రెండు నెలల తర్వాత బయటకొచ్చా..!
View this post on Instagram
💗
A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on
భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. సుమారు రెండు నెలలకు పైగా లాక్డౌన్లో ఉన్న ప్రజలు ఇప్పుడిప్పుడే కాస్త ఉపశమనం పొందుతున్నారు. ప్రభుత్వాలు ఇస్తోన్న సడలింపులతో ఇంటి నుంచి అడుగు బయటపెడుతున్నారు.
ఈ క్రమంలోనే తానూ ఇంటి నుంచి బయటకు వచ్చానని అభిమానులతో పంచుకుంది గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా. ఇంటి బయట మాస్కు ధరించిన సమయంలో తీసుకున్న సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ‘కళ్లెప్పుడూ అన్వేషిస్తూనే ఉంటాయి.. రెండు నెలల తర్వాత మొదటిసారి బయటికొచ్చా..’ అనే క్యాప్షన్‌ను జోడించింది. అంతేకాదు.. ఓ ట్రెండీ మాస్కును ధరించిన ఈ అందాల తార.. దాన్ని రూపొందించిన వ్యక్తికి కూడా కృతజ్ఞతలు తెలిపింది.
పాత జ్ఞాపకాలను వదిలేయండి..!
లాక్డౌన్ కారణంగా నచ్చినా నచ్చక పోయినా అందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదనే విషయాన్ని ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు. అయితే కరోనా మిగిల్చిన చేదు జ్ఞాపకాలను మర్చిపోతూ మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిపుణులు సూచిస్తోన్న విషయం తెలిసిందే.
ఇదే విషయాన్ని చెబుతోంది అందాల తార పూజా హెగ్డే. తాజాగా తన హెయిర్ స్టైల్‌ను మార్చుకున్న పూజ.. ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ‘ఈ క్వారంటైన్ సమయం మనకు అందించిన చేదు జ్ఞాపకాలను వదిలేయండి.. కొత్త జీవితం వైపు అడుగులు వేయండి.. నేనీ పనిని నా హెయిర్ కట్‌తో మొదలుపెట్టాను’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించిందీ బుట్టబొమ్మ.
అదేంటో చెప్పుకోండి చూద్దాం!
లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమయ్యామని చాలామంది చింతిస్తున్నారు. సమయమంతా వృథా అయిపోతోందని బాధపడుతున్నారు. అయితే మనసుండాలే కానీ నాలుగ్గోడల మధ్య ఉండి కూడా మన నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చని నిరూపిస్తోంది ఇస్మార్ట్ భామ నిధీ అగర్వాల్. ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఎంచక్కా తమిళ భాష నేర్చుకుంటోందీ అమ్మడు. కాగితంపై ఓవైపు ఇంగ్లిష్ పదం.. మరోవైపు దాని తమిళ పదం.. రాస్తూ కొత్త భాష నేర్చుకునే పనిలో పడిందీ బ్యూటీ. ఈ కాగితాన్ని ఫొటో తీసి ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోతో పాటు.. ‘నేను కొత్త భాష నేర్చుకుంటున్నాను. అదేంటో చెప్పుకోండి చూద్దాం’ అనే క్యాప్షన్‌ను జోడించింది నిధి.
అంతేకాదు.. తన వృత్తిగత నైపుణ్యాలను మెరుగుపరచుకునే ఉద్దేశంతో న్యూయార్క్ ఫిలిం స్కూల్ నుంచి ఆన్లైన్ కోర్సును కూడా నేర్చుకుంటోంది నిధి. ఇక స్క్రిప్ట్ వర్క్‌కు సంబంధించి కూడా ఆన్లైన్ పాఠాలు వింటోందీ బ్యూటీ. లాక్డౌన్ సమయాన్ని నిధి చాలా బాగా ఉపయోగించుకుంటోంది కదూ! మరి మీరు కూడా సమయం వృథా అయిపోతోందని బాధపడకుండా ఏదైనా కొత్త అంశాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయండి.
ఆ వీడియో నా మనసును తాకింది..!
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ట్విట్టర్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ సందర్భంగా ఇంటికే పరితమైన చిరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఒడిశాకు చెందిన ఓ మహిళా పోలీస్ అధికారికి సంబంధించిన వీడియో చూసిన మెగాస్టార్ ఆమె సేవకు ఫిదా అయ్యారు. వివరాల్లోకి వెళితే..
లాక్డౌన్ కారణంగా ఎంతోమంది తినడానికి తిండి లేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారికి పట్టెడన్నం పెట్టేవారు కూడా కరువైపోయారు. ఒడిశాలోని మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అయిన శుభశ్రీ నాయక్.. కొంతమంది వృద్ధ మహిళలకు తానే స్వయంగా అన్నం తినిపించింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియో మన మెగాస్టార్ చిరంజీవి కంట పడింది. దీంతో ఎలాగైనా ఆమెతో మాట్లాడాలనుకున్న చిరు.. మొత్తానికి పోలీసుల సహకారంతో శుభశ్రీతో వీడియో కాల్లో మాట్లాడారు. శుభశ్రీ వృద్ధుల పట్ల చూపిన దాతృత్వానికి మెగాస్టార్ ఫిదా అయ్యారు. ఆమె చేసిన సేవకు సంబంధించిన వీడియో తన మనసును తాకిందని, మీరలా (శుభశ్రీని ఉద్దేశిస్తూ) స్పందించడానికి కారణమేంటని అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు.. ఈ మనసున్న పోలీసును ప్రశంసల్లో ముంచెత్తారాయన. వీరిద్దరి మధ్య జరిగిన పూర్తి సంభాషణను మెగాస్టార్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..