కరోనా సామాన్యుడిపై కష్టాల పంజా విసురుతోంది... మహమ్మారి దెబ్బకి కొందరి జీతాల్లో కోతలు పడుతున్నాయి... చిన్నాచితకా వ్యాపారుల వెతలు వర్ణనాతీతం... ఆర్థిక కరవుతో అతలాకుతలం అవుతున్న కుటుంబాలెన్నో... ఈ గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే ఇల్లాలే నడుం బిగించాలి... ఇల్లంతా పొదుపు బాట పట్టాలి... హోంమంత్రే విత్తమంత్రిగా మారి ముందుండి నడిపించాలి.
పరిస్థితి బాగున్న రోజుల్లోనే మన సంపాదన బొటాబొటిగా సరిపోయేది. ఇంట్లోకి ఏదైనా వస్తువు కొనాలన్నా వాయిదా పద్ధతుల వైపు చూసేవాళ్లం. మరిప్పుడు కరోనా కాలం. ఈ కష్టకాలం ఎప్పుడు అంతమవుతుందో తెలియదు. అందుకే ఇల్లాలు పొదుపు మంత్రం పఠించాల్సిందే. అందుకేం చేయాలంటే..
ప్రణాళిక వేద్దాం..
ప్రణాళిక ఏ పనికైనా ప్రామాణికమే. రాబడి తగ్గిన ఈ సందర్భంలో మరింత పకడ్బందీగా వ్యవహరించక తప్పదు. ముందు మన సంపాదన, అద్దెలు, వడ్డీలు, డివిడెండ్లు, ఇతర ఆదాయాలు ఒక కాగితంపై రాసుకోవాలి. ఖర్చులు మరోవైపు. వీటిలో అత్యవసరాలు, వాయిదా వేయదగినవేంటో విభజించుకోవాలి. కూరగాయలు, పచారీ సామాను, విద్యుత్తు బిల్లు, వైద్య ఖర్చులు.. ఇవి అత్యవసరం. ఉన్న డబ్బులోనే వీటికి కొంతమొత్తం కేటాయిస్తే మిగిలిన ఖర్చులు అప్రాధాన్యాలుగా, వాయిదా వేయడానికి అవకాశం ఉన్నవాటిగా మిగిలిపోతాయి.

వంటింటితో మొదలు..
కష్టకాలంలో పొదుపు వంటింటి నుంచే మొదలవ్వాలి. చిన్నచిన్న అలవాట్లే మన ఖర్చును గణనీయంగా తగ్గిస్తాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆహారం వృథా కావొద్దనే స్పృహతో ఉండాలి. తక్కువ ధరలో దొరుకుతాయని కొందరు అవసరం లేకపోయినా ఎక్కువగా కొంటుంటారు. ఇలా చేసినప్పుడు ఎక్కువకాలం నిల్వ ఉండని పదార్థాలతో మనం అనుకున్న ప్రయోజనం నెరవేరదు. మిగిలిపోయిన అన్నాన్ని పోపు వేయడం, చద్దన్నంగా మార్చడం, పిండి ముద్దలా చేసి వడియాలు పెట్టడం.. ఇలాంటివి ఎన్నో చేయొచ్చు. తొందరగా పాడైపోయే కూరగాయలు, పదార్థాలు ముందే వండుకోవాలి. పళ్లెంలో ఆహారం అవసరం ఉన్నమేరకే వడ్డించాలి.
ఖర్చులు తగ్గిద్దాం..
భార్యాభర్తలిద్దరూ లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితం అయిపోయారు. ఈ సమయంలో రెండు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు బదులు ఒకేదాన్ని వంతులవారీగా ఉపయోగించుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్‌లాంటి సబ్స్క్రిప్షన్లు తగ్గించుకోవచ్చు. మామూలు రోజుల్లో ఇంట్లో బల్బులు, ఫ్యాన్లు, ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు ఎడాపెడా వాడేస్తుంటాం. ఈ క్లిష్ట సమయంలో పొదుపు పాటిస్తే ఖర్చులు తగ్గుతాయి. దుస్తులను సొంతంగా ఇస్త్రీ చేసుకుంటే లాండ్రీ ఖర్చులూ మిగుల్చుకోవచ్చు.

అదనపు సంపాదన..
లాక్డౌన్ సమయాన్ని అదనపు సంపాదనకు మార్గంగా మలచుకోవాలి. ఆన్లైన్ ట్యూషన్లు, యూట్యూబ్‌లో వీడియోలు చేయడం, ఫేస్‌మాస్కులు కుట్టడం.. ఆలోచిస్తే మనలోని ప్రతిభతో కాసులు కూడగట్టే ఏదో ఒక దారి దొరక్కపోదు. డాబా పైన, కారిడార్‌లో, ఇంటి ఆవరణలో.. టమాటా, వంకాయలాంటి కాయగూరల చెట్లు పెంచుకోవచ్చు. ప్లాస్టిక్ డబ్బాలు, కుండీలు, వ్యర్థ పాత్రల్లోనే వీటిని పెంచొచ్చు. ఇంట్లో మిగిలిపోయే వ్యర్థాలనే ఎరువుగా మార్చుతూ ‘జీరో వేస్ట్’ కుటుంబాలుగా మారాలి.
ఆర్థిక సూత్రాలు..
ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మ్యూచ్యువల్ ఫండ్స్, ఇతర డిపాజిట్లు కొన్నాళ్లు పక్కన పెట్టినా ఫర్వాలేదు. జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలు మాత్రం కొనసాగించాలి.

లాక్డౌన్ పాఠాలు..
లాక్‌డౌన్‌తో బయటికెళ్లడం తగ్గిపోయింది. దాంతో కొన్ని రకాల ఖర్చులూ తగ్గిపోయాయి. మనం అవసరం అనుకున్నవీ వాయిదా వేయొచ్చనే విషయం తెలిసొచ్చింది. వీటిని భవిష్యత్తులోనూ కొనసాగిస్తే ఆర్థికంగా ఎంతో లాభదాయకం.
ఇంధన వాడకం: చిన్నచిన్న అవసరాలు, దూరాలకు కాళ్లనే నమ్ముకుంటున్నాం. అత్యవసరం అయితేగానీ బండి బయటికి తీయడం లేదు. లాక్డౌన్ తర్వాత కూడా దీన్ని కొనసాగించవచ్చు.
సర్దుకుపోదాం: కరోనా వ్యాప్తి మొదలవగానే సింథటిక్ మాస్కులు కావాలనుకున్నాం. తర్వాత ఇంట్లోనే వస్త్రంతో కుట్టుకుంటున్నాం. కాలమే మనకు సర్దుకుపోయే పాఠాలు నేర్పింది. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో రీసైక్లింగ్‌కి అవకాశం ఉన్న వాటిపై దృష్టి పెట్టాలి.
ఆచితూచి: పిల్లలకు చిరుతిళ్లు కొనిపెట్టే బదులు.. ఇంట్లోనే ఏదైనా చేసి పెడుతున్నాం. తర్వాత కూడా ఈ ట్రెండ్ అందిపుచ్చుకుందాం.
పోపుల పెట్టె: బామ్మల కాలం నుంచి ఇల్లాలు పోపుల పెట్టెలో నగదు దాచుకోవడం అలవాటు. కరవు సమయంలో ఇదెంతో అక్కరకొచ్చేది. ఈ ట్రెండ్‌ని మళ్లీ కొనసాగించాలి.
అత్యవసర నిధి: మూడునెలల జీతానికి సరిపడా నగదును ఇంట్లో ఉంచుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతుండేవారు. అది పాటించిన వారికి కష్టాలు తొలగాయి. ఆ ఆవశ్యత మనకూ తెలిసొచ్చింది. భవిష్యత్తులోనైనా ఆ సూచన కొనసాగిద్దాం.

షాపింగ్, సినిమాలు: వారాంతాల్లో, కుదిరినప్పుడు సరదాగా షాపింగ్కెళ్లేవాళ్లం. అవసరం లేకపోయినా ఏదో వస్తువు కొనేవాళ్లం. ఇప్పుడు షాపింగ్ లేకపోయినా సర్దుకుపోతున్నాం. భవిష్యత్తులో దీన్ని కొనసాగించవచ్చు. మామూలు రోజుల్లో నెలకు ఒకట్రెండు సినిమాలకెళ్లేవాళ్లం. ఇప్పుడు ఇంట్లోనే ప్రత్యామ్నాయం చూసుకుంటున్నాం.
హోటళ్లు, రెస్టారెంట్లు: సరదా కోసం అప్పుడప్పుడు వెళ్లి భారీగా బిల్లు చెల్లించుకునేవాళ్లం. కాస్త శ్రమ పడితే ఇంట్లోనే ఘుమఘుమలాడే వంటకాలు చేసుకొని తినొచ్చనే విషయం బోధ పడింది.