స్వీయ నిర్బంధంలో ఉన్నా కూడా ఇంటికి కావాల్సిన సరుకుల కోసం బయటకు వెళ్లక తప్పని పరిస్థితి. అందుకు ఉదయం.. అది కూడా ప్రతి ఇంటి నుంచీ ఒక్కొక్కరే వెళ్లడానికి అనుమతిచ్చింది ప్రభుత్వం. అలా బయటకు వెళ్లి వచ్చిన తర్వాత మీరు శుభ్రంగా ఉండడంతో పాటు.. మీరు తెచ్చిన వస్తువులు కూడా శుభ్రం చేసిన తర్వాతే ఇంట్లోకి తెచ్చుకోవాలంటోంది బుల్లితెర బ్యూటీ హీనా ఖాన్. కేవలం చెప్పడమే కాదు.. తనే స్వయంగా ఈ విషయాన్ని ఆచరించి దానికి సంబంధించిన వీడియోను కూడా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. మరి వంటింటి వస్తువులు, కూరగాయలు, పండ్లు.. ఇలా అన్ని వస్తువులను తనెలా శుభ్రం చేసిందో తెలుసుకుని మనమూ పాటిద్దాం రండి..

ఇంట్లోకి వెళ్లే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి..
తనకు కావాల్సిన సరుకుల్ని తీసుకొని బయట నుండి ఇంటికి వచ్చిన హీనా.. తాను తీసుకొచ్చిన వస్తువులేంటి? వాటిని ఎలా శుభ్రపరిచింది.. వంటి వివరాలను వీడియోగా చిత్రీకరించి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో పాటు.. ‘హాయ్.. నేను బయటి నుండి ఇప్పుడే వచ్చాను. వంట సామాన్లు, మందులు.. ఇంకా ఇతర వస్తువులు తీసుకుని వచ్చాను. ఇప్పుడు నేను మీకు వీటిని ఎలా శుభ్రం చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. మనం బయటకు వెళ్లి వచ్చినప్పుడు ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ వాటిలో కొన్ని చిన్న చిన్న లోపాలుంటాయి. ఇలా బయటకు వెళ్లి ఇంటికి కావాల్సినవి కొని ఇంటి లోపలికి వెళ్లడానికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అవేంటో చూద్దాం రండి..

వేడి నీళ్లు, సోప్ తప్పనిసరి..
ముందుగా వస్తువులన్నీ బయటకు తీసి సిద్ధంగా ఉంచుకోండి. ఇక్కడ మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను.. ప్రపంచమంతా శానిటైజర్స్ కొరత ఏర్పడింది. కాబట్టి శుభ్రం చేయడానికి సోప్‌ని ఉపయోగిస్తున్నాను. సోప్ కూడా వైరస్‌ని నాశనం చేయడంలో ఉపకరిస్తుంది. ఒక బకెట్ లేదా మీకు నచ్చిన పాత్రలో వేడి నీళ్లని తీసుకుని.. అందులో కొద్దిగా లిక్విడ్ సోప్, Dettolని కలపాలి. ఇప్పుడు ఒక్కో వస్తువును ఈ నీటిలో బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేయడానికి ముందు చేతులకు శానిటైజర్ రాసుకోవాలి. ఇప్పుడు ఇందులో బాటిల్స్, టెట్రాప్యాకెట్స్.. లాంటివి శుభ్రం చేసుకోవచ్చు. ఖరీదైన శానిటైజర్స్ ఉపయోగించాల్సిన పనిలేకుండా చాలా మామూలుగా శుభ్రం చేసుకోగలిగే పద్ధతిని మీకు చూపిస్తున్నాను. ఇదే కాదు.. మీరు సామాన్లను కడగడానికి లిక్విడ్ సోప్ లేదా మామూలు సోప్ లాంటివి కూడా ఉపయోగించవచ్చు.

న్యాప్కిన్తో తడపండి..
ఇలా శుభ్రం చేసిన వస్తువులని ఇంట్లో జాగ్రత్తగా పెట్టాను. ఇక్కడ ఇంకా కొన్ని వస్తువులు ఉన్నాయి. వీటిని పూర్తిగా నీటిలో ముంచుతూ శుభ్రం చేయలేను. అందుకోమే శానిటైజర్ అప్లై చేసిన న్యాప్కిన్ని ఉపయోగిస్తున్నాను. అయితే అంతకంటే ముందు మళ్లీ ఒకసారి చేతులకు శానిటైజర్‌ని అప్లై చేసుకుంటున్నాను. ఇప్పుడు శానిటైజర్ కలిపిన కొన్ని నీళ్లతో న్యాప్కిన్ని తడిపి దానితో బిస్కట్ ప్యాకెట్స్, పెరుగు డబ్బాలు, బ్రెడ్ ప్యాకెట్స్, మెడిసిన్ షీట్స్.. నీళ్లలో పూర్తిగా ముంచి శుభ్రం చేయలేనివన్నీ ఇలా న్యాప్కిన్తో శుభ్రం చేయాలి.

ఇప్పుడు కూరగాయల వంతు..
కూరగాయలు, పండ్లను శుభ్రం చేయడం చాలా కష్టమైన పని. ఇందులో చాలా రకాలు ఉంటాయి.. ఆకుకూరలు, కూరగాయలు. వీటిని శుభ్రం చేయడానికి సోప్ లాంటివి ఉపయోగించలేం.. కాబట్టి బాగా వేడిగా ఉన్న నీటిని ఉపయోగించడం మంచిది. తద్వారా వైరస్‌కి చెక్ పెట్టచ్చు. అందుకోసం ముందుగా కూరగాయలు, పండ్లు శుభ్రం చేసుకోవడానికి వీలుగా ఉండే పాత్రలో వేడి నీటిని తీసుకోవాలి. అందులో అన్నింటినీ వేసి చేత్తో రుద్దుతూ శుభ్రం చేసుకోవాలి. చివరగా బంగాళాదుంప, ఉల్లిపాయలు లాంటివి నీళ్లలో శుభ్రం చేస్తే పాడవుతాయి కాబట్టి ఉపయోగించే ముందు వాటిని బాగా శుభ్రం చేసుకుని వాడుకోవాలి. ఇవే కాదు.. వీటిని తేవడానికి ఉపయోగించిన బ్యాగ్‌ని కూడా ఒక బకెట్లో బాగా నానబెట్టి ఉతకండి.

వీటితో పాటు మీరు కూడా..
ఇక చివరగా నా వంతు.. ఈ వస్తువుల కోసం నేను బయట తిరిగాను.. కాబట్టి నన్ను నేను శుభ్రం చేసుకోవడం అవసరం. నా బ్యాగ్, దుస్తులు.. ఇలా అన్నీ శుభ్రం చేయాలి. నేను వేసుకున్న షూస్‌ని కూడా శుభ్రం చేయాలి. అందుకే వీటిని ఇంటి బయటే వదులుతున్నాను. ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్లను శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటున్నాను. నా చేతికి ధరించిన గ్లౌజ్‌లను పారేస్తున్నాను. చివరగా ఒకసారి నా చేతులకు శానిటైజర్ రాసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇంట్లోకి వెళ్తున్నాను. నేను వేటినీ, ఎవరినీ తాకకుండా నేరుగా బాత్రూంలోకి వెళ్లి స్నానం చేస్తాను. సో.. మీరు కూడా బయటికి వెళ్లొచ్చినా, ఏవైనా సరుకులు తెచ్చినా ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి.. సురక్షితంగా ఉండండి’.. అంటూ వీడియోని ముగించిందీ టీవి నటి.
ఇది మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నా..
ఇలా తాను బయటి నుంచి తీసుకొచ్చిన ప్రతి వస్తువునూ శుభ్రం చేస్తూ అవగాహన కల్పించిన వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. ‘బయటి నుండి ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కొని వచ్చినప్పుడు.. ఏ చిన్న జాగ్రత్త పాటించడం మరిచినా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో చెబుతున్నా. ఇది మీ అందరికీ ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. సురక్షితంగా ఉండండి.. జాగ్రత్తలు పాటించండి’.. అంటూ క్యాప్షన్‌ని జత చేసింది హీనా.
చూశారుగా.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా వైరస్ బారిన పడే అవకాశం ఉంది.. కాబట్టి మీరు కూడా బయటి నుండి తీసుకువచ్చే ప్రతి వస్తువునూ శుభ్రం చేసుకుంటూ, మిమ్మల్ని మీరు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల మీతో పాటు.. మీ కుటుంబ సభ్యులను కూడా వైరస్ ముప్పు నుంచి కాపాడిన వారవుతారు. అందుకే జాగ్రత్తలు పాటిద్దాం.. సురక్షితంగా ఉందాం..!