కేరళ కుట్టీలు ఈ రోజు ఓనమ్ వేడుకలు జరుపుకొంటున్నారు. దీంతో ఇన్స్టాపురమంతా తారల ఫొటోలు, వారి శుభాకాంక్షలతో నిండిపోయింది. వీరిలో యాంకర్ సుమా కనకాల, శిల్పా శెట్టి, త్రిష, మీనా, ధన్యా బాలక్రిష్ణన్, అనుపమా పరమేశ్వరన్, మంజిమా మోహన్, నభా నటేష్, లాస్యా మంజునాథ్, కామ్నా జెఠ్మలానీ, పార్వతీ నాయర్, ప్రియమణి, కళ్యాణి ప్రియదర్శన్, ప్రియా ప్రకాశ్ వారియర్, శ్రేయా ఘోషల్, నిధి అగర్వాల్, హంసానందిని, ప్రణీత, మలైకా అరోరా తదితరులు ఉన్నారు.
సంక్రాంతి లాగానే ప్రకృతికి కృతజ్ఞతలు చెబుతూ చేసుకొనే పంటల పండగ ఓనమ్. కేరళలో జరుపుకొనే ఈ పండగ ఏటా నాలుగు నుంచి పది రోజుల వరకూ కొనసాగుతుంది. మహిళలంతా కొత్త దుస్తులు వేసుకొని, సంప్రదాయబద్ధంగా తయారై పూలతో ముగ్గులు వేస్తారు. ఈ సమయంలో బలి చక్రవర్తి ఆత్మ సంచరిస్తుందని వారు నమ్ముతారు. కొత్తగా వచ్చిన పంటతో చేసిన ఆహారాన్ని ఓనమ్ రోజు సాయంత్రం ' ఓనమ్ సాధ్య' పేరుతో తీసుకుంటారు. దీన్ని కూడా అరిటాకు వేసి అందులోనే వడ్డిస్తారు. ఇందులో భాగంగా శాకాహార భోజనం మాత్రమే తీసుకుంటారు. అయితే ఇప్పుడు ‘కొవిడ్’ నామ సంవత్సరం నడుస్తుండడంతో పండగలు పబ్బాలూ అన్నీ ఇంటివద్దనే జరుపుకొంటున్నాం కదా! అలాగే ఈ పండగను కూడా పలువురు తారలు సింపుల్ గా జరుపుకొంటున్నారు. మరి మన అభిమాన తారల ఓనమ్ సంబరాలెలా ఉన్నాయో చూద్దాం రండి...
ఇక ఓనమ్ సంబరాల సంగతి అలా ఉంటే - టాలీవుడ్ స్టార్ కపుల్ మహేష్ బాబు- నమ్రతల ముద్దుల తనయుడు గౌతమ్ ఘట్టమనేని నేడు 14వ పుట్టినరోజును జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా పేరెంట్స్ తో పాటు, చిట్టి చెల్లెలు సీతా పాప నుంచి బర్త్ డే బాయ్ గౌతమ్ పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకున్నాడు.
గౌతమ్ చిన్నప్పటి ఫొటోని పోస్ట్ చేసిన నమ్రత.. ‘ఈ ప్రపంచంలోకి గౌతమ్ అడుగిడినప్పటి నుంచి మా జీవితాల్లో ఆనందం వెల్లివిరిసింది.. ఇప్పుడు 14వ పుట్టిన రోజు జరుపుకొంటున్నాడు.. ప్రతి సంవత్సరం మమ్మల్ని మరింత ఆనందపడేలా చేస్తున్నాడు. అంతేకాదు.. తల్లిదండ్రులుగా మేము గర్వపడేలా చేస్తున్నాడు.. లవ్ యూ సో మచ్’ అంటూ పుత్ర వాత్సల్యాన్ని చాటుకుంది నమ్రత.
ఇక మహేష్ బాబు గౌతమ్ చిన్నప్పటి, ప్రస్తుత ఫొటోలను పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా ‘హ్యాపీ బర్త్ డే మై సన్. నువ్వు మంచి యువకుడిగా ఎదుగుతున్నందుకు గర్వంగా ఉంది. డోరేమాన్ నుంచి అపెక్స్ లెజెండ్స్ వరకు నీతో కలిసి చేసిన ప్రయాణం ప్రత్యేకమైనది. ఈ పుట్టిన రోజు కలకాలం గుర్తుండిపోవాలి.. లవ్యూ’ అంటూ పుత్ర ప్రేమను చాటుకున్నాడీ సూపర్ స్టార్.
ఇక తన చిట్టి చెల్లి సితార గౌతమ్ ఒడిలో తలపెట్టి నవ్వుతోన్న ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘మన మధురపైన జ్ఞాపకాల్లో ఇదీ ఒకటి. హ్యాపీ బర్త్ డే అన్నయ్యా.. క్రైమ్‌లో నాతో కలిసి ఉన్నా.. మొదట దొరికిపోయేది మాత్రం నువ్వే. నువ్వు నా అన్నయ్యగా ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. లవ్ యూ సో మచ్’ అని రాసుకొచ్చిందీ లిటిల్ సిస్టర్.