స్ప్రౌట్స్ (మొలకలు), మైక్రో గ్రీన్స్.. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో శరీరానికి కావాల్సిన పోషణ అందించగలిగే ఔషధాలివి. అంతేనా.. బరువు తగ్గించడంలోనూ వీటికి సాటి మరొకటి లేదనడంలో సందేహం లేదు. అయితే ఇవి తినడం వరకు బాగానే ఉంది కానీ.. తయారుచేసుకోవడమే కాస్త శ్రమతో కూడుకున్న పని అంటూ దాటేసే వారే మనలో చాలామంది ఉంటారు. అలాంటి వారికోసమే ఈజీగా మొలకలు, మైక్రో గ్రీన్స్ తయారుచేసే గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోకొచ్చేశాయి. ఇక మీరు వాటిని ఉపయోగిస్తే కాటన్ క్లాత్, విత్తనాలు నానబెట్టడం, అవి మొలకెత్తే వరకు వాటిని పదే పదే నీటితో తడపడం.. వంటి పనులేవీ చేయాల్సిన అవసరం లేదు. మరి, ఎంతో సునాయాసంగా స్ప్రౌట్స్‌ని తయారుచేసుకునే ఆ స్ప్రౌట్ మేకింగ్ టూల్స్ ఏంటో చూసేద్దామా??

ఈజీ గ్రీన్ అటోమేటిక్ స్ప్రౌటర్
వివిధ రకాల స్ప్రౌట్స్, మైక్రో గ్రీన్స్ ఏకకాలంలో తయారుచేసుకోవాలనుకునే వారికి ఈ ‘ఈజీ గ్రీన్ ఆటోమేటిక్ స్ప్రౌటర్’ బాగా ఉపయోగపడుతుంది. ఇది చూడడానికి పెద్ద గాజు డబ్బాలా ఉంటుంది. ఈ పరికరం వెనక భాగంలో నీళ్లు పోసుకోవడానికి మరో డబ్బా అమరి ఉంటుంది. తేమను ఉత్పత్తి చేసే మిస్ట్ జనరేటర్‌ని నీటికి అటాచ్ చేసి ఉంచుతారు. అలాగే, నీటిని తొలగించడానికి డ్రైనింగ్ పైప్ కూడా అమరి ఉంటుంది. ఫొటోలో చూపించినట్లుగా ఇక ముందు భాగంలో పెద్ద ర్యాక్లాగా ఉండి.. అందులో 5 పొడవాటి కంటెయినర్స్ అమర్చుకునే వీలుంటుంది. వీటి సహాయంతో ఒక్కోదానిలో ఒక్కోరకం స్ప్రౌట్స్, మైక్రో గ్రీన్స్ తయారుచేసుకోవచ్చు. ముందురోజు రాత్రంతా గింజలను నానబెట్టి.. ఆపై వాటిని కంటెయినర్స్‌లో నింపి.. ఫొటోలో చూపించినట్లుగా ర్యాక్‌లో అమర్చాలి. ఇప్పుడు మూతపెట్టి మిస్ట్ జనరేటర్‌ని ఆన్ చేస్తే సరి.. ఆటోమేటిక్‌గా తేమ ఉత్పత్తవుతూ 1-2 రోజుల్లో స్ప్రౌట్స్ సిద్ధమవుతాయి. ఒకవేళ మైక్రోగ్రీన్స్ పెంచాలనుకుంటే బాక్స్ మూత లోపలివైపు పైభాగంలో లైట్ ఉంటుంది. దాన్ని ఆన్ చేస్తే నీటితో పాటు వాటికి సరైన వెలుతురు కూడా అందుతుంది. ఇలా ఒక వారం రోజుల్లో మైక్రోగ్రీన్స్ కూడా రడీ అయిపోతాయి. అయితే వీటిని పెద్ద మొత్తంలో తయారుచేసుకోవాలనుకునే వారికి ఈ మెషీన్ బాగా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాదు.. ఈ మెషీన్ ధర కూడా కాస్త ఎక్కువే. నాణ్యతను బట్టి దీని ధర రూ.5000 మొదలవుతుంది.

టెర్రకోటా స్ప్రౌట్ మేకర్
ఈ మధ్య కాలంలో మట్టి పాత్రల వాడకం బాగా పెరిగిందని చెప్పుకోవాలి. వంట పాత్రల దగ్గర్నుంచి సర్వింగ్ బౌల్స్, ప్లేట్స్.. వరకు ప్రతిదీ మట్టితో చేసిన వాటినే ఉపయోగిస్తున్నారు. ఈ కాలానికి తగ్గట్టుగా మట్టి పాత్రలకు కాస్త ఆధునికతను జోడించి సరికొత్తగా మార్కెట్లో సందడి చేస్తున్నాయీ పాత్రలు. ఈ క్రమంలోనే మట్టితో రూపొందించిన స్ప్రౌట్ మేకర్స్ మన ముందుకొచ్చేశాయ్! ఈ ‘టెర్రకోటా స్ప్రౌట్ మేకర్’ కూడా అదే కోవలోకి చెందుతుంది. చిత్రంలో చూపించిన విధంగా చూడడానికి లంచ్ క్యారియర్లా ఉంటుందిది. కింది పాత్ర మినహా మిగతా పాత్రలన్నింటికీ అడుగున చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. మనం చల్లిన నీరు విత్తనాల్లో నిల్వ ఉండకుండా అడుగున ఉండే పాత్రలోకి చేరుకోవడానికి ఈ రంధ్రాలు ఉపయోగపడతాయి. అయితే ఈ స్ప్రౌట్ మేకర్ని ఉపయోగించడానికి అరగంట ముందు పాత్రలన్నింటినీ నీళ్లలో నానబెట్టాలి. ముందుగా రాత్రంతా నానబెట్టిన విత్తనాలను ఆయా పాత్రలలో పోసి పాత్రలను ఒకదానిపై ఒకటి పేర్చి నీటిని చల్లాలి. ఆ నీరు రంధ్రాల ద్వారా అడుగు పాత్రలోకి చేరతాయి. ఇలా ఒక్కోసారి నీళ్లు చల్లుతూ ఉండాలి. అలా చేయడం వల్ల ఆ విత్తనాల్లో తేమ నిలిచి ఉండి.. ఒకట్రెండు రోజుల్లో మొలకలుగా మారతాయి. ఈ స్ప్రౌట్ మేకర్ నాణ్యత, పాత్రల సంఖ్యను బట్టి వీటి ధర రూ.1300 నుండి రూ.3900 వరకు ఉంటుంది.

స్ప్రౌట్ మేకర్ బాక్స్
స్ప్రౌట్స్ మొలకెత్తాయా లేదా అని చూడడానికి ప్రతిసారీ బాక్స్‌ని ఓపెన్ చేయకుండా ట్రాన్స్పరెంట్ బాక్స్ అయితే బాగుంటుంది కదూ!! అనుకుంటున్నారా? అలాంటి వారికోసమే ఈ ‘స్ప్రౌట్ మేకర్ బాక్స్’ మార్కెట్లోకొచ్చేసింది. చిత్రంలో చూపించిన లేయర్స్ బాక్సుల మాదిరిగా ఉంటుందీ గ్యాడ్జెట్. అడుగు పాత్ర మినహా పై పాత్రల్లో 12 గంటల పాటు నానబెట్టిన విత్తనాల్ని సమానంగా పరచాలి. ఇక పై పాత్రలో నీటిని నింపి మూత పెట్టేయాలి. ఇప్పుడు ప్రతి పాత్రకు ఉన్న ఎర్రటి రంధ్రం ద్వారా నీళ్లు కొద్దికొద్దిగా కింది పాత్రల్లోకి వెళ్తూ అడుగుభాగంలోని బాక్సులోకి చేరుకుంటాయి. ఈ క్రమంలో విత్తనాలు తేమగా ఉండి.. మొలకలు వస్తాయి. ఇలా తేలిగ్గా, ఎలాంటి శ్రమ లేకుండా మొలకలను తయారుచేసుకోవచ్చు. ఈ మేకర్ నాణ్యతను బట్టి దీని ధర రూ.118 నుండి రూ.250 వరకు ఉంటుంది.

స్ప్రౌట్ జార్
గింజలను ఓ గిన్నెలో నానబెట్టి.. ఆపై వాటిని క్లాత్‌లో కట్టి.. పదే పదే నీళ్లు చల్లడం.. ఇదో పెద్ద పని అనుకునేవారూ లేకపోలేదు. అలాగే ఎక్కడికెళ్లినా తమ స్వహస్తాలతో స్ప్రౌట్స్ తయారుచేసుకోవాలనుకునే వారూ ఉంటారు. అలాంటి వారికి ‘స్ప్రౌట్ జార్’ చక్కటి ఎంపిక. ఫొటోలో చూపించినట్లుగా అచ్చం జార్ మాదిరిగా ఉంటుందిది. ఈ జార్లో తగినన్ని నీళ్లు పోసి మీకు నచ్చిన విత్తనాలను నానబెట్టుకోవాలి. ఆపై జల్లెడలా ఉండే మూత బిగించేయాలి. విత్తనాలు నానిన తర్వాత నీళ్లు వంపేయాలి. అంతే.. అందులో తేమ నిలిచి ఉండి ఒకట్రెండు రోజుల్లో మొలకలు తయారవుతాయి. ఒకవేళ పైనుండే విత్తనాలు ఆరిపోయినట్లుగా కనిపిస్తే.. జల్లెడలాంటి మూతపై కాసిన్ని నీళ్లు చల్లితే సరి.. ఇలా ఈజీగా స్ప్రౌట్స్‌ని తయారుచేసుకోవచ్చు. మీరు ప్రయాణాల్లో ఉన్నా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని నాణ్యతని బట్టి ధర రూ.280 నుండి రూ.580 వరకు ఉంటుంది.

బీన్ స్ప్రౌట్స్ మెషీన్
మొలకలు తయారుచేసే క్రమంలో నీటిని మనం చల్లాల్సిన అవసరం లేకుండానే దానంతటదే చల్లుకుంటూ ఉంటే ఎంత బావుంటుందో!! మనకసలు పనే ఉండదు.. ఎంచక్కా మొలకెత్తిన గింజల్ని తినడమే ఆలస్యం.. అనుకుంటున్నారా? అయితే ‘బీన్ స్ప్రౌట్ మెషీన్’ కొని మీ ఇంటికి తెచ్చుకోవాల్సిందే! చిత్రంలో చూపించిన విధంగా ఇది అచ్చం మిక్సీలా ఉంటుంది. ఈ మెషీన్లో తెల్లగా ఉన్న బాక్స్‌ని నీటితో నింపుకోవాలి. దానిపై గ్రీన్ కలర్ బాక్స్‌లో ఉండే లేయర్లలాంటి ట్రేలలో నానబెట్టిన విత్తనాలతో సమానంగా పరవాలి. ఇప్పుడు ఈ మిషన్ మధ్యలో వాటర్ పైప్‌ని అమర్చాలి. పైప్‌కి పైభాగంలో చిన్న చిన్న రంధ్రాలుండే ఫ్యాన్‌ను అమర్చాలి. ఆఖరుగా మూత పెట్టేసి మెషీన్ తెలుపు రంగు డబ్బాపై ఉండే వాటర్ బటన్ని నొక్కితే కింది డబ్బాలో ఉన్న నీళ్లు ఫ్యాన్ ద్వారా విత్తనాలపై చిల్లుతాయి. ఆ నీళ్లు మళ్లీ ట్రేలకు ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా అడుగు డబ్బాలోకి చేరిపోతాయి. ఇలా విత్తనాలు ఎప్పుడూ తేమగా ఉండి మొలకలు తయారవుతాయి. ఈ టూల్ నాణ్యతను బట్టి దీని ధర రూ.2000 నుండి రూ.3000 వరకు ఉంటుంది.
ఇలాంటి మరెన్నో సరికొత్త కిచెన్ గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకోవాలంటే www.vasundhara.net లో ప్రతి మంగళవారం ‘కిచెన్ గ్యాడ్జెట్స్’ శీర్షికలో ప్రచురితమయ్యే ప్రత్యేక వ్యాసాన్ని మిస్ కాకుండా చదవండి.
Photos: Amazon.in