ఈ కరోనా కాలంలో శుభ్రత విషయంలో ఏమాత్రం రాజీపడట్లేదు అతివలు. సాధారణంగానే ఇంటిని అద్దంలా మెరిపించే మహిళలు.. ఇక ప్రస్తుత ప్రతికూల పరిస్థితులకు చిక్కకుండా ఇంటి పరిశుభ్రత విషయంలో మరింత శ్రద్ధ వహిస్తున్నారు. ఈ క్రమంలో హోమ్ క్లీనర్స్ కోసం బోలెడన్ని డబ్బులు ఖర్చు పెట్టడానికీ వెనకాడట్లేదు. అయితే ఇలా బయటదొరికే క్లీనర్స్‌లో ఉండే రసాయనాలు మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు వాతావరణాన్నీ కలుషితం చేస్తాయంటోంది అందాల నటి సమంత. అందుకే వాటికి బదులుగా ఇంట్లోనే బయోఎంజైమ్స్ తయారుచేసుకొని వాడాలని అందరికీ సూచిస్తోంది సామ్. కరోనా కారణంగా షూటింగ్స్ ఏవీ లేకపోవడంతో ప్రస్తుతం ఇంట్లోనే ఉంటోన్న ఈ బ్యూటీ.. ఆరోగ్యం, ఫిట్నెస్, గార్డెనింగ్.. వంటి ఎన్నో విషయాలపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా బయోఎంజైమ్స్ గురించి వివరిస్తూ ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టిందీ అక్కినేని వారి కోడలు పిల్ల.
ట్యాలెంట్‌కు మారుపేరుగా నిలుస్తుంటుంది టాలీవుడ్ అందాల భామ సమంత. అటు తన నటనతో మనందరినీ ఆకట్టుకునే సామ్.. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్స్ ఏవీ లేకపోవడంతో ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలోనే తన హెల్త్ టిప్స్, బ్యూటీ సీక్రెట్స్, తాను చేసే వ్యాయామాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ఇక ఇటీవలే తన గార్డెనింగ్ స్కిల్స్ బయటపెట్టిన ఈ అమ్మడు.. తాజాగా ఇంటిని శుభ్రం చేసుకోవడానికి ఉపయోగపడే బయోఎంజైమ్స్ని ఎలా తయారుచేయాలో వివరిస్తూ దానికి సంబంధించిన ఓ రెసిపీని ఇన్‌స్టాలో పంచుకుంది.
అసలేంటీ బయోఎంజైమ్స్?
తన ఫ్రెండ్ సలహాతో తాను తయారుచేసిన బయోఎంజైమ్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ టాలీవుడ్ బేబ్.. అసలు బయోఎంజైమ్ అంటే ఏంటి? దాన్నెలా తయారుచేయాలో వివరిస్తూ ఓ సుదీర్ఘమైన క్యాప్షన్ రాసుకొచ్చింది.
‘ఈ రోజు నేను నా ఫ్రెండ్ దగ్గర్నుంచి బయోఎంజైమ్ ఎలా తయారుచేయాలో నేర్చుకున్నా. ఇప్పుడు దాన్నెలా తయారుచేయాలో మీకు చెప్తా. అయితే అంతకంటే ముందు అసలు బయోఎంజైమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. బయోఎంజైమ్స్ అనేవి సహజసిద్ధమైన క్లీనర్స్. నిమ్మతొక్కలను పులియబెట్టి వీటిని తయారుచేస్తారు. ఇలా తయారైన బయోఎంజైమ్స్ని గిన్నెలు తోమడానికి, బట్టలుతకడానికి, నేలను శుభ్రం చేయడానికి, బాత్రూమ్ కడగడానికి, గాజు ఉపరితలాలను శుభ్రం చేయడానికి.. ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగించచ్చు. బయోఎంజైమ్స్లో ఉండే మంచి బ్యాక్టీరియా ఇంట్లో ఆయా ఉపరితలాలపై పేరుకున్న మురికిని, జిడ్డును ఇట్టే వదలగొడుతుంది. అలాగే ఇంటిని రసాయన రహితం చేయడానికి ఈ బయోఎంజైమ్స్ చక్కగా ఉపయోగపడతాయి. ఈ సహజసిద్ధమైన క్లీనర్స్.. సింక్, వాష్‌బేసిన్ డ్రైనర్స్లో చిక్కుకున్న పదార్థ అవశేషాలను, జిడ్డును తొలగించి శుభ్రపరుస్తాయి.
ఇలా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు!
బయోఎంజైమ్స్తో నీటిలో ఉండే క్రిములు, బ్యాక్టీరియాను కూడా చంపేయచ్చు. ఈ క్రమంలో వెయ్యి లీటర్ల నీటిని క్రిమిరహితం చేయాలంటే లీటర్ బయోఎంజైమ్ వాడాల్సి ఉంటుంది. ఈ పద్ధతి పర్యావరణానికీ మేలు చేస్తుంది. ఇలా ఎన్నెన్నో రకాలుగా ఉపయోగపడే బయోఎంజైమ్స్ తయారు చేయడమెలాగో ఇప్పుడు చూద్దాం..
కావాల్సినవి
* పండ్ల తొక్కలు - 300 గ్రాములు
* బెల్లం - 100 గ్రాములు
* నీళ్లు - లీటర్
* ఈస్ట్ - 100 గ్రాములు (ఇక్కడ ఈస్ట్ అంటే అంతకుముందు తయారుచేసిన బయోఎంజైమ్ అన్నమాట. దీన్ని ఉపయోగించడం వల్ల మూడునెలల్లో పులియాల్సిన మిశ్రమం నెలలోనే పులుస్తుంది.)
తయారీ
ఈ పదార్థాలన్నీ గాలి చొరబడని ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసి ఒకసారి కలియబెట్టి మూత బిగించేయాలి. దీన్ని కిచెన్‌లో ఓ మూలన చీకటి ప్రదేశంలో నిల్వ చేయాలి. మొదటి పది రోజుల పాటు కొన్ని సెకన్లు మూత తీసి పెడుతుండాలి. ఆ తర్వాత రెండు రోజులకోసారి ఇదే పద్ధతిని ఫాలో కావాలి. మూడు నెలలు/నెల తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టి పిప్పిని బాగా పిండేయాలి. ఇలా వేరుచేసిన పిప్పిని మెత్తగా చేసుకొని జిడ్డు మరకల్ని తొలగించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అలాగే దీన్ని తర్వాత తయారుచేయబోయే బయోఎంజైమ్కి స్టార్టర్‌గా కూడా వాడచ్చు. ఇక ఇందాక మనం వడకట్టుకున్న ద్రావణమే బయోఎంజైమ్. అంతే.. దీన్ని మనం కిచెన్ అవసరాలకు, ఇంటిని శుభ్రం చేయడానికి ఉపయోగించచ్చు..’ అంటూ సహజసిద్ధమైన క్లీనర్ ఎలా తయారుచేయాలో వివరించిందీ ముద్దుగుమ్మ.
ఎంతో ఈజీగా ఉంది కదూ.. ఈ బయోఎంజైమ్ తయారు చేసే విధానం! మరి, ఇకపై పండ్ల తొక్కలను వృథాగా పడేయకుండా బయోఎంజైమ్ తయారుచేసేద్దాం.. తద్వారా ఇంటిని రసాయన రహితంగా మార్చడంతో పాటు మన ఆరోగ్యాన్ని, పర్యావరణాన్నీ కాపాడుకుందాం..!