ప్రస్తుతం కరోనా విజృంభిస్తోన్నా కొన్ని సార్లు బయటికి వెళ్లక తప్పని పరిస్థితి. వృత్తిఉద్యోగాల రీత్యా మాత్రమే కాదు.. నిత్యావసరాలు, రోజువారీ కాయగూరలు, పండ్ల కోసం ఇంట్లో నుంచి ఎవరో ఒకరు కచ్చితంగా బయటికి వెళ్లాల్సిందే! ఇలా ఇంటికి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్ చేయాల్సిందే! మరి, ప్యాక్ చేసిన వస్తువులు, ఆహార పదార్థాలపైన శానిటైజర్ స్ప్రే చేయడం లేదంటే క్లాత్ సహాయంతో వాటిపై అప్లై చేయడం వంటివి చేయచ్చు. మరి, పండ్లు, కాయగూరల సంగతేంటి? అన్నింటిలాగే వాటిపైనా శానిటైజర్ స్ప్రే చేస్తే అందులోని ఆల్కహాల్ ప్రభావానికి పండ్లు, కాయగూరల్లోని పోషకాలు నశించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అందుకే ఇంట్లో సహజసిద్ధంగా తయారుచేసుకున్న ద్రావణాలతోనే వీటిని కడగాలని సూచిస్తున్నారు. మరి, ఇంతకీ ఆ న్యాచురల్ క్లీనర్స్‌ని ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!

అవి ప్రమాదకరం!
బయటి నుంచి తెచ్చిన పండ్లు, కాయగూరల్ని కడిగే విషయంలో కొంతమంది అతి శుభ్రత పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే శానిటైజర్లను క్లాత్‌పై వేసి పండ్లు, కాయగూరలను తుడవడం లేదంటే వాటిపై శానిటైజర్‌ని స్ప్రే చేయడం వంటివి చేస్తున్నారు. ఇక మరికొందరేమో డిటర్జెంట్ కలిపిన నీటిలో కాయగూరల్ని, పండ్లను వేసి నానబెడుతున్నారు. ఇలాంటి పనులు అస్సలు కూడదంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీటిలోని రసాయనాలు, ఆల్కహాల్ పండ్లు, కాయగూరల్లోని పోషకాల్ని నశింపజేయడంతో పాటు.. ఆ రసాయన అవశేషాలు వాటి చర్మంపై జిడ్డులాగా అంటుకుపోతాయి. ఇక ఎంత కడిగినా అవి వదలవు. తద్వారా వాటిని మనం తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.. అంతేకాదు.. ఒక్కోసారి ఈ సమస్యలు దీర్ఘకాలిక అనారోగ్యాలుగా కూడా పరిణమించచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే ఇలాంటి రసాయన సంబంధిత శానిటైజర్లు, డిటర్జెంట్లకు బదులుగా మన ఇంట్లో లభించే పదార్థాలతోనే సహజసిద్ధంగా క్రిమి సంహారక ద్రావణాలను తయారుచేసుకొని ఉపయోగించమని సలహా ఇస్తున్నారు.
ఉప్పు లేదా పసుపుతో..!
ఒక పెద్ద బకెట్లో నీళ్లు తీసుకొని అందులో రెండుమూడు టేబుల్స్పూన్ల గళ్లుప్పు వేయాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని బాగా కలిపి.. బయటి నుంచి తెచ్చిన కాయగూరలు, పండ్లను ఆ నీటిలో మునిగేలా ఓ అరగంట పాటు నాననివ్వండి. ఆపై మరో రెండుసార్లు శుభ్రమైన నీటితో వీటిని క్లీన్ చేసి ఆరబెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుంటే సరి. అయితే ఇక్కడ ఉప్పుకు బదులుగా పసుపు కూడా కలుపుకోవచ్చు. ఉప్పు, పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పండ్లు, కాయగూరలపై ఉండే సూక్ష్మక్రిముల్ని నశింపజేస్తాయి.

బేకింగ్ పౌడర్ + వెనిగర్
బేకింగ్ పౌడర్, వెనిగర్ కూడా పండ్లు, కాయగూరలపై ఉండే క్రిముల్ని నశింపజేస్తాయి. ఇందుకోసం ఈ రెండింటినీ సమపాళ్లలో తీసుకొని బకెట్ వేడి నీళ్లలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలియబెట్టి.. అందులో పండ్లు, కాయగూరల్ని వేసి అరగంట పాటు అలాగే వదిలేయాలి. ఆపై మంచి నీటితో మరోసారి వాటిని శుభ్రం చేస్తే సరిపోతుంది.
ఈ మూడూ కలిపి..
ఉప్పు, పసుపు, వెనిగర్.. ఈ మూడింటినీ సమపాళ్లలో తీసుకొని బకెట్లో వేడి నీళ్లలో వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో పండ్లు, కాయగూరల్ని వేసి అరగంట పాటు నాననివ్వాలి. ఆపై సాధారణ నీటితో మరోసారి కడిగేసుకుంటే.. పండ్లపై చేరిన మలినాలు, బ్యాక్టీరియా, వైరస్, క్రిములు అన్నీ తొలగిపోతాయి. మీకు కావాలనుకుంటే ఇదే మిశ్రమంలో అర చెక్క నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.

యాపిల్ సిడార్ వెనిగర్‌తో..
యాపిల్ సిడార్ వెనిగర్ పండ్లు, కాయగూరలపై ఉండే పెస్టిసైడ్స్, బ్యాక్టీరియా, క్రిములను సమర్థంగా తొలగిస్తుంది. ఈ క్రమంలో పది వంతుల నీటితో ఒక వంతు యాపిల్ సిడార్ వెనిగర్ కలిపి ఆ మిశ్రమంలో పండ్లు, కాయగూరల్ని ఐదు నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత బాగా రుద్ది.. మంచి నీటితో కడిగేస్తే ఇట్టే శుభ్రపడతాయి.
వెనిగర్‌తో ట్రై చేయండి..
కిచెన్‌లోని దుర్వాసనలను పోగొట్టే అద్భుత గుణాలు వెనిగర్ సొంతం. అందుకే ఇది ప్రతి ఒక్కరి కిచెన్‌లో తప్పకుండా ఉంటుంది. అయితే దీంతో పండ్లు, కాయగూరల్ని శుభ్రం చేయడానికి కావాల్సిన సహజసిద్ధమైన ద్రావణాన్ని మనం తయారుచేసుకోవచ్చు. ఇందుకోసం మూడు వంతుల నీటిలో ఒక వంతు వెనిగర్‌ను కలపాలి. ఇలా తయారైన మిశ్రమంలో పండ్లు, కాయగూరల్ని వేసి పది నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత రుద్ది.. మరోసారి మంచి నీళ్లతో కడిగేస్తే అవి చక్కగా శానిటైజ్ అవుతాయి.
హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో..
యాంటీ సెప్టిక్ గుణాలు కలిగిన హైడ్రోజన్ పెరాక్సైడ్తోనూ పండ్లు, కాయగూరల్ని శుభ్రం చేసుకోవచ్చు. అయితే మరీ గాఢమైంది కాకుండా.. కేవలం 3 శాతం హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిగిన ద్రావణం మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని ఎక్కువగా ఇంటి పనుల కోసం వినియోగిస్తుంటారు. ఈ 3% హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను ఒక టేబుల్ స్పూన్ తీసుకొని దాన్ని.. నాలుగు లీటర్ల నీటిలో కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఇందాకటి లాగే పండ్లు, కాయగూరల్ని పది నిమిషాల పాటు ఉంచి.. శుభ్రమైన నీటితో కడిగేసుకోవాలి. ఆపై ఆరిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టాల్సినవి ఫ్రిజ్‌లో, మిగతావి గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి.

దుంపల కోసం..
చాలామంది తెలియకో లేదంటే బద్ధకించో దుంపల్ని కూడా అన్ని కూరగాయలతో పాటు కలిపే కడుగుతుంటారు. కానీ వాటిని అలా కడిగే ముందు ఓసారి స్క్రబ్బర్‌తో రుద్దమంటున్నారు నిపుణులు. అందుకే క్యారట్, బీట్రూట్, బంగాళాదుంపలు, చిలగడ దుంప.. వంటి దుంప జాతికి చెందిన కాయగూరల్ని ముందుగా ఓ సాఫ్ట్ స్క్రబ్బర్‌తో రుద్ది కడగాలి. ఆపై వీటిని చల్లటి నీటిలో రెండుమూడు నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత ఆరబెట్టి భద్రపరచుకుంటే సరిపోతుంది. అలాగే వీటిని వాడేముందు చెక్కు తీసేయడం మంచిది.

ఆకుకూరలు ఈ నీటితో..!
అన్ని కాయగూరలు కడగడం ఒకెత్తయితే.. ఆకుకూరలు కడగడం మరో ఎత్తు. ఎందుకంటే వాటికి కాస్త తడి తగిలితే చాలు.. త్వరగా కుళ్లిపోతాయి. అలాగని ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న ఈ పరిస్థితుల్లో వాటిని అలాగే ఫ్రిజ్‌లో పెట్టేయడం కరక్ట్ కాదు. కాబట్టి ఆకుకూరలన్నింటినీ ముందుగా కుళాయి నీళ్ల కింద ఒకసారి కడిగేయాలి. ఆపై ఒక పెద్ద గిన్నెలో చల్లటి నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసి.. ఆ మిశ్రమంలో ఆకుకూరల్ని కాసేపు ఉంచాలి. ఆ తర్వాత మరోసారి మంచి నీటితో శుభ్రం చేసి.. పూర్తిగా ఆరాకే వాటిని ఫ్రిజ్‌లో భద్రపరచాలన్న విషయం మాత్రం మర్చిపోకండి.. ఇక ఫ్రిజ్‌లో పెట్టే ముందు వాటిని కట్ చేసుకొని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే ఎక్కువ రోజులు అవి తేమను కోల్పోకుండా, తాజాగా ఉంటాయి.