‘నువ్విప్పుడు అన్నం తినకపోతే బూచాడు పట్టుకుపోతాడు..’, ‘చూడు చూడు చందమామ నిన్నే చూస్తున్నాడు..’, ‘నువ్వు అన్నం తినకపోతే.. ఇదిగో ఈ బుజ్జి కుక్కపిల్ల నీ అన్నమంతా తినేస్తుంది..’ పిల్లల చేత గోరుముద్దలు తినిపించేటప్పుడు తల్లులు ఇలా ఎన్నెన్ని కబుర్లు చెబుతారో మనకు తెలిసిందే. ఇలా వాళ్ల చేత కాస్త బలవంతంగా తినిపించాలని చూసినా.. అన్నం గిన్నెను నెట్టేస్తారు. అంతే అందులోని అన్నమంతా నేలపాలు. అంతేకాదు.. ఎవరికి వారు సొంతంగా తినే పిల్లలైనా సరే.. ఎంతో రుచికరంగా వండి వడ్డించినా తిననంటూ మారాం చేస్తుంటారు. దీంతో తల్లులకు విసుగొచ్చేస్తుంటుంది. మరి పిల్లలు తల్లులకు ఎలాంటి కష్టం కలిగించకుండా అన్నం తినాలన్నా.. వాళ్లు తినే గిన్నె నెట్టేసినా, బోర్లించినా అందులోని పదార్థం కిందపడకుండా ఉండాలన్నా.. అందుకోసం బోలెడన్ని గ్యాడ్జెట్లు మార్కెట్లోకొచ్చేశాయి. మరి, చిన్నారులకు ఆహారం తినిపించే లేదా వారే స్వయంగా ఆహారం తినే పనిని మరింత ఈజీ చేసేసిన అలాంటి కొన్ని గ్యాడ్జెట్ల గురించి ఈ వారం ప్రత్యేకంగా మీకోసం..

గైరోస్కోపిక్ బౌల్..
పిల్లలకు అన్నం తినిపించడమే ఓ పెద్ద టాస్క్ అంటే.. ఇక వాళ్లు మన చేతిలోని గిన్నెను నెట్టకుండా కాపాడుకోవడం ఇంకో పెద్ద టాస్క్. అయితే ఇక నుండి మీ పిల్లలకు అన్నం తినిపించే క్రమంలో మీ చేతిలోని గిన్నెను వారు నెట్టేస్తారని భయపడాల్సిన పనిలేదు. అంతేకాదు.. అలా నెట్టేసినా అన్నం ఒలికిపోకుండా ఉండేందుకే ‘గైరోస్కోపిక్ బౌల్’ మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ఇది చూడడానికి అచ్చం వేగాన్ని కొలిచే గైరోస్కోప్ పరికరంలాగా ఉంటుంది. అందుకే దీనికి ఈ పేరు పెట్టారు. చిత్రంలో చూపించిన విధంగా మధ్య భాగంలో 2గిన్నెలు ఒకదాంట్లో ఒకటి అమర్చినట్లుగా ఉండి.. చుట్టూ పట్టుకోవడానికి వీలుగా హ్యాండిల్ లాంటిది ఉంటుంది. దాన్ని 360 డిగ్రీలలో ఎలా తిప్పినా కూడా మధ్యలో అమర్చిన గిన్నె యథా స్థానంలో ఉంటూ అందులోని పదార్థం కిందపడదు. అంతేకాదు.. గిన్నెలో ఉన్న పదార్థంపై దుమ్ము పడకుండా.. దాని కింద ఆనుకొని ఉన్న మరో గిన్నెను ఫొటోలో చూపించినట్లుగా మూతలా అమర్చుకోవచ్చు. సో, ఇక నుండి పిల్లలు ఎంత తిప్పి తిప్పి తోసేసినా.. గిన్నెలోని అన్నం ఎంతో సేఫ్‌గా ఉంటుంది. దీని నాణ్యతను బట్టి ధర రూ.150 నుండి రూ.1500 వరకు ఉంటుంది.

బేబీ ఫుడ్ డిస్పెన్సింగ్ స్పూన్..
చిన్న పిల్లలకు చేతులతో ముద్దలు కలిపి పెట్టాలంటే కష్టం. వాళ్ల చిట్టి నోటికి మన చేతులు చాలా పెద్దవవుతాయి. అందుకే పిల్లల కోసం చిన్న చిన్న స్పూన్లను ఉపయోగిస్తుంటాం. గిన్నె అవసరం లేకుండా మనం పెట్టే స్పూన్‌లోనే ఫుడ్‌ని కూడా నింపుకోగలిగితే బాగుంటుంది కదూ! మరి అటువంటి ఆలోచన నుంచి రూపొందించిందే ఈ ‘బేబీ ఫుడ్ డిస్పెన్సింగ్ స్పూన్’. చిత్రంలో చూపినట్లుగా ముందు భాగంలో స్పూన్ ఉండి.. వెనకాల పౌచ్లా ఉంటుందీ గ్యాడ్జెట్. వెనుక భాగాన్ని ఓపెన్ చేసుకుని అందులో ఫుడ్ లేదా జావ లాంటి దాన్ని నింపుకొని మూతపెట్టుకోవాలి. వెనక భాగాన్ని నెమ్మదిగా నొక్కిన ప్రతిసారీ అందులోంచి ముందు భాగంలో ఉండే స్పూన్లోకి కొంచెం కొంచెం పదార్థం వస్తుంది. ఇక గిన్నె పట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు. కేవలం ఈ చిన్న స్పూన్ చాలు. జావ, మెత్తగా ఉన్న పదార్థాలను పిల్లలకు తినిపించడానికి చక్కగా ఉపయోగపడుతుందీ స్పూన్. దీని నాణ్యతను బట్టి రూ. 300 నుండి రూ.1200 వరకు ఉంటుంది.

స్టికబుల్ బేబీ ఫీడింగ్ బౌల్..
మనం గిన్నెలో అన్నం కలిపి పిల్లల ముందు పెట్టడం ఆలస్యం.. ఒక్కోసారి విసిరికొట్టేస్తారు. మనం ఉపయోగించే గిన్నె టేబుల్‌కు అతుక్కునేలా ఉండేదైతే.. అప్పుడిక వాళ్లెంత లాగినా గిన్నె, అందులోని పదార్థం కూడా చాలా సేఫ్‌గా ఉంటాయి. అలాంటిదే ఈ ‘స్టికబుల్ బేబీ ఫీడింగ్ బౌల్’ కూడా! ఫొటోలో చూపించినట్లుగా ఇది చూడడానికి సాధారణమైన బౌల్‌లా ఉంటుంది. దీని అడుగు భాగంలో గిన్నె అతుక్కోవడానికి వీలుగా ఒక ప్లేట్ లాంటి స్టాండ్ ఉంటుంది. ఇప్పుడు ఈ స్టాండ్‌ని గిన్నెతో సహా మనం టేబుల్‌పై గట్టిగా ప్రెస్ చేయగానే అది టేబుల్‌కి అతుక్కుపోతుంది. సో.. ఫుడ్ బౌల్‌ని పిల్లలు నెట్టేయడానికి నో ఛాన్స్. స్వయంగా ఆహారం తీసుకునే పిల్లలు కూడా ఈ బౌల్ సహాయంతో అందులోని అన్నం కింద పడకుండా తినేయచ్చు. ఈ బౌల్ నాణ్యతను బట్టి ధర రూ.800 నుండి రూ.2500 వరకు ఉంటుంది.

360 డిగ్రీస్ సిప్పీ కప్..
చిన్న పిల్లలకు గ్లాసులతో నీళ్లు తాగించడం కష్టం. ఒక్కోసారి అవి వారి గొంతులోకి, ముక్కులోకి వెళ్తే పొలమారుతుంది. అంతేకాదు.. వాళ్లు నీళ్లు తాగడం కన్నా కింద ఒలకపోయడమే ఎక్కువ. అలాగని ఎంత సేపూ సిప్పర్స్ వాడితే వాళ్లకు గ్లాసుతో తాగడం ఎప్పుడు అలవాటవుతుంది. అందుకే చిన్నారులకు నీళ్లు తాగడం నెమ్మదిగా అలవాటు చేయాలంటే ఈ ‘360 డిగ్రీస్ సిప్పీ కప్’ మంచి ఎంపిక. చిత్రంలో చూపిన విధంగా ఇది చూడడానికి అచ్చం గ్లాస్లానే ఉంటుంది. దీనికి రెండు వైపులా పట్టుకోవడానికి హ్యాండిల్స్ కూడా ఉంటాయి. ఈ కప్ పైభాగంలో చిన్న చిన్న రంధ్రాల గల మూత ఉంటుంది. అందులోంచి కొన్ని కొన్ని నీళ్లు మాత్రమే బయటికి వస్తూ వారు తాగడానికి అనువుగా ఉంటుందీ గ్లాస్. అలాగే ఈ గ్లాస్ సహాయంతో పాలు కూడా తాగించచ్చు. తాగడం పూర్తయ్యాక దీనికి మూత కూడా పెట్టేసుకోవచ్చు. దీని నాణ్యతను బట్టి ధర రూ.280 నుండి రూ.1600 వరకు ఉంటుంది.

బేబీ ఫుడ్ కుక్కర్..
ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే అన్నం కాస్త మెత్తగా ఉడికించాల్సి ఉంటుంది. కానీ అదే మెత్తటి అన్నాన్ని మనం తినాలంటే కాస్త కష్టంగానే ఉంటుంది. అంతేకాదు.. వారికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా కొంత కొంత మొత్తాల్లో అన్నం, కూర చేయాల్సి వస్తుంది. ఇలా పదే పదే చేయాలన్నా విసుగుతో కూడుకున్న పని. కానీ ‘బేబీ ఫుడ్ కుక్కర్’ ఉంటే ఆ పని మరింత సులువవుతుంది. అన్నం దగ్గర్నుంచి పప్పు, కాయగూరలు ఈ కుక్కర్లో ఉడికించడం ఎంతో సులువు. చిత్రంలో చూపిన విధంగా అచ్చం మిక్సర్ గ్రైండర్‌ని పోలి ఉంటుందీ కుక్కర్. ఇప్పుడు జార్లో మీకు కావాల్సిన పదార్థం (అన్నం లేదా కూరగాయలను) వేసి.. పక్కన ఉన్న మరో జార్లో తగినంత నీళ్లు పోసి అచ్చం రైస్ కుక్కర్లాగే ‘స్టీమ్’ మోడ్‌ని ఆన్ చేయాలి. అది ఉడికిన తర్వాత మీరు దాన్ని మెత్తని మిశ్రమంలా రుబ్బుకోవాలంటే ‘మిక్సింగ్’ మోడ్‌ని ఎంచుకుంటే ఆ పదార్థం మెత్తటి ఉగ్గులా తయారవుతుంది. ఇక దీన్ని గిన్నెలోకి తీసుకుని మీ పిల్లలకు తినిపించడమే ఆలస్యం! దీని నాణ్యతను, మోడల్ని బట్టి ధర రూ.850 నుండి రూ.6000 వరకు ఉంటుంది.
ఇలాంటి మరెన్నో సరికొత్త కిచెన్ గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకోవాలంటే www.vasundhara.net లో ప్రతి మంగళవారం ‘కిచెన్ గ్యాడ్జెట్స్’ శీర్షికలో ప్రచురితమయ్యే ప్రత్యేక వ్యాసాన్ని చదవండి.
Photos: amazon.in