన ఇంటిని పరిశుభ్రంగా మార్చేసుకుందాం.. కరోనా వైరస్‌తో పాటు ఇతర బ్యాక్టీరియల్, ఫంగల్, వైరల్ ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉందాం..!