కాయగూరలు తరగడానికైనా, పండ్లను ముక్కలుగా కట్ చేయాలన్నా.. చాపింగ్ బోర్డ్ తప్పనిసరి. ఒక్కమాటలో చెప్పాలంటే చాపింగ్ బోర్డ్ లేని కిచెన్ అసంపూర్ణమనే చెప్పుకోవాలి. అంతలా వంటింట్లో కీలక పాత్ర పోషిస్తోందీ బోర్డ్. అయితే చాపింగ్ బోర్డ్ అనగానే మనందరికీ ఫ్లాట్‌గా ఉండే సాధారణ కటింగ్ బోర్డులే గుర్తొస్తాయి. కానీ వాటిని తలదన్నే వెరైటీ చాపింగ్ బోర్డులు ప్రస్తుతం మార్కెట్లో సందడి చేస్తున్నాయి. చూడడానికి ఆకర్షణీయంగా ఉండడమే కాదు.. అందుబాటు ధరల్లోనే లభిస్తోన్న ఈ బోర్డులతో కాయగూరల్ని తరిగే పని కూడా కాస్త ఈజీగా పూర్తవుతుంది. మరి, అలాంటి కొన్ని విభిన్న చాపింగ్ బోర్డులు, అవి మనకెలా ఉపయోగపడతాయో ఈ వారం తెలుసుకుందాం రండి..

ఫోల్డబుల్ కటింగ్ బోర్డ్..
సాధారణంగా చాపింగ్ బోర్డు అంటే కేవలం కాయగూరల్ని కట్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇక కట్ చేసుకున్న కాయగూర ముక్కల్ని వేరే బౌల్లోకి మార్చుతుంటాం. అలాగే కట్ చేయడానికి ఫ్రిజ్‌లో నుంచి బయటికి తీసే వెజిటబుల్స్ కూడా వేరే గిన్నె లేదా బాస్కెట్లో వేసి శుభ్రం చేస్తాం. మరి, ఈ పనులన్నీ వేర్వేరుగా కాకుండా ఒకేసారి.. అది కూడా చాపింగ్ బోర్డ్‌తో చేసే వీలుంటే ఎంత బాగుటుందో కదూ!! అందుకోసమే.. ఈ ‘ఫోల్డబుల్ కటింగ్ బోర్డులు’ మార్కెట్లో కొలువుదీరాయి.
ఫొటోలో చూపించినట్లుగా ఫ్లాట్‌గా ఉండే చాపింగ్ బోర్డు మాదిరిగానే ఉంటుందిది. అయితే దీన్ని మధ్యభాగంలో కిందికి నొక్కడం వల్ల అది బాస్కెట్లా మారే ప్రత్యామ్నాయం ఇందులో ఉంటుంది. ఈ చాపింగ్ బోర్డును ముందుగా బాస్కెట్లా మార్చి.. అందులో కట్ చేయాలనుకున్న కాయగూరల్ని తీసుకొని ట్యాప్ కింద ఉంచి కడగాలి. ఈ కడిగిన నీళ్లు బయటికి పోవాలంటే దీనికి అడుగున ఉన్న బటన్ని ప్రెస్ చేస్తే సరి.. దాని గుండా నీళ్లు సింక్‌లో పడిపోతాయి. ఆపై ఈ బాస్కెట్‌ను కిచెన్ ప్లాట్‌ఫామ్‌పై ఉంచి.. దీనికి ఇరువైపులా ఉన్న హ్యాండిల్స్‌ను కిందికి ప్రెస్ చేస్తే ఫ్లాట్‌గా వెజిటబుల్ కటింగ్ బోర్డులా మారుతుంది. ఆపై ఎంచక్కా కాయగూరల్ని కట్ చేసుకోవచ్చు. టొమాటో వంటి కొన్ని కాయగూరల్ని కట్ చేసేటప్పుడు వాటి నుంచి బయటికి వచ్చిన జ్యూస్ లాంటి పదార్థం కూడా ప్లాట్‌ఫామ్‌పై పడకుండా బోర్డు అడుగుకు వెళ్లిపోతుంది. కాబట్టి ప్లాట్ ఫామ్ శుభ్రం చేసే పని కూడా తప్పుతుంది. ఇలా కాయగూరల్ని కట్ చేసుకోవడానికి ఎంతో అనువుగా ఉండే ఈ చాపింగ్ బోర్డు నాణ్యతను బట్టి ధర రూ. 499 నుంచి రూ. 647 వరకు ఉంది.

వెజిటబుల్ కటింగ్ బోర్డ్ విత్ ర్యాక్..
ఇదేవిధంగా కట్ చేయడం, ఆ ముక్కల్ని కడగడం చాపింగ్ బోర్డ్‌పైనే పూర్తి చేసేందుకు ఉపయోగించే మరో ఉపకరణం ఈ ‘వెజిటబుల్ కటింగ్ బోర్డ్ విత్ ర్యాక్’. ఫొటోలో చూపించినట్లుగా చదునుగా ఉండే చాపింగ్ బోర్డ్‌కు కింద నెట్ బాస్కెట్ లాంటి ర్యాక్ అమరి ఉంటుంది. ఈ ర్యాక్‌ను మనకు కావాలనుకున్నప్పుడు బోర్డు నుంచి విడదీసే అమరిక ఉంటుంది. ఇప్పుడు బోర్డుపై కాయగూరల్ని కట్ చేసుకొని.. ఆ ముక్కల్ని దానికి అనుసంధానమై ఉన్న ర్యాక్‌లో వేసేయాలి. కట్ చేయడం పూర్తయ్యాక ఆ ర్యాక్‌లోనే కడిగేసుకోవచ్చు. దీనికి ఎలాగో రంధ్రాలుంటాయి కాబట్టి కడిగిన నీళ్లు బయటకు వచ్చేస్తాయి. ఈ గ్యాడ్జెట్ నాణ్యతను బట్టి ధర రూ. 289 నుంచి రూ. 459 వరకు ఉంది.

చాప్ టు పాట్ కటింగ్ బోర్డ్..
చాపింగ్ బోర్డ్ వెడల్పుగా ఉంటుంది కాబట్టి దానిపై కట్ చేసిన కాయగూరల్ని నేరుగా ఫ్రైయింగ్ ప్యాన్‌లో వేయడం కష్టమవుతుంది. ఈ క్రమంలో కొన్ని కాయగూర ముక్కలు కింద పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అలా జరగకుండా కాయగూరల్ని కట్ చేసిన ఈ చాపింగ్ బోర్డును స్పూన్‌లా ఫోల్డ్ చేసుకోగలిగితే బాగుంటుంది కదూ!! అలాంటిదే ఈ ‘చాప్ టు పాట్ కటింగ్ బోర్డ్’.
ఫొటోలో చూపించినట్లుగా చదునుగా ఉండే ఈ చాపింగ్ బోర్డ్ వెడల్పాటి స్పూన్‌లా ఫోల్డ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఈ బోర్డ్‌పై కాయగూరల్ని కట్ చేసుకొని ఆపై దీన్ని ఫొటోలో చూపించినట్లుగా మడచుకొని ఇందులోని కాయగూర ముక్కల్ని నేరుగా ఫ్రైయింగ్ ప్యాన్‌లో వేసేసుకోవచ్చు. ఇలా వాడుకోవడానికి ఎంతో సులభంగా ఉండే ఈ చాపింగ్ బోర్డ్ నాణ్యతను బట్టి ధర రూ. 385 నుంచి రూ. 575 వరకు ఉంది.

చాపింగ్ బోర్డ్ విత్ రిమూవబుల్ బాస్కెట్..
కట్ చేసిన కాయగూర ముక్కలు లేదంటే తరిగిన క్యాబేజీ, ఇతర ఆకుకూరలను వేరే బౌల్లోకి తీసుకోకుండా నేరుగా ఫ్రైయింగ్ ప్యాన్‌లో వేసుకోవడానికి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న చాపింగ్ బోర్డుల్లో ‘చాపింగ్ బోర్డ్ విత్ రిమూవబుల్ బాస్కెట్’ ఒకటి.
ఫొటోలో చూపించినట్లుగా చాపింగ్ బోర్డుని కిచెన్ ప్లాట్‌ఫామ్‌కు ఫిక్స్ చేసుకునే వీలుంటుంది. ఇక ఈ బోర్డుకు అనుసంధానమై మరో బాస్కెట్ ఉంటుంది. కట్ చేసిన కాయగూరలు లేదా ఆకుకూరల్ని చాకుతోనే ఈ బాస్కెట్లోకి నెట్టుకొని.. ఈ బాస్కెట్‌ను బోర్డు నుంచి వేరుచేసి అందులో ఉండే ముక్కలు లేదా తురుమును ఫ్రైయింగ్ ప్యాన్‌లో నేరుగా వేసేసుకోవచ్చు. ఇలా చేతికి ఎంతో అనువుగా ఉండే ఈ చాపింగ్ బోర్డ్ కమ్ బాస్కెట్ నాణ్యతను బట్టి ధర రూ. 549 నుంచి రూ. 999 వరకు ఉంది.

వెజిటబుల్ క్లెవర్ కటర్..
గుండ్రంగా తరిగిన క్యారట్, కీరా స్లైసుల్ని కొన్ని వంటకాలపై గార్నిష్ చేయడం, లేదంటే సలాడ్స్‌లో ఉపయోగించడం మనకు తెలిసిందే. అయితే వాటిని చాపింగ్ బోర్డుపై కట్ చేసే వారు కొందరైతే.. మళ్లీ చాపింగ్ బోర్డు, చాకు ఎవరు శుభ్రం చేస్తారన్న ఉద్దేశంతో కత్తెర (వెజిటబుల్ సీజర్) వాడే వారు మరికొందరు! ఈ క్రమంలో వాటిని స్లైసుల్లా కట్ చేసేటప్పుడు ఆ ముక్కలు ఎగిరి వేరే చోట పడే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా సులభంగా క్యారట్, కీరా స్లైసుల్ని కట్ చేసుకోవాలంటే ‘వెజిటబుల్ క్లెవర్ కటర్’ అందుకు చక్కటి ఎంపిక.
ఫొటోలో చూపించినట్లుగా అచ్చం కత్తెర మాదిరిగానే ఉంటుందిది. కాకపోతే పైవైపు చాకు, కిందివైపు చిన్న చాపింగ్బోర్డుతో అనుసంధానమై చూడడానికి వెజిటబుల్ సీజర్లా కనిపిస్తుంది. దీన్నుపయోగించి కావాల్సిన కాయగూరల్ని చకచకా కట్ చేసేసుకోవచ్చు. ఇలా కాయగూరలు కట్ చేసే పనిని మరింత సులభతరం చేసిన ఈ కటర్ నాణ్యతను బట్టి ధర రూ. 129 నుంచి రూ. 299 వరకు ఉంది.
ఇలాంటి మరెన్నో సరికొత్త కిచెన్ గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకోవాలంటే www.vasundhara.net లో ప్రతి మంగళవారం ప్రచురించే అప్డేట్స్ని మిస్ కాకుండా చదవండి.
Photos: www.amazon.in