కూరగాయలు, పండ్లు, మాంసం.. ఇలా వంటింట్లోని పదార్థాలను కట్ చేయడానికి వేర్వేరు కత్తుల్ని/చాకుల్ని ఉపయోగించడం మనకు తెలిసిందే. అయితే వీటిని కట్ చేయడానికి ప్రస్తుతం మార్కెట్లో విభిన్న రకాల కటర్స్, స్లైసర్స్.. వంటి ఎన్నో రకాల గ్యాడ్జెట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ కత్తి లేని కిచెన్ అసంపూర్ణమనే చెప్పుకోవాలి. మరి, కత్తి లేదా చాకుకు వంటింట్లో అంతటి ప్రాధాన్యముంటుంది. అయితే అటువంటి కత్తి పదునుగా లేకపోతే.. ఇక పనైనట్టే..! మరి, దాన్ని సానపట్టించాలన్నా, కొత్త కత్తి కొనాలన్నా కాస్త సమయం పడుతుంది. మరి, అనుకున్నదే తడవుగా.. ఇంట్లోనే నిమిషాల్లో కత్తిని పదునెక్కించే గ్యాడ్జెట్స్ ఏవైనా ఉంటే బాగుంటుంది కదూ!! అలాంటివీ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోకొచ్చేశాయ్. అంతేకాదు.. మీరు ఉపయోగించే చాకు లేదా కత్తిని ఎంతగా కావాలంటే అంతగా పదును పెట్టుకొనే అవకాశం కూడా ఈ గ్యాడ్జెట్స్‌లో ఉంటుంది. వీటి గురించి చదువుతుంటేనే ఎంతో ఉపయోగకరం అనిపిస్తున్నాయి కదూ!! ఇంకా వీటి గురించి పూర్తిగా తెలుసుకుంటే వెంటనే కొనేస్తారేమో!! మరి, కత్తులకు పదును పెట్టే అలాంటి కొన్ని నైఫ్ షార్ప్నర్స్ గురించి ఈ వారం ప్రత్యేకంగా మీకోసం..

క్విక్ షార్ప్ స్టెయిన్లెస్ స్టీల్ నైఫ్ షార్ప్‌నర్
కత్తిని పదునెక్కించడానికి మన పూర్వకాలంలో గరుకుగా ఉండే రాయిని ఉపయోగించేవారు. ఈ కాలంలో కూడా చాలామంది ఇళ్లలో అలాంటివి చూస్తుంటాం. కానీ నేటి తరం అతివలు ఏదైనా శ్రమ లేకుండా నిమిషాల్లో జరిగిపోవాలని కోరుకుంటున్నారు. అలాంటి వారి కోసమే.. పాత కాలం నాటి రాయికి కాస్త ఆధునితను జోడించి ఈ ‘క్విక్ షార్ప్ స్టెయిన్లెస్ స్టీల్ నైఫ్ షార్ప్‌నర్’ని తయారుచేశారు డిజైనర్లు. చిత్రంలో చూపించిన విధంగా ముందు భాగంలో ఒక చిన్న రాయిని అమర్చి, దాని పక్కన గుండ్రటి షార్ప్నర్స్ని జత చేశారు. పదునుగా చేయాలనుకున్న కత్తుల్ని ఈ షార్ప్నర్స్ మధ్యలో ఉంచి ముందు నుంచి వెనక్కి లాగాలి.. ఇలా కొన్ని సార్లు చేయడం వల్ల నిమిషాల్లోనే కత్తి షార్ప్‌గా మారుతుంది. బాగా మొద్దుబారిన చాకులు, మాంసం కట్ చేసే పెద్ద పెద్ద కత్తులను పదునుగా మార్చడానికి ఈ షార్ప్నర్ని ఉపయోగించచ్చు. ఇక ఈ టూల్‌కి ముందు భాగంలో ఉండే రాయిపై కత్తి చివర్లను షార్ప్ చేసుకోవచ్చు. ఇలా కత్తి లేదా చాకును తక్కువ సమయంలోనే అదీ ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు పదునుగా మార్చుకోవచ్చు. ఇలాంటి షార్ప్‌నర్ నాణ్యత, డిజైన్ని బట్టి దీని ధర రూ.199 నుండి రూ.599 వరకు ఉంటుంది.

నైఫ్ షార్ప్‌నర్ విత్ 2 ఎడ్జస్టబుల్ ఎడ్జెస్
మన అవసరాన్ని బట్టి కొన్ని కొన్ని కత్తుల్ని కాస్త ఎక్కువ షార్ప్ చేసుకోవాలనుకుంటాం.. ఇంకొన్ని కత్తులు అంత షార్ప్ లేకపోయినా పర్లేదనుకుంటాం. ఇలా మీకు కావాల్సినంత షార్ప్‌గా కత్తిని పదును పెట్టుకునే నైఫ్ షార్ప్‌నర్ కావాలనుకుంటున్నారా? అయితే అందుకు ‘నైఫ్ షార్ప్‌నర్ విత్ 2 ఎడ్జస్టబుల్ ఎడ్జెస్’ గ్యాడ్జెట్‌ని ఎంచుకుంటే సరి. చిత్రంలో చూపించిన విధంగా గ్యాడ్జెట్ మధ్య భాగంలో కత్తిని పదునుపెట్టుకోవడానికి వీలుగా ‘X’ ఆకారంలో గరుకైన రాళ్లు అమరి ఉంటాయి. అవి మరింత దగ్గరికి వచ్చేలా, దూరంగా జరిపేలా ఎడ్జస్ట్మెంట్ ఇందులో ఉంటుంది. ఈ గ్యాడ్జెట్ ద్వారా కత్తిని మూడు రకాలుగా పదును పెట్టుకోవచ్చు. కత్తిని కాస్త పాలిషింగ్ చేస్తే చాలు అనుకునే వారు ఈ గ్యాడ్జెట్ మధ్య కత్తిని ఉంచి కాసేపు ముందుకు, వెనక్కి అనాలి. అదే బాగా మొద్దుబారిన కత్తైతే.. ఆ చాకును ఏటవాలుగా ఉంచి ముందుకు, వెనక్కి కాస్త ఒత్తుతూ లాగాలి. ఇక మనం రోజూ ఉపయోగించే కత్తిని ఇంకాస్త పదును పెట్టాలనుకుంటే కత్తి మొన భాగాన్ని పైకి ఉంచి పిడిని కిందకి ఉంచి.. (అంటే ఇందాక పెట్టుకున్న డైరెక్షన్‌కి వ్యతిరేక దిశలో అన్నమాట) పైకి, కిందికి అనాలి. ఇలా కత్తుల్ని మనకు కావాల్సినంత షార్ప్‌గా తయారుచేసుకోవచ్చు. ఈ నైఫ్ షార్ప్‌నర్ నాణ్యత, డిజైన్‌ను బట్టి ధర రూ.399 నుండి రూ.899 వరకు ఉంటుంది.

కార్డ్‌లెస్ మల్టీఫంక్షన్ షార్ప్‌నర్
ఎంత సౌకర్యవంతమైన గ్యాడ్జెట్ అయినప్పటికీ కత్తిని షార్ప్ చేసుకోవడానికి మనం ఎంతో కొంత బలాన్ని ఉపయోగించక తప్పదు. అలా కాకుండా బ్యాటరీతో పని చేసే నైఫ్ షార్ప్‌నర్ ఉంటే ఇక ఆ శ్రమ కూడా అక్కర్లేదు కదా.. అనుకుంటున్నారా? అందుకోసమేగా ఈ ‘కార్డ్‌లెస్ మల్టీఫంక్షన్ షార్ప్‌నర్’ ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేసింది! ఇది చూడడానికి చిన్న సైజు నీటి మోటార్ ఆకారంలో ఉంటుంది. ఫొటోలో చూపించినట్లుగా బ్యాటరీ సహాయంతో నడిచే దీనికి ముందుభాగంలో రాయితో చేసిన విభిన్న ఆకృతుల్లో ఉండే షార్ప్నర్స్ ఉంటాయి. ఫొటోలో చూపించినట్లుగా జిగ్జాగ్లా ఉండే కత్తులు, బాగా మొద్దుబారిన కత్తులు, కత్తెర.. వంటి వాటిని విడివిడిగా షార్ప్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఈ టూల్‌కి పక్కభాగంలో ఉండే బటన్ని ఆన్ చేస్తే సరి. ఆ షార్ప్నర్స్ తిరుగుతూ కత్తిని పదునుపెడతాయి. అంతేకాదండోయ్.. ఈ గ్యాడ్జెట్ సహాయంతో వైర్ కట్టర్స్, స్క్రూడ్రైవర్స్.. వంటివి పదును పెట్టుకోవడానికి వీలుగా విభిన్న ఆప్షన్లను కూడా ఇందులో పొందుపరిచారు డిజైనర్లు. ఈ మెషీన్ నాణ్యతను బట్టి ధర రూ.320 నుండి రూ.999 వరకు ఉంటుంది.

3-స్టేజ్ కిచెన్ నైఫ్ షార్ప్‌నర్
కూరగాయలు కట్ చేయాలంటే కత్తి మధ్య భాగంలో షార్ప్‌గా ఉండాలి.. అదే కార్వింగ్ డిజైన్ చేయాలంటే కత్తి మొనభాగం పదునుగా ఉండాలి.. ఇలా మన అవసరాన్ని బట్టి పదునైన కత్తిని వాడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే మన ఉపయోగాన్ని బట్టి చాకును పదును పెట్టుకునే విధంగా రూపొందించారీ ‘3-స్టేజ్ కిచెన్ నైఫ్ షార్ప్‌నర్’. ఇందులో కత్తిని ఒకే దిశలో పదును పెట్టాల్సి ఉంటుంది (అంటే.. కత్తిని మొనతో మొదలుపెట్టి చివరి వరకు వచ్చాక.. మళ్లీ మొన దగ్గర నుండే పదును చేయడం మొదలు పెట్టాలన్నమాట). దీన్నే వన్-డైరెక్షన్ షార్ప్‌నర్ అంటారు. ఈ గ్యాడ్జెట్లో మూడు రకాల షార్ప్నర్స్ ఉంటాయి. ఒక షార్ప్‌నర్ సెరామిక్ రాడ్‌తో తయారుచేశారు.. ఇందులో కూరగాయలు, మాంసాన్ని కట్ చేసే కత్తులను పదును చేసుకోవచ్చు. ఇక రెండో షార్ప్నర్ని ‘డైమండ్ రాడ్’ అంటారు. దీనిని ఉపయోగించి కత్తి మొనలను షార్ప్ చేసుకోవచ్చు. ఇలాంటి కత్తులను ఉపయోగించి కూరగాయలతో వివిధ రకాల డిజైన్స్‌ని తయారుచేయచ్చు. చివరగా టంగ్స్టన్ స్టీల్ బ్లేడ్‌తో తయారుచేసిన షార్ప్‌నర్ ఉంటుంది. ఇది చాలా గట్టిది కావడం వల్ల సెరామిక్ బ్లేడ్స్ లాంటివి కూడా దీంతో పదును చేసుకోవచ్చు. దీనితో పాటు వంగిపోయిన మెటాలిక్ బ్లేడ్స్‌ని సైతం తిరిగి యధాస్థితికి తీసుకురావచ్చు. దీని నాణ్యత, డిజైన్ని బట్టి ధర రూ.370 నుండి రూ.700 వరకు ఉంటుంది.

క్లీవర్ నైఫ్ షార్ప్‌నర్..
మామూలు కత్తులతో పోలిస్తే మాంసాన్ని కట్ చేసే కత్తులు కాస్త పెద్దవిగా, దృఢంగా ఉంటాయి. అంతేకాదు.. వాటికి పదును కూడా కాస్త ఎక్కువగా అవసరమవుతుంది. ఇలాంటి కత్తుల్ని పదునెక్కించడానికి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోకొచ్చేసింది ‘క్లీవర్ నైఫ్ షార్ప్‌నర్’. చిత్రంలో చూపించిన విధంగా చాలా చిన్నగానే కనిపించినా.. దీని మధ్యలో అమర్చిన షార్ప్నర్స్ చాలా దృఢంగా ఉంటాయి. మాంసపు కత్తిని ఈ బ్లేడ్స్ మధ్యలో ఉంచి ముందు నుంచి వెనక్కి లాగుతూ పదును పెట్టాల్సి ఉంటుంది. ఇలా ఎంతో ఈజీగా క్లీవర్ నైఫ్స్ని షార్ప్ చేసుకోవచ్చు. ఈ టూల్ నాణ్యతని బట్టి ధర రూ.299 నుండి రూ.450 వరకు ఉంటుంది.
గమనిక: కూరగాయలు, మాంసాన్ని కట్ చేశాక కత్తులను శుభ్రపరచడం మర్చిపోవద్దు. ఇలా పరిశుభ్రంగా ఉండే కత్తులనే పదును చేయడం వల్ల ఆ టూల్లో పదార్థపు అవశేషాలు చిక్కుకోకుండా.. తద్వారా అది అపరిశుభ్రంగా మారకుండా కాపాడుకోవచ్చు.
కిచెన్‌లో మగువల పనిని సులభతరం చేసే ఇలాంటి మరిన్ని గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకోవాలంటే www.vasundhara.net లో ‘కిచెన్ గ్యాడ్జెట్స్’ శీర్షికలో ప్రతి మంగళవారం ప్రచురితమయ్యే ప్రత్యేక వ్యాసాన్ని చదవండి.